Man Blackmails Wife Rape| సమాజంలో మానవ సంబంధాల స్థాయి దిగజారిపోతోంది. భార్యకు భద్రత కల్పించాల్సిన భర్తే స్వయంగా ఆమెపై అత్యాచారం చేయించాడు. ఆ తరువాత వీడియో చూపించి.. ఇంటర్నెట్ లో పెడతానని బెదిరిస్తూ.. రూ.2 లక్షలు డిమాండ్ చేశాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని ఆగ్రాలో జరిగింది.
పోలీసులు కథనం ప్రకారం.. ఆగ్రా నగరంలోని సీతా నగర్ ప్రాంతంలో నివసించే రాబ్రీ కుమారి (34, పేరు మార్చబడినది) అనే మహిళకు 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమెకు 12 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఆమె భర్త (కిషన్ లాల్ – పేరు మార్చబడినది) మద్యం వ్యసనం కారణంగా ఉద్యోగం కోల్పోయి.. ఎక్కువగా స్నేహితులతో తిరుగుతూ ఉంటాడు. నెల రోజుల్లో ఒకటి రెండు సార్లు మాత్రమే ఇంటికి వస్తాడు. దీంతో జీవనం సాగించడానికి రాబ్రీ కుమారి ఓ చిన్న ఉద్యోగం చేస్తోంది. కిషన్ లాల్ కు సంపాదన లేకపోవడంతో భార్య వద్ద డబ్బులు అడిగేవాడు. ఆమె ఇవ్వకపోవడంతో వేధించేవాడు.
Also Read: దాగుడు మూతలు ఆడుతూ యువకుడి హత్య.. ప్రియురాలు అరెస్ట్
అయితే నెల రోజుల క్రితం కిషన్ లాల్ ఒక రోజు ఇంటికి వచ్చాడు. అతనితో పాటు ఒక స్నేహితుడు కూడా తోడుగా ఉన్నాడు. ఆ సమయంలో కిషన్ లాల్ తన భార్యతో సంతోషంగా మెలిగాడు. బయట హోటల్ నుంచి రుచికరమైన భోజనం కూడా తెచ్చాడు. అందరూ కలిసి భోజనం చేశాక.. కిషన్ లాల్, అతని స్నేహితుడు ఇద్దరూ మద్యం సేవించడానికి కూర్చున్నారు. ఇది చూసి అతని భార్య తనకు అలసటగా ఉందని వెళ్లి నిద్రపోయింది. కొన్ని గంటల తరువాత ఆమెను నిద్రలేపి కిషన్ లాల్ తనకు రూ.5000 కావాలని అడిగాడు. రాబ్రీ కుమారికి అప్పుడు శరీరమంతా నొప్పులుగా అనిపించింది. అయినా భర్తకు అడిగినంత డబ్బులు ఇచ్చి పంపించేసింది.
ఇదంతా జరిగిన నెల రోజుల తరువాత కిషన్ లాల్ మళ్లీ ఇంటికి వచ్చాడు. తనకు రూ.2 లక్షలు వెంటనే కావాలని భార్యను బెదిరించాడు. అంత డబ్బు తన వద్ద లేదని రాబ్రీ కుమారి.. భర్తతో చెప్పగా.. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. భార్య అడిగినంత ఇవ్వడం లేదని.. అప్పుడు కిషన్ లాల్ తన మొబైల్ లో ఒక వీడియో చూపించాడు. ఆ రోజు ఆమె నిద్రపోయేముందు భోజనంలో మత్తు మందు కలిపి ఇచ్చానని.. తరువాత తాను నిద్రపోతున్న సమయంలో తన స్నేమితునితో అత్యాచారం చేయించానని చెప్పాడు. ఆ వీడియోలో కిషల్ లాల్ స్నేహితుడు.. నిద్రపోతున్న రాబ్రీ కుమారిపై అత్యాచారం చేస్తున్నట్లుగా ఉంది.
తనకు రెండు రోజుల్లో రూ.2 లక్షలు ఇవ్వకపోతే ఆ వీడియో ఆన్ లైన్ లో అప్ లోడ్ చేస్తానని భార్యను కిషన్ లాల్ బెదిరించాడు. కానీ రాబ్రీ కుమారి ఆ వీడియో చూసి భయపడిపోయింది. ఆ వీడియో ఎవరికీ చూపించవద్దని భర్తను ప్రాధేయపడింది. కిషన్ లాల్ రెండు రోజుల తరువాత వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. రాబ్రీ కుమారికి ఏం చేయాలో తెలియక.. పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. తన భర్త చేసిన అన్యాయాన్ని చెప్పుకుంది. పోలీసులు కిషన్ లాల్ పై గృహ హింస, అత్యాచారం కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.