Natural Detoxifiers: శరీరంలో మలినాలు ఉండిపోవడం వల్ల ఆరోగ్యానికి హాని జరిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మలినాల వల్ల అలసట, మలబద్ధకంతో పాటు చర్మ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే శరీరాన్ని ఎప్పటికప్పుడు డీటాక్సిఫై చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. ఇందుకు కొన్ని రకాల ఆహారాలు సహాయపడతాయట. వీటిని తరచుగా ప్రతి రోజూ తీసుకునే డైట్‌లో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
శరీరంలోని మలినాలను తొలగించడానికి అనేక రకాల ఆహారాలు సహాయపడతాయి. వీటిని తింటే శరీరంలోని అనవసరమైన టాక్సిన్లను బయటకు వెళ్లిపోతాయట. అందులో అతిముఖ్యమైన ఆహారాలు ఏటంటే..
నీరు:
బాడీలో నుంచి టాక్సి్న్స్ తొలగిపోవాలంటే శరీరానికి కావాల్సినన్ని నీరు తాగాలని డాక్టర్లు సూచిస్తున్నారు. శరీరంలోని మలినాలను తొలగించడానికి నీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తుందట. బాడీ హైడ్రేటెడ్‌గా ఉంటే మూత్రం ద్వారా టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రతి రోజూ కనీసం 8 గ్లాసుల నీరు తాగాలని సూచిస్తున్నారు.
పచ్చి కూరగాయలు:
పాలకూర, గోంగూర, క్యారెట్ వంటి పచ్చి కూరగాయలను తరచుగా తీసుకునే ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలోని మలినాలను బయటకు పంపించేందుకు ఇవి సహాయపడతాయని అంటున్నారు. ఈ కూరగాయలు ఫైబర్ అధికంగా ఉండి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. వీటిని పరగడుపున సలాడ్ లేదా సూప్‌గా తీసుకోవచ్చు.
పండ్లు:
సిట్రస్ పండ్లు, పుచ్చకాయలు, కర్బూజ, దానిమ్మ వంటి పండ్లు నేచురల్‌గా శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో హెల్ప్ చేస్తాయని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఖాళీ కడుపుతో వీటిని తింటే మలినాలు తొలగిపోవడమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయని అంటున్నారు. ఈ పండ్లలోని ఫైబర్ కంటెంట్ జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేసేందుకు సహాయపడతాయట.
గింజలు:
చియా, బార్లీ, సబ్జా వంటి గింజలు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఇవి శరీరంలోని మలినాలను క్రమంగా తొలగిస్తాయి. వీటిని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య కూడా తొలగిపోతుందని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
పసుపు:
పసుపులోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలో ఉన్న టాక్సిన్లను బయటకు పంపించేందుకు హెల్ప్ చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా చెడు ఇన్‌ఫెక్షన్స్ నుంచి రక్షణ కల్పించడంలో కూడా సహాయపడుతుందట.
ఈ ఆహారాలను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల, శరీరంలోని టాక్సిన్లను సులభంగా బయటకు పంపే ఛాన్స్ ఉందట. అయితే వీటిని ప్రతి రోజూ పరగడుపున తీసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడప్పుడు ఉపవాసం ఉండడం వల్ల కూడా బాడీలో ఉన్న మలినాలు తొలగిపోతాయట.