Thalliki Vandanam Scheme: ‘తల్లికి వందనం’ పథకం కింద ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు ఆ ఫ్యామిలీ చిచ్చు రేపింది. వచ్చిన డబ్బులతో ఇంటి యజమాని ఫుల్‌గా తాగేశాడు. ఆగ్రహంతో మండిపడిన భార్య, భర్తను చంపేసింది. సంచలనం రేపిన ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో వెలుగు చూసింది. అసలేం జరిగింది? ఇంకాస్త డీటేల్స్ లోకి వెళ్తే..
పేదరికం వల్ల చిన్నారులు చదువుకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో ‘తల్లికి వందనం’ పథకం తీసుకొచ్చింది కూటమి సర్కార్. విద్యార్థులు విద్యను మధ్యలో ఆపకుండా కొనసాగించడానికి ఆ కుటుంబానికి ఆర్థిక చేయూత అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. కష్టపడటానికి ఇష్టపడని కొందరు, ఆ డబ్బులపై ఆశపడ్డాడు. చివరకు అవే ప్రాణాలు తీశాయి.
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం రెడ్డిగానిపల్లెకు చెందిన చంద్రశేఖర్- రమాదేవికి రెండు దశాబ్దాల కిందట వివాహం జరిగింది. ఈ దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. చంద్రశేఖర్ తొలుత భనవ నిర్మాణ కార్మికుడిగా పని చేసేవాడు. పిల్లలు పెరగడం, వచ్చిన డబ్బులు చాలక మనశ్శాంతి కోసం మద్యానికి బానిసయ్యాడు. ఫలితంగా కుటుంబాన్ని పట్టించుకోలేదు.
పిల్లలు, భార్యని సైతం పట్టించుకోలేదు. చివరకు రమాదేవి ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. సరిగ్గా అదే సమయంలో పిల్లలకు ‘తల్లికి వందనం’ పథకం డబ్బులు రమాదేవి బ్యాంకు ఖాతాలో పడ్డాయి. భార్య దగ్గర ఏటీఎం తీసుకున్న భర్త చంద్రశేఖర్ ఫుల్‌గా మద్యం తాగేశాడు. మత్తు దిగిన తర్వాత ఆ డబ్బు ఇవ్వాలని భార్య కోరింది. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య గొడవ జరిగింది.
ALSO READ: ఆ కిరాణా కొట్టుకు క్యూ కడుతున్న కుర్రవాళ్లు, పోలీసుల మైండ్ బ్లాక్
జూలై రెండున రాత్రి 11 గంటలకు మద్యం కావాలని భార్యను అడిగాడు చంద్రశేఖర్. భర్తతో విసిగిపోయిన రమాదేవి.. మద్యంలో విషం కలిపి ఇచ్చింది. మద్యం మత్తుతో మళ్లీ భార్యతో గొడవపడ్డాడు. పట్టరాని కోపంతో భర్త గొంతును నులిమేసింది. చంద్రశేఖర్ నడవలేక ఇంట్లోనే పడిపోయాడు. వేకువజామున రక్తం కక్కుకుని ఇంట్లోనే చనిపోయాడు. రూమంతా శుభ్రం చేసి కూలీ పనులకు వెళ్లిపోయింది రమాదేవి.
మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి మద్యం తాగడంతో భర్త చనిపోయాడనే ప్రచారం చేసింది. ఈ విషయం తెలుసుకున్న మృతుడి సోదరుడు మహేశ్.. అన్న గ్రామానికి చేరుకున్నాడు. తన సోదరుడు చంద్రశేఖర్ శరీరంపై గాయాలుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు పోలీసులు. పోస్టుమార్టం నివేదికలో అసలు విషయాలు బయటకు వచ్చాయి.
మద్యంలో విషం కలపడం, గొంతు నులమడం వల్ల మృతి తేలింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. రమాదేవిని అదుపులోకి తీసుకుని విచారించారు. తాను నేరం చేశానని అంగీకరించింది. నిందితురాలిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. తల్లికి వందనం డబ్బులు ఆ ఫ్యామిలీ తీరని విషాదం నింపింది. చంద్రశేఖర్ ఈ లోకాన్ని విడిచిపెట్టగా, భార్య రమాదేవి జైలుపాలైంది. తల్లిదండ్రులు లేని ఆ పిల్లలు అనాధలయ్యారు.