Ameesha Patel: మామూలుగా ఒక కథ ముందుగా ఒక హీరో దగ్గరకు వెళ్లి.. ఆ తర్వాత మరో హీరోతో ఫైనల్ అవ్వడం అనేది కామన్‌గా జరిగేదే. హీరోలకు మాత్రమే కాదు.. హీరోయిన్ల విషయంలో కూడా అదే జరుగుతుంది. ముఖ్యంగా హీరోయిన్లు అయితే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో కొన్నిసార్లు మంచి కథలను కూడా వదిలేసుకుంటూ ఉంటారు. వారు వదిలేసుకున్న మూవీ హిట్ అయిన తర్వాత వారు చేసిందేంటో వారికి అర్థమవుతుంది. తాజాగా మహేశ్ బాబు హీరోయిన్ అమీషా పటేల్ కూడా అదే ఫీలయ్యింది. షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ఒక క్లాసిక్ హిట్‌ను తాను వదిలేసుకున్న విషయం తనకే తెలియదంటూ ఆశ్చర్యపోయింది.
అప్పుడే తెలియలేదు
షారుఖ్ ఖాన్, రాణి ముఖర్జీ హీరోహీరోయిన్లుగా నటించిన క్లాసిక్ హిట్ సినిమానే ‘ఛల్తే ఛల్తే’. ఈ మూవీ 2003లో విడుదలయ్యి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ముందుగా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ అమీషా పటేల్‌కు వచ్చిందట. కానీ ఆ విషయం తనకే తెలియదంటూ ఆశ్చర్యపోయింది అమీషా. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ సీనియర్ హీరోయిన్ ఈ విషయం గురించి మాట్లాడింది. అసలు ఆ సినిమా తను చేయకపోవడానికి కారణమేంటో బయటపెట్టింది. ‘ఛల్తే ఛల్తే’లో తనను హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకున్న విషయం చాలాకాలం తర్వాత తనకు తెలిసింది అంటూ చెప్పుకొచ్చింది అమీషా.
సెక్రటరీ వల్లే
‘‘నేను, షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) ఒకసారి అనుకోకుండా డబ్బింగ్ స్టూడియోలో కలిశాం. అలా మామూలుగా మాట్లాడుతున్న సమయంలో నువ్వు రిజెక్ట్ చేసిన సినిమా ఏంటో నీకు చూపిస్తా అంటూ ఛల్తే ఛల్తే గురించి చెప్పాడు. అసలు ఆ సినిమాలో హీరోయిన్ రోల్‌ను నాకు ఆఫర్ చేశారనే విషయమే నాకు తెలియదని చెప్పాను’’ అని చెప్పుకొచ్చింది అమీషా పటేల్. ఆ తర్వాత అసలు ఏం జరిగింది అని కనుక్కోగా.. జూహీ చావ్లా, షారుఖ్ ఖాన్ కలిసి ‘ఛల్తే ఛల్తే’లో అమీషా పటేల్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అదే విషయాన్ని అమీషా సెక్రటరీకి చెప్పారు. కానీ అప్పటికే అమీషా చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది.
Also Read: మా అమ్మ సినిమాల్లో నా ఫేవరెట్ అదే.. బయటపెట్టిన ఖుషి కపూర్
రిగ్రెట్ అయ్యాను
అమీషా పటేల్ (Ameesha Patel) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండడంతో ‘ఛల్తే ఛల్తే’ (Chalte Chalte) చేయడం కుదరదు అంటూ తన సెక్రటరీనే మేకర్స్‌కు జవాబు ఇచ్చి కనీసం ఈ విషయాన్ని అమీషాకు కూడా చెప్పలేదట. ఈ విషయం తెలిసిన తర్వాత అమీషా చాలా ఫీలయ్యి షారుఖ్‌తో నటించే అవకాశం కోల్పోయినందుకు రిగ్రెట్ అయ్యిందట. ఆ సినిమా చేయడం కోసం తాను ఏదైనా చేసేదాన్ని అని, కానీ ఆ విషయం తనవరకు రాలేదని చెప్తూ బాధపడింది అమీషా పటేల్. ఆ తర్వాత తన టీమ్‌లో చాలామందిని మార్చేసి తన ప్రొఫెషన్‌కు సంబంధించిన నిర్ణయాలు తానే తీసుకోవడం మొదలుపెట్టానని చెప్పింది. అలా తన పాత టీమ్ వల్ల మరెన్నో ఆఫర్లు కోల్పోయానని బయటపెట్టింది.