C Prem Kumar: ఒక సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయితే చాలు.. అందులో నటించిన నటీనటులు ఎవరు? దానిని తెరకెక్కించింది ఎవరు? అది ఏ భాష? అనేది పెద్దగా పట్టించుకోరు. అలా భాషకు అతీతంగా అందరికీ కనెక్ట్ అయ్యే సినిమాలు చాలా తక్కువే ఉంటాయి. అందులో తమిళ చిత్రం ‘96’ కూడా ఒకటి. ఆరేళ్ల క్రితం విడుదలయిన ఈ మూవీ.. ఆడియన్స్‌పై మామూలు ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. కొన్నాళ్ల పాటు ప్రేక్షకులు అందరికీ ఈ సినిమా గురించే హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ‘96’ దర్శకుడు ప్రేమ్ కుమార్ (C Prem Kumar).. సినిమా రిలీజ్ తర్వాత ఒక ఆసక్తికర సందర్భాన్ని అందరితో పంచుకున్నారు.
వేర్వేరు జోనర్లలో హిట్
‘96’ లాంటి ఎవర్‌గ్రీన్ క్లాసిక్ లవ్ స్టోరీని తెరకెక్కించిన తర్వాత ఇటీవల కార్తీ, అరవింద్ స్వామి మల్టీ స్టారర్‌గా ‘మెయిరగన్’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఇదే సినిమాను ‘సత్యం సుందరం’ అనే పేరుతో తెలుగులో డబ్ చేశారు. తమిళంలో మాత్రమే కాదు.. తెలుగులో కూడా ఈ మూవీ క్లీన్ హిట్‌ను అందుకుంది. మొదటి సినిమాను ప్రేమకథగా తెరకెక్కించి, రెండో సినిమాను పూర్తిగా ఫీల్ గుడ్ జోనర్‌లో చేసి రెండిటితో సమానంగా ప్రేక్షకులను ఇంప్రెస్ చేయగలిగారు ప్రేమ్ కుమార్. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి చెప్తూ ‘96’ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నానని బయటపెట్టాడు. దాంతో పాటు ఆ మూవీ రిలీజ్ తర్వాత ఎదుర్కున్న పరిస్థితుల గురించి కూడా చెప్పుకొచ్చాడు.
Also Read: మీడియాపై ఉపేంద్ర అసహనం.. నెటిజెన్స్ ఫైర్..!
పాత్రలతో ప్రేమ
‘96’లో హీరోహీరోయిన్లుగా విజయ్ సేతుపతి, త్రిష నటించారు. రామ్, జానుగా వారి పాత్రలు ఎన్నో ఏళ్లు అయినా ఆడియన్స్‌కు గుర్తుండిపోయేలా క్రియేట్ చేశాడు దర్శకుడు ప్రేమ్ కుమార్. సీక్వెల్‌తో మరోసారి రామ్, జానులను తెరపై చూపిస్తానని ప్రేక్షకులకు మాటిచ్చాడు. ‘96’ విడుదలయిన తర్వాత ఒక ముసలావిడ తనను గుర్తుపట్టి దగ్గరకు పిలిచి కొట్టిందని గుర్తుచేసుకున్నాడు. రామ్, జానును ఎందుకు విడగొట్టావని అడిగిందని, ఆ తర్వాత కొట్టినందుకు ఫీల్ అయ్యి ముద్దు కూడా పెట్టిందని తెలిపాడు ప్రేమ్ కుమార్. దాన్ని బట్టి ఈ సినిమాకు, పాత్రలకు ప్రేక్షకులు ఎంతగా కనెక్ట్ అయ్యిందో అర్థమయ్యిందని అన్నాడు ప్రేమ్ కుమార్.
సీక్వెల్ సక్సెస్ అవుతుందా.?
ఒక సినిమా ప్రేక్షకులకు ఫీల్ గుడ్ అనిపించడం.. దాంతో పాటు కమర్షియల్‌గా సక్సెస్ అవ్వడం అనేది చాలా అరుదైన కాంబినేషన్. అలాంటి కాంబినేషన్‌లో ల్యాండ్ మార్క్‌గా మిగిలిపోయింది ‘96’. సినిమాల్లో బెస్ట్ ప్రేమకథలను షార్ట్ లిస్ట్ చేస్తే అందులో ఈ మూవీ కూడా కచ్చితంగా ఉంటుందని ఫ్యాన్స్ అంటుంటారు. అందుకే దీనికి సీక్వెల్ వస్తుందంటే ఫ్యాన్స్ అంతా ఒకవైపు సంతోషంగా ఉండగా.. మరొకవైపు ఆందోళన చెందుతున్నారు. ఒక క్లాసిక్‌గా నిలిచిన సినిమాకు సీక్వెల్ తెరకెక్కించి హిట్ కొట్టిన హిస్టరీ చాలావరకు మేకర్స్‌కు లేదు. మరి ‘96’ సీక్వెల్‌తో ప్రేమ్ కుమార్ అయినా ఈ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి హిట్ కొడతాడా చూడాలి.