Harsha Sai: ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా బెట్టింగ్ యాప్స్ గురించే హాట్ టాపిక్ నడుస్తోంది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ అనేవి ఎంత ప్రమాదకరం, వాటికి అడిక్ట్ అయితే జీవితం ఎలా మారిపోతుంది అని ఎవరు ఎన్నిసార్లు చెప్తూ ఉన్నా కూడా యూత్ మాత్రం వినకుండా వాటికే అలవాటు పడ్డారు. అలా అలవాటు పడడం వల్ల చాలామంది ఆత్మహత్య వరకు కూడా వెళ్లారు. దీంతో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌పై పోలీసులు, అధికారులు సీరియస్‌గా ఫోకస్ పెట్టారు. అలా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తూ అధికారుల దృష్టిలో క్రిమినల్ అయ్యాడు హర్ష సాయి. తాజాగా హర్ష సాయి చేసిన పాపాల వల్లే ఇలా జరుగుతుందని, ఇదంతా తన కర్మ అంటూ బిగ్ బాస్ బ్యూటీ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బయటికొచ్చిన మిత్ర శర్మ
చాలామంది ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడం వల్ల ఈజీగా డబ్బులు వచ్చేస్తాయని ఆ మార్గాన్ని ఎంచుకున్నారు. ఒకరిని చూసి మరొకరు దీనికి బాగా అలవాటు పడ్డారు. అందుకే ఇప్పటికే పలువురు ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు భయపడి చాలామంది పరారీలో కూడా ఉన్నారు. అందులో హర్ష సాయి కూడా ఒకడు. ఇప్పటికే హర్ష సాయిపై కొన్నాళ్ల క్రితం ఒక బిగ్ బాస్ బ్యూటీ మిత్ర శర్మ చీటింగ్ కేసును నమోదు చేసింది. అప్పటినుండి తను ఎవ్వరికీ దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. తాజాగా తనపై బెట్టింగ్ యాప్స్ కేసు కూడా నమోదు అవ్వడంతో మరోసారి మిత్ర బయటికి వచ్చి దీనిపై సోషల్ మీడియా ద్వారా స్పందించింది.
తప్పు ఒప్పుకో
‘హలో మిస్టర్ చీటర్. మళ్లీ బ్యాంకాక్‌కు పారిపోయావు అంట కదా.. నువ్వు మమ్మల్ని మోసం చేసి మా జీవితాలు నాశనం చేశావు. ఇప్పుడు కర్మ నిన్ను తిరిగి కొట్టడం మొదలుపెట్టింది. కనీసం ఇప్పటికైనా నా మాట విని మారు. ఈ సమాజానికి, నీ ఫాలోవర్స్‌కు సారీ చెప్పి నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయను అని వీడియో తీసి అందరి ముందు నీ తప్పు ఒప్పుకో. ఇప్పుడే బ్యాంకాక్ నుండి వచ్చేయ్’ అంటూ హర్ష సాయి (Harsha Sai)ని ఉద్దేశిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ షేర్ చేసింది బిగ్ బాస్ బ్యూటీ మిత్ర శర్మ. అంతే కాకుండా బెట్టింగ్ యాప్స్‌ను అరికట్టాలనే సజ్జనార్ నిర్ణయం వల్ల చాలా కుటుంబాలు బాగుపడుతున్నాయని ఆయనకు థాంక్యూ చెప్పింది.
Also Read: నా జీవితంలో అదొక్కటి మర్చిపోలేను.. కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన..
మీరే ఆదర్శం
బెట్టింగ్ యాప్స్ గురించి, దానిని ప్రమోట్ చేసిన ఇన్‌ఫ్లుయెన్సర్స్ గురించి బయటపడినప్పటి నుండి యూట్యూబర్ అన్వేష్ కూడా దీనిపై తెగ వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కు సంబంధించిన వివరాలు బయటపెట్టాడు. తన గురించి కూడా మిత్ర శర్మ (Mitraaw Sharma) తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ప్రస్తావించింది. ‘మీరు చాలా గొప్ప పనిచేశారు అన్వేష్ గారు. తర్వాతి తరాలకు మీరు ఆదర్శం’ అంటూ అన్వేష్‌ను తెగ పొగిడేసింది. మొత్తానికి హర్ష సాయి మాత్రమే కాదు.. ఇంకా చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినందుకు పోలీసుల నుండి తప్పించుకొని తిరుగుతున్నారు.