Mohan Babu: గత కొన్నిరోజులుగా మంచు వారి కుటుంబ కలహాల గురించే ఎక్కడ చూసినా హాట్ టాపిక్ నడుస్తోంది. మీడియా, పోలీసులు కూడా ఈ ఫ్యామిలీ మ్యాటర్‌లో భాగం కావడంతో సమస్య మరింత పెద్దగా మారింది. అందుకే ఎక్కడ చూసినా మంచు ఫ్యామిలీ పేర్లే వినిపిస్తున్నాయి. అదే క్రమంలో మీడియాపై దాడి చేసినందుకు మోహన్ బాబుపై కేసు కూడా నమోదయ్యింది. కానీ ఆయనను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు కష్టపడుతున్నారు. తనపై కేసు నమోదు అయినప్పటి నుండి మోహన్ బాబు ఎక్కడికి వెళ్లారో, ఏమైపోయారో తెలియదు. ఇంతలోనే ఢిల్లీ హైకోర్టులో ఆయన వేసిన పిటీషన్‌ను పాజిటివ్ స్పందన రావడంతో కాస్త ఊరట లభించింది.
హక్కులకు భంగం
ప్రస్తుతం మంచు ఫ్యామిలీ ఎక్కడికి వెళ్తే పలు న్యూస్ ఛానెల్స్ కూడా అక్కడికి వెళ్లిపోతున్నాయి. కొన్నిసార్లు వారి పర్మిషన్ లేకుండా వారిని ఫోటోలు, వీడియోలు తీస్తున్నాయి. అంతే కాకుండా వాటిని సోషల్ మీడియా కోసం, యూట్యూబ్ ఛానెల్స్ కోసం, వెబ్‌సైట్స్ కోసం ఉపయోగిస్తున్నాయి. ఇకపై అలా జరగకూడదనే ఆలోచనతో ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు మోహన్ బాబు. వ్యక్తిగతమైన విషయాలను చెప్పడం, చెప్పకపోవడం తమ హక్కు అని, ఇలా తమ ఫోటోలను, వీడియోలను ఉపయోగించడం తమ హక్కులకు భంగం కలిగించినట్టే అని ఈ పిటీషన్‌లో పేర్కొన్నారు మోహన్ బాబు. తాజాగా ఢిల్లీ హైకోర్టు దీనిపై స్పందించింది.
Also Read: అందరి ముందు పరువు పోగొట్టుకున్న రష్మిక.. సారీ చెప్పక తప్పలేదు!
ఏదీ వాడకూడదు
ఇప్పటినుండి అనుమతి లేకుండా మోహన్ బాబు పేరు, ఫోటోలు, వీడియోలు, వాయిస్.. ఇవేవి వాడకూడదని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో మోహన్ బాబుకు కాస్త ఊరట లభించింది. ఇప్పటివరకు ఆయనకు సంబంధించి ఉన్న కంటెంట్‌ను కూడా గూగుల్ తొలగించాలని ఆదేశించింది. ఆయన పేరు, ఫోటో, వీడియో, వాయిస్.. ఇలాంటివి ఏ సోషల్ మీడియా అకౌంట్స్‌లో, ఏఐ బోట్స్‌లో, వెబ్‌సైట్స్‌లో వాడొద్దని సూచించింది. దీంతో ఇన్ని కష్టాల మధ్య మోహన్ బాబుకు అనుకూలంగా ఒక తీర్పు వచ్చిందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇప్పటికీ ఆయన ఆచూకీ తెలియక పోలీసులు గాలిస్తూనే ఉన్నారు.
అలా మొదలయ్యింది
ముందుగా మంచు మనోజ్ (Manchu Manoj)కు, మోహన్ బాబు (Mohan Babu)కు మధ్య ఆస్తి వివాదం రావడంతో ఈ గొడవ మొదలయ్యింది. ఆ తర్వాత తనను తన అనుచరులతో మోహన్ బాబు కొట్టించారని మనోజ్ పోలీసులను ఆశ్రయించాడు. అలా తండ్రీ, కొడుకుల మధ్య మొదలయిన ఆస్తి గొడవ చాలా పెద్దగా మారింది. ఆపై తనను, తన భార్యను ఇంట్లోకి రానివ్వడం లేదని మీడియా ముందే రచ్చ చేశాడు మనోజ్. మనోజ్ భార్య భూమా మౌనిక వల్లే ఈ సమస్యలు మొదలయ్యాయని ఇండస్ట్రీలో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. మొత్తానికి పరిస్థితి కాస్త కుదుటపడింది అనుకునేలోపే ఒక జర్నలిస్ట్‌పై మైక్‌తో దాడి చేసిన కేసులో మోహన్ బాబును పోలీసులు అదుపులోకి తీసుకోవాల్సి ఉంది. కానీ ఆయన మాత్రం ఎక్కడ ఉన్నారో తెలియకుండా తప్పించుకొని తిరుగుతున్నారు.