Moana: ఒక సినిమాను కాపీ కొట్టారంటూ ఆరోపణలు వస్తే.. దానికి సంబంధించిన నష్టపరిహారం ఒక రేంజ్‌లో ఉంటుంది. ఇప్పటివరకు 50, 100 కోట్ల నష్టపరిహారం గురించి వినుంటారు. కానీ ఒక హాలీవుడ్ సినిమాను కాపీ కొట్టారంటూ ఆరోపణలు రావడం వల్ల దానికి ఏకంగా రూ.80 వేల కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేస్తున్నారు మేకర్స్. వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం.. మామూలుగా డిస్నీ నిర్మించే యానిమేషన్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. చిన్నపిల్లలు మాత్రమే కాదు.. పెద్దవారు కూడా ఈ యానిమేషన్ సినిమాలను ఇష్టపడి చూస్తుంటారు. అలాంటి ఒక యానిమేషన్ సినిమాకు ఇప్పుడు కాపీరైట్స్ కష్టాలు మొదలయ్యాయి.
ఒకటే స్టోరీ
డిస్నీ (Disney) నిర్మాణంలో తెరకెక్కిన ‘మోనా’ (Moana) తన ఐడియాలను కాపీ కొట్టి తెరకెక్కించారంటూ ప్రముఖ యానిమేటర్ అయిన బక్ వుడాల్ (Buck Woodall) లాసూట్‌ను ఫైల్ చేశారు. ఈ లాసూట్ విలువ 10 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపుగా రూ.80 వేల కోట్లు. తను ‘బకీ’ అనే కథను రాసుకున్నానని, ‘మోనా’లోని కాన్సెప్ట్స్ అన్నీ తన ప్రాజెక్ట్‌తో పోలి ఉన్నాయని బక్ ఆరోపిస్తున్నారు. ‘బకీ’ అనే సినిమాలో కొందరు యూత్ అంతా కలిసి తమ భూమిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ‘మోనా’ కూడా దాదాపుగా అదే స్టోరీ లైన్‌తో తెరకెక్కింది. దీంతో ‘మోనా’పై కాపీ రైట్ కేసు వేస్తూ.. దీనిని నిర్మించిన డిస్నీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు బక్ వుడాల్.
Also Read: ఎప్పటికీ ప్రేమిస్తాను అనే మాట అతిపెద్ద అబద్ధం.. అనుపమ హార్ట్ బ్రేక్ అయ్యిందా.?
17 ఏళ్ల కష్టం
గత వారంలో కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో ఈ లాసూట్‌ను ఫైల్ చేశారు బక్ వుడాల్. తన కథలోని ముఖ్యమైన అంశాలను, అందులో ముఖ్యమైన సీన్స్‌ను కాపీ చేశారంటూ డిస్నీపై ఆరోపణలు చేశాడు. ‘మోనా’కు ‘బకీ’కి పోలికలు ఉన్నాయని ఆయన పలు ఉదాహరణలు కూడా చెప్పారు. తాను తన యానిమేషన్ సినిమా కోసం 17 ఏళ్లు కష్టపడిందంతా ‘మోనా’ సినిమాలో ఉపయోగించారని వాపోయాడు. ఒకప్పుడు తన యానిమేషన్ సినిమా కోసం కావాల్సిన ఐడియాలను ప్రస్తుతం డిస్నీ టీమ్‌లో పనిచేస్తున్న జెన్నీ మార్చిక్ అనే దర్శకుడితో పంచుకున్నానని, అతడి వల్లే తన ఐడియాలు కాపీ అయ్యింటాయని అనుమానం వ్యక్తం చేశాడు బక్ వుడాల్.
అప్పుడు రిజెక్ట్
డిస్నీపై బక్ వుడాల్ ఆరోపణలు చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. గతేడాది కూడా ‘మోనా’ సినిమాపై ఇలాగే ఆరోపణలు చేస్తూ లాసూట్ ఫైల్ చేయగా అది రిజెక్ట్ అయ్యింది. ‘మోనా’ కాపీ అని ముందే తెలుసుంటే ఇంతకాలం లాసూట్ ఎందుకు ఫైల్ చేయలేదని కోర్టు ఆయనపై సీరియస్ అయ్యింది. తాజాగా సీక్వెల్ విడుదల అవ్వడంతో బక్ వుడాల్‌కు కేసు ఫైల్ చేయడానికి మరొక అవకాశం దొరికింది. బక్ వుడాల్ లాసూట్‌కు డిస్నీ (Disney) సైతం స్పందించింది. గతేడాది లాసూట్ ఫైల్ చేసినప్పుడు వుడాల్ ఆరోపణలు అబద్ధాలని కొట్టిపారేసింది. కానీ మరోసారి లాసూట్ ఫైల్ అవ్వడంతో దీనిపై డిస్నీ సైతం మౌనం పాటిస్తోంది.