Vaishnavi Chaitanya : టాలీవుడ్లో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు కరువు అనే వాదన ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఒక రకంగా అది కూడా నిజమేనేమో అనిపిస్తుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న చాలామంది హీరోయిన్లు ఇతర భాషలకు సంబంధించినవారే. ఇక తెలుగు హీరోయిన్లు సైతం కొంతమంది ఇతర భాషల్లోనే ఎక్కువగా రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యంగ్ బ్యూటీ వైష్ణవి చైతన్య టాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. యూట్యూబ్ తో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈ అచ్చ తెలుగందం ఇప్పుడు ఏకంగా కోటి రెమ్యూనరేషన్ తీసుకొనే స్థాయికి ఎదిగింది.
కొత్త ప్రాజెక్ట్ కు కోటి రెమ్యూనరేషన్
టాలీవుడ్లో ప్రస్తుతం హీరోయిన్లకు ఉన్న కొరత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ గ్యాప్ ని వైష్ణవి చైతన్య బాగా ఉపయోగించుకుంటుంది. అలాగే ‘బేబీ’ మూవీతో ఆమెకొచ్చిన పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని దర్శక నిర్మాతలు వైష్ణవి చైతన్యకి ఛాన్సులు ఇవ్వడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైష్ణవి చైతన్యకు ఓ దర్శక నిర్మాత కోటి రూపాయల రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారనే వార్త టాలీవుడ్ లో వైరల్ అవుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆమెకున్న క్రేజ్, ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకొని, నెక్స్ట్ ప్రాజెక్టు కోసం ఈ బడా ఆఫర్ ఇచ్చారట సదరు దర్శక నిర్మాతలు. దీంతో ఇప్పటితరం హీరోయిన్లలో కోటి రూపాయల పారితోషకం అందుకుంటున్న ఫస్ట్ అచ్చ తెలుగు అమ్మాయిగా వైష్ణవి చైతన్య స్పెషల్ గా నిలిచిందని చెప్పొచ్చు.
వైష్ణవి చైతన్య అప్ కమింగ్ సినిమాలు
వైష్ణవి చైతన్య షార్ట్ ఫిలిమ్స్ తో మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఆమె నటించిన లవ్ ఇన్ 143 అవర్స్, సాఫ్ట్వేర్ డెవలపర్ వంటి షార్ట్ ఫిలిమ్స్ ఉన్నాయి. ఆ తర్వాత వరుడు కావలెను, అల వైకుంఠపురంలో వంటి భారీ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసే అవకాశాన్ని దక్కించుకుంది. చివరకు ‘బేబీ’ (Baby Movie) సినిమాలో హీరోయిన్ గా నటించే అద్భుతమైన ఛాన్స్ పట్టేసింది ఈ అమ్మడు. ఇక ‘బేబీ’ సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నప్పటికీ కథలో ఎక్కువగా వైష్ణవి చైతన్య పాత్రకే ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరడంతో వైష్ణవి చైతన్యకు మరింత ఫేమ్, ఫాలోయింగ్ దక్కాయి.
ఈ నేపథ్యంలోనే వైష్ణవి చైతన్యకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం వైష్ణవి చైతన్య రెండు మూడు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. ఇప్పుడు ఆమె ‘జాక్’ (Jack Movie) అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) హీరోగా నటిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 10న ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ కానుంది.
మరోవైపు ’90’s ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్ సీక్వెల్ గా రాబోతున్న సినిమాలో కూడా ఆమె హీరోయిన్ నటిస్తోంది. ఈ మూవీలో వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) ‘బేబీ’ మూవీ తర్వాత మరోసారి రొమాన్స్ చేయబోతున్నారు. ఈ సినిమాకు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత నాగ వంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.