Celebrities.. ఇద్దరు వ్యక్తులు వైవాహిక బంధం లోకి అడుగుపెట్టిన తర్వాత తల్లిదండ్రులు కావాలని కలలు కంటారు. తల్లి అవడం కూడా దేవుడి ప్రసాదమే అని చాలామంది చెబుతూ ఉంటారు. అయితే కొంతమందికి పెళ్లయిన ఏడాదిలోపే తల్లిదండ్రులయ్యే భాగ్యం కలుగుతుంది. మరికొంతమంది సంవత్సరాలు తరబడి ఎదురు చూడాల్సి ఉంటుంది. మరికొంతమంది ఎన్నేళ్లయిన పిల్లలు పుట్టకపోతే అత్యాధునిక టెక్నాలజీలను ఉపయోగిస్తూ ఉంటారు. ఉదాహరణకు సరోగసి, ఐవిఎఫ్ వంటి పద్ధతులు కూడా తల్లిదండ్రులుగా మారుస్తున్నాయి. అయితే మరి కొంత మంది తమకు పిల్లలు ఉన్నా సరే ఇతరులను కూడా ఆదుకోవాలి అనే ఆలోచనతో తల్లిదండ్రులు లేని పిల్లలను దత్తత తీసుకొని మంచి మనసు చాటుకుంటున్నారు. అలా పిల్లలను దత్తత తీసుకున్న ఇండియన్ సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
రాజమౌళి..
తెలుగు సినిమా పరిశ్రమ ఖ్యాతిని ఎల్లలు దాటించి, ప్రపంచ స్థాయి గుర్తింపును అందించిన దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజమౌళి ఒక అమ్మాయిని కూతురుగా దత్తత తీసుకున్నారు. రాజమౌళి భార్య రమ మొదటి భర్త సంతానం కాలభైరవ అయితే, కుమార్తె మయూకా మాత్రం రాజమౌళి , రమాకు దత్త పుత్రిక అని చెప్పవచ్చు.
సుస్మితా సేన్:
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ సుస్మితా సేన్ 2000 వ సంవత్సరంలో తనకు 24 ఏళ్ల వయసు ఉన్నప్పుడు రెనీ సేన్ అనే అమ్మాయిను దత్తత తీసుకుంది. ఆ సమయంలో ఈమె తల్లి ఇంత చిన్న వయసులో ఎందుకు అడాప్షన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేయగా , ఈమె తండ్రి ఈమెకు సపోర్టుగా నిలిచారు. ఆ తర్వాత కాలంలో సుస్మితాసేన్ తల్లి కూడా అంగీకరించింది. ఇక 2010లో అలీసా అనే ఇంకో అమ్మాయిని కూడా అడాప్ట్ చేసుకుంది. ఇద్దరిని కూడా ఇప్పుడు సొంత బిడ్డలుగా చూసుకుంటోంది సుస్మితా సేన్. ఈ ఇద్దరు పిల్లలు తన కడుపున పుట్టకపోయినా సొంత బిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటూ ఉండడం గమనార్హం. తెలుగులో రక్షకుడు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది సుస్మిత
రాఘవ లారెన్స్..
కొరియోగ్రాఫర్ గా, నటుడిగా మంచి పేరు సొంతం చేసుకున్న రాఘవ లారెన్స్ ఏకంగా 150 మంది పిల్లలను దత్తత తీసుకున్నారు. వీరందరికీ ఫుడ్, షెల్టర్, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నారు. ముఖ్యంగా ఇంత మంది పిల్లల జీవితంలో రాఘవ లారెన్స్ వెలుగు నింపారని చెప్పవచ్చు. ఈ నటుడు పిల్లల వైద్య ఖర్చులకు కూడా డబ్బులు ఇస్తూ వారికి అండగా నిలుస్తున్నారు.
బండ్ల గణేష్:
ప్రముఖ నిర్మాతగా, నటుడిగా, ఈ మధ్య హీరోగా కూడా మారిన ఈయన పైకి కోపంగా కనిపిస్తారు కానీ మంచి మనసున్న వ్యక్తి.. ఆహారం లేక వీధుల వెంట దయనీయంగా తిరుగుతున్న ఒక నేపాలి అమ్మాయిని దత్తత తీసుకున్నాడు. ఈ విషయాన్ని బండ్ల గణేష్ చెబుతూ.. నా భార్య ఆ నేపాలి అమ్మాయిని మొదటిగా చూసింది. ఆ చిన్నారి తల్లి ఫుడ్ పెట్టే పరిస్థితుల్లో కూడా లేదట. దీంతో చలించి పోయిన నా భార్య దత్తత తీసుకోవాలని అనుకుంది. దీంతో నేను కూడా సహకరించాను. ఆ అమ్మాయిని గొప్ప వ్యక్తిగా పెంచాలనుకుంటున్నాము అంటూ తెలిపారు.
సన్నీ లియోన్..
ఇక వీరితోపాటు సన్నీలియోన్ కూడా 2017లో తన భర్త డేనియల్ వెబర్ తో కలిసి నిషా వెబర్ అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. వీరు దత్తత తీసుకునేటప్పుడు ఆ అమ్మాయి వయసు కేవలం 21 నెలలు మాత్రమే. మహారాష్ట్రలోని లాతూర్ లో ఒక చిన్న గ్రామం నుంచి ఈ పాపను దత్తత తీసుకున్నామని తెలిపింది.