Aditya 369 Re Release: ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాదు.. అంతటా రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. అందుకే పదేళ్లు, 20 ఏళ్లు అని తేడా లేకుండా ఎప్పుడో విడుదలయిన సినిమాలను కూడా మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నారు మేకర్స్. వాటిని ప్రేక్షకులు కూడా కొత్త సినిమాలాగానే ఆదరిస్తున్నారు. అందుకే ఈ రీ రిలీజ్ ట్రెండ్‌కు ఫుల్ స్టాప్ పడడం లేదు. ఈ ట్రెండ్‌లో సీనియర్ హీరో బాలయ్య జాయిన్ అయ్యి కూడా చాలాకాలమే అయ్యింది. ఇక తాజాగా బాలకృష్ణ (Balakrishna) హీరోగా నటించిన మరో సినిమా కూడా ఈ రీ రిలీజ్ ట్రెండ్‌లో జాయిన్ అవ్వనుంది. అదే ‘ఆదిత్య 369’ (Aditya 369). ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాకు ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే దీనిని రీ రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశారు.
అదిరిపోయే కాన్సెప్ట్
అసలు ఇండియన్ సినిమాకు టైమ్ ట్రావెలింగ్ అనే కాన్సెప్ట్‌ను పరిచయం చేసిన సినిమా ‘ఆదిత్య 369’. అప్పట్లోనే చాలా అడ్వాన్స్ గ్రాఫిక్స్‌తో, స్టోరీతో ఈ సినిమా రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అందుకే తెలుగు సినీ చరిత్రలో ఇప్పటికీ ఇదొక స్పెషల్ మూవీగా మిగిలిపోయింది. సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహించిన ఈ మూవీని శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. అప్పట్లో ఇలాంటి ఒక కొత్త కాన్సెప్ట్‌తో సినిమాను తెరకెక్కించినందుకు కొందరు క్రిటిక్స్ దీనిలో లోపాలు వెతికినా ఇప్పటి ప్రేక్షకులు మాత్రం దీనిని ప్రశంసిస్తూనే ఉంటారు. అందుకే ‘ఆదిత్య 369’ ఫ్యాన్స్ కోసం ఈ సినిమాను రీ రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు.
ఆరు నెలల కష్టం
‘ఆదిత్య 369’ రీ రిలీజ్ విషయాన్ని నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ స్వయంగా ప్రకటించారు. ‘‘ఈ ఐకానిక్ సినిమాను 4K ఆడియోతో రీమాస్టర్ చేశాం. దీంతో సౌండ్ క్వాలిటీ మరింత పెరిగింది. దీనికోసం ఆరు నెలల పాటు ప్రసాద్స్ డిజిటల్ టీమ్ కష్టపడింది. 34 ఏళ్ల క్రితం విడుదలయినా కూడా ఇప్పటికీ ఈ సినిమాకు ప్రేక్షకుల్లో విపరీతమైన పాపులారిటీ ఉంది. ఈ సినిమా రీ రిలీజ్ అవుతుందని ప్రకటించగానే దేశవ్యాప్తంగా ప్రేక్షకులు దీని రీ రిలీజ్ డేట్ కోసం ఎదురుచూడడం మొదలుపెట్టారు. అప్పట్లోనే ఈ సినిమా చాలా అడ్వాన్స్ కథతో వచ్చింది కాబట్టి ఇప్పటి ఆడియన్స్‌కు కూడా ఇది కనెక్ట్ అవుతుంది’’ అంటూ చెప్పుకొచ్చారు శివలెంక కృష్ణ ప్రసాద్.
Also Read: 9 నెలల అంతరిక్ష జీవితం.. త్వరలోనే తెర మీదకు సునీతా విలియమ్స్ బయోపిక్
రుణపడి ఉంటాను
‘‘అప్పట్లో నేను కొత్త దర్శకుడు అయినా కూడా నాకు సపోర్ట్ చేసినందుకు బాలయ్యకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. తెలుగు తెరపై అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించారు సింగీతం శ్రీనివాస రావు. అప్పట్లో ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎంత థ్రిల్లింగ్‌గా ఫీల్ అయ్యానో రీ రిలీజ్‌కు కూడా అలాగే ఫీలవుతున్నాను. నేను ఎన్ని సినిమాలు నిర్మించినా ఆదిత్య 369 మాత్రం ఎప్పటికీ స్పెషల్‌గా మిగిలిపోతుంది’’ అంటూ సినిమాలో పనిచేసిన ప్రతీ ఒక్కరి గురించి ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నాడు శివలెంక కృష్ణ ప్రసాద్. మొత్తానికి ‘ఆదిత్య 369’ ఏప్రిల్ 11న మరోసారి థియేటర్లలో విడుదలయ్యి ఫ్యాన్స్‌ను ఖుషీ చేయనుందని ప్రకటించారు.