Chinmayi Sripaada: ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కుంటున్న అన్యాయాల గురించి ఓపెన్‌గా మాట్లాడడానికి చాలామంది ఇష్టపడరు. అందుకే ఇప్పటివరకు క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడిన మహిళలు సంఖ్య కూడా చాలా తక్కువే ఉంటుంది. అలాంటిది ఒక్క సింగర్ మాత్రం తాను ఎంత ట్రోల్ అయినా, తనపై ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా అన్యాయాన్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది. తనే చిన్మయి శ్రీపాద (Chinmayi Sripaada). తన సమస్యలు గురించి మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో తనకు ఏది సమస్య అనిపించినా కూడా కచ్చితంగా దాని గురించి సోషల్ మీడియాలో స్పందిస్తుంది చిన్మయి. అలాగే తాజాగా సాయి పల్లవికి సంబంధించిన ఒక విషయాన్ని తెరపైకి తీసుకొచ్చింది.
సక్సెస్‌లో కీలక పాత్ర
ఇప్పటికే హీరోయిన్లకు అసలు ఇండస్ట్రీలో సరిగా గుర్తింపు లభించడం లేదని చాలాసార్లు స్టేట్‌మెంట్ ఇచ్చింది చిన్మయి. తాజాగా సాయి పల్లవి (Sai Pallavi) విషయంలో కూడా మరోసారి ఇదే స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఇటీవల సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన ‘అమరన్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్ల కలెక్షన్స్ సాధించి అందరినీ ఆశ్యర్యపరిచింది. శివకార్తికేయన్ కెరీర్‌లో ఈ రేంజ్‌లో కలెక్షన్స్ సాధించిన మొదటి సినిమా ఇది. అయితే ఈ మూవీ సక్సెస్‌లో సాయి పల్లవి పాత్ర కూడా చాలానే ఉంది. అయినా మూవీ టీమ్ మాత్రం రూ.300 కోట్ల సక్సెస్ పోస్టర్‌లో సాయి పల్లవి ఫోటో వేయలేదు. ఇది చిన్మయికి నచ్చలేదు.
Also Read: ‘అమరన్’కు లీగల్ కష్టాలు.. రూ.1 కోటి డిమాండ్ చేస్తున్న కాలేజ్ స్టూడెంట్, ఎందుకంటే?
చోటు దక్కలేదు
‘అమరన్’ సక్సెస్ పోస్టర్ గురించి మాత్రమే కాదు.. ‘మారి 2’ సినిమాలోని రౌడీ బేబి పాట పోస్టర్‌లో కూడా సాయి పల్లవి కనిపించలేదు. ఈ రెండు పోస్టర్స్‌పై సాయి పల్లవి ఫోటో లేకపోవడంపై చిన్మయి స్పందించింది. ‘సౌత్‌లోని అత్యంత టాలెంట్ ఉన్న, అభిమానం సంపాదించుకున్న హీరోయిన్‌కు కూడా హీరోకు సమానంగా పోస్టర్‌లో చోటు దక్కలేదు. రౌడీ బేబి సక్సెస్ అవ్వడానికి ఢీ వాయిస్ కూడా కారణమే’ అంటూ ట్వీట్ చేసింది చిన్మయి. ఇది చూడగానే ఎప్పటిలాగానే చాలామంది నెటిజన్లు.. చిన్మయి తనకు అనవసరమైన విషయంలో జోక్యం చేసుకుంటుందని కామెంట్స్ చేస్తున్నారు. కానీ సాయి పల్లవి ఫ్యాన్స్ మాత్రం ఇది నిజమే అని ఫీలవుతున్నారు.
క్రెడిట్ దక్కలేదు
ధనుష్‌తో కలిసి సాయి పల్లవి నటించిన ‘మారి 2’ మూవీ ఫ్లాప్ అయ్యింది. కానీ అందులో రౌడీ బేబి పాటకు మాత్రం ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కింది. దానికి ముఖ్య కారణం అందులో సాయి పల్లవి స్టెప్పులే. అయినా కూడా ఈ సాంగ్‌కు యూట్యూబ్‌లో 1 బిలియన్ వ్యూస్ వచ్చినప్పుడు మేకర్స్ విడుదల చేసిన ఒక స్పెషల్ పోస్టర్‌లో సాయి పల్లవి ఫోటో లేదు. ఇప్పుడు ‘అమరన్’ విషయంలో కూడా అదే జరిగింది. ఇప్పటివరకు విడుదలయిన ఒక్క సక్సెస్ పోస్టర్‌లో కూడా సాయి పల్లవి ఫోటోనే కనిపించడం లేదు. దీంతో తన ఫ్యాన్స్ అంతా చిన్మయి చెప్పిన మాటలకు సపోర్ట్ చేస్తున్నారు. సక్సెస్‌లో సాయి పల్లవికి కూడా క్రెడిట్ దక్కాలని అంటున్నారు.