Wedding Feast Murders| ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా జరుగుతున్న ఓ పెళ్లి ఒక పీడకలలాగా మారిపోయింది. ఇద్దరు టీనేజర్లు అందులో ఒక మైనర్ అకారణంగా హత్య చేయబడ్డారు. చిన్న విషయంపై జరిగిన వాగ్వాదం కాస్త హింసాత్మకంగా మారింది. దీంతో కొందరు యువకులు క్షణికావేశంలో విచక్షణారహితంగా దాడి చేసి ఆ ఇద్దరినీ చంపేశారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం అమేఠీ నగరంలో మే 3 2025 రాత్రి అమేఠీ నగరం పరిధిలోని సరాయ్ హ్రిదయ్ షా గ్రామంలో పెళ్లి వేడుక జరుగుతున్నాయి. పెళ్లికొడుకు, అతని బంధువులంతా బాల్ భద్రపూర్ గ్రామం నుంచి వచ్చారు. గ్రామ సర్పంచ్ రామ్ జియవాన్ వర్మ కుమారుడి వివాహం జరుగుతూ ఉంది. అయితే పెళ్లి కూతురు బంధువుల్లో రవి (18), ఆశీష్ (17) అనే టీనేజర్లు అతిథులుగా వచ్చారు. ఆదివారం ఉదయం ముహూర్తం కావడంతో రాత్రి అతిథులందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు.
రవి, ఆశీష్ ఇద్దరు కజిన్స్ (మేనత్త, మేనమామ పిల్లలు) ఒకే కుటుంబానికి చెందినవారు. దీంతో కలిసి భోజనానికి వెళ్లారు. అయితే భోజనాలు పెట్టే ప్రాంతంలో తందూరి రోటీ కోసం వెళ్లగా.. కాసేపు నిరీక్షించాల్సి వచ్చింది. అంతలో రోటీలు రాగానే పెళ్లికొడుకు తమ్ముడు అయిన రోహిత్, అతని స్నేహితులు ఆ రోటీలు తమకే కావాలని పట్టుబట్టారు. దీంతో వారితో రవి, ఆశీష్ వాగ్వాదం చేశారు. తాము ముందు నుంచీ నిలబడి ఉంటే తరువాత వచ్చిన వారు రోటీలు తీసుకోవడం సరికాదని వాదించారు. కానీ అవతలి వారు తాము పెళ్లికొడుకు తరపు బంధువులమని వాదించారు.
Also Read: పడకగదిలో భార్యతో కృూరంగా ప్రవర్తించిన బాడీ బిల్డర్.. యువతి మృతి
అయితే ఈ వాగ్వాదంలో రవి, ఆశీష్.. రోహిత్, అతని స్నేహితులను అవహేళన చేశారు. ఆ తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. రవి, ఆశీష్ తమ స్నేహితులతో కలిసి అర్ధరాత్రి వేళ పెళ్లిలో నుంచి బయట వాకింగ్ కోసం వెళ్లగా వారిని వెనుక నుంచి రోహిత్, అతని స్నేహితులు వెంబడించారు. ఇనుప రాడ్లు, హాకీ స్టిక్లు, లాఠీలతో వారిపై దాడి చేశారు. ఈ ఘటనలో రవి, ఆశీష్ లు తప్ప మిగిలిన వారి స్నేహితులు తప్పించుకొని పారిపోయారు. రవి, ఆశీష్ లు ఇద్దరూ శరీరమంతా గాయాలతో రక్తసిక్తమై రోడ్డున పడి ఉండగా.. వారిపై దాడి చేసిన రోహిత్, అతని స్నేహితులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు రవి, ఆశీష్ కు సమీప ఆస్పత్రికి తరలించారు.
ఆ తరువాత ఆస్పత్రి నుంచి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో ఎయిమ్స్ రాయ్ బరేలి ఆస్పత్రికి వారిని తరలించారు. కానీ వారి పరిస్థితి విషమించడంతో రాజధాని లక్నో నగరానికి తీసుకెళ్లాలని చెప్పారు. లక్నో నగరానికి చేరుకునే మార్గంలోనే ఆశీష్ చనిపోయాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొన్ని గంటల్లోనే రవి కూడా మరణించాడు. దీంతో ఆశీష్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేవలం కొన్ని రోటీల కోసం తన ఇంటి పిల్లలను చంపేశారని.. ఎంతో భవిష్యత్తు ఉన్న తన కొడుకు నిర్జీవంగా పడిఉన్నాడని చెబుతూ కన్నీరు పెట్టుకున్నాడు.
పోలీసులకు డబుల్ మర్డర్ కేసు నమోదు చేసి 13 మందిని నిందితులుగా ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. వారిలో 8 మందిని అరెస్టు చేశారు. మరో అయిదుగురు పరారీలో ఉన్నారని వారికోసం గాలిస్తున్నామని తెలిపారు.