Alekhya Chitti Pickles: సోషల్ మీడియాలో ‘అలేఖ్య చిట్టి పికెల్స్’ వివాదం ఎంతలా సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక కస్టమర్ ధరలు ఎందుకు అంత అధికంగా ఉన్నాయి అని ప్రశ్నించినందుకు గానూ.. ఆ అలేఖ్య సిస్టర్స్ లో ఒకరు సదరు కష్టమర్ తో మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సదరు కష్టమర్ అలేఖ్య సిస్టర్స్ లో అలేఖ్య మాట్లాడిన ఆడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజెన్స్ అందరూ ఈ అలేఖ్య సిస్టర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రోల్స్, మీమ్స్ చేస్తూ ఆఖరికి వారు బిజినెస్ క్లోజ్ చేసుకునే స్థితికి తీసుకొచ్చారు.. అయితే ఇక్కడ సెలబ్రిటీలు కూడా ఈ అలేఖ్య చిట్టి పికెల్స్ ఆడియోని.. తమ సినిమా ప్రమోషన్స్ కోసం ఉపయోగించడం పై సర్వత్ర అభియోగాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో తాజాగా నటుడు ప్రియదర్శి(Priyadarshi )ఈ ఇష్యూ పై క్లారిటీ ఇచ్చారు.
అలేఖ్య సిస్టర్స్ వివాదం పై స్పందించిన హీరో ప్రియదర్శి..
‘బలగం’ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న ప్రియదర్శి.. తాజాగా నటిస్తున్న చిత్రం ‘సారంగపాణి జాతకం’ ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని శివ లెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో రూప కొడువయూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయ్. ఇక ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేయగా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లోనే నటుడు ప్రియదర్శి క్లారిటీ ఇచ్చారు.ప్రియదర్శి మాట్లాడుతూ..” సోషల్ మీడియాలో సాగుతున్న ఒక మేజర్ ట్రెండ్ ను మేము కూడా ఫాలో అయ్యి, దాని ద్వారా ప్రమోషన్స్ చేద్దామని అనుకున్నాము. అయితే సినిమాలో ఒక కామెడీ స్క్రిప్ట్ చూసి అలాగే అనుకుంటాం కదా.. ఇది కూడా అంతే అనుకున్నాం. అయితే అదే ఉద్దేశంతో నేను కూడా పచ్చళ్ళు అమ్ముకుంటాను అన్నాను. అంతే తప్ప మేము కచ్చితంగా ఎక్కడ కూడా వాళ్ళ పచ్చళ్ళ గురించి కానీ, ఆ అమ్మాయి ల మీద కానీ ఎలాంటి కామెంట్ చేయలేదు ” అంటూ చెప్పుకొచ్చారు. ఇక మొత్తానికి అయితే ప్రియదర్శి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ప్రమోషన్ వీడియోలో ఏముందంటే..?
ప్రియదర్శి చేసిన ప్రమోషన్స్ విషయానికొస్తే.. ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ను ఇటీవల చిత్ర బృందం స్టార్ట్ చేసింది. ఈ క్రమంలోనే ఒక ప్రమోషనల్ వీడియోను కూడా షేర్ చేయగా.. అందులో ప్రియదర్శి జాతకం బుక్ చూస్తూ ఉంటాడు. పక్కనే కూర్చున్న హీరోయిన్ తన ఫోన్లో ఒక డ్రెస్ చూపిస్తూ.. ఇది ఎంత బాగుందో కదా అంటుంది. దీనికి వెంటనే ప్రియదర్శి.. వావ్ చాలా బాగుంది అంటూనే దాని ధర చూసి ఆశ్చర్యపోతాడు. రూ.14,999 ఉండడంతో ఇంత రేటా చాలా ఎక్కువ అంటాడు. దానికి హీరోయిన్.. నువ్వు కెరియర్ పై ఫోకస్ పెట్టాలి. రేపు నీ పెళ్ళామో లేక గర్ల్ ఫ్రెండ్ ఇలాగే డ్రెస్ చూపించినప్పుడు ధర అంటే వదిలేసి వెళ్ళిపోతుంది. దయచేసి కొన్నాళ్లు ఈ ప్రేమలు, పెళ్లిళ్లు జోలికి వెళ్ళకు. ముష్టి డ్రెస్ ధర అంటున్నావ్ అంటే రేపు నీ పెళ్ళాం కి, ఏ బంగ్లానో బంగారమో ఎలా కొనిపెడతావు అంటూ చెబుతుంది. దీంతో ఈ హీరో పచ్చళ్ళ బిజినెస్ పెడతాను అంటూ చెప్పిన వీడియో వైరల్ గా మారింది.