Poster Talk Septmber : ఆగష్టు నెలలో తెలుగు సినిమా ఫాన్స్ కి నిరాశే మిగిలింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయినా పెద్ద సినిమాలు అక్కటుకోలేకపోయాయి. కూలీ, వార్ 2 లాంటి స్టార్ హీరో సినిమాలు ఫెయిల్ అవ్వడం వల్ల ఆడియన్స్ జేబులకు చిల్లు పడినట్టే అని చెప్పాలి. కూలీ, వార్ 2 డబ్బింగ్ సినిమాలు అనుకుంటే, స్ట్రెయిట్ తెలుగు సినిమాలు పరదా, సుందరకాండ, మేఘాలు చెప్పిన ప్రేమ కథ లాంటి మరెన్నో చిన్న సినిమాలు కూడా నిరాశే మిగిలించాయి.
కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్న కూడా ఇలా ఎందుకు విఫలమౌతున్నాయి? కథలో లోపమా లేదా రివ్యూలు కారణమా ? లేదా టికెట్ రేట్లు పెరిగినందుకు ప్రేక్షకులు థియేటర్‌కి వెళ్ళడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయా ? అని ఆలోచిస్తే.. ఇండస్ట్రీ విశ్లేషకులు మాత్రం ఈ మూడు కారణాలు ఉన్నాయని చెప్తున్నారు, వాటికి తోడు సినిమాను తెరకెక్కించే దర్శక నిర్మాతలకు సినిమాను ప్రేమించే ప్రేక్షకుడి మధ్యలో దూరం పెరిగిపోతుంది అని అనాలా? ఏది ఎం అయినా అస్తమించిన సూర్యుడు ఉదయించినట్టు, సినిమాకు మళ్లీ మంచి రోజులు వస్తాయి.
సెప్టెంబర్‌లో మూడు పెద్ద సినిమాలు.. రెండు చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఘాటీ సెప్టెంబర్ 5న, మిరాయి 12న, ఇక పవన్ కళ్యాణ్ నటించిన OG 25న విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటు రెండు చిన్న సినిమాలు ఉన్నాయి. ఈటీవీ విన్‌లో 90’స్ ఫేమ్ మౌళితో తీసిన లిటిల్ హార్ట్స్ సెప్టెంబర్ 5నే రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 12న బెల్లంకొండ నటించిన హారర్ సినిమా కిష్కింధపురి విడుదలవుతుంది. ఈ ఐదు సినిమాలు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు.
ఇక డబ్బింగ్ సినిమాల విషయానికి వస్తే, తమిళ్ నుంచి శివ కార్తీయూకేయన్ నటించిన మదరాసి ఈ నెల 5న రిలీజ్ అవుతుంది.
ఈ మొత్తం సినిమాల్లో OG, మిరాయికి బజ్ ఎక్కువుగా ఉంది. అమెరికాలో మెదలైన ప్రీ-బుకింగ్స్‌తో OG రికార్డ్స్ బద్దలు కొడుతుంది. పవన్ కళ్యాణ్ క్రేజ్ తో పాటు, సుజీత్ ఎంచుకున్న గ్యాంగ్‌స్టర్ కథ, కళ్యాణ్ పాత్ర, అతని లుక్స్ అండ్ స్క్రీన్ ప్రెజన్స్, థమన్ సంగీతం ఈ సినిమాకు మెయిన్ హైలట్స్‌గా నిలిచాయి.
కానీ, సినిమా హిట్ అవ్వాలి అంటే ఇవి సరిపోవు. కంటెంట్ లో దమ్ము, కథనంలో పట్టు ఉండాలి. గత నాలుగు సంవత్సరాల నుంచి పెద్ద హీరోలు అందరూ గ్యాంగ్‌స్టర్ సినిమాలే తీస్తున్నారు. వీటిలో కేజీఎఫ్, సలార్ లాంటి సినిమాలు బ్లాక్‌బాస్టర్‌గా నిలిచాయి. మిగితా అన్ని సినిమాలు వీటిని కాపీ కొట్టడానికి ప్రయత్నించి విఫలమైనవే. మరి OGలో సుజీత్ ఎలాంటి కథనంతో వస్తాడో అని వేచి చూడాలి.
ఇకపోతే మిరాయి మూవీ. తేజ సజ్జా, మంచు మనోజ్ నటించిన ఈ సినిమాను ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించాడు. ఈ సినిమా ట్రైలర్‌కి యూనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కంటెంట్‌లో మిథాలజీ స్టోరీతో, సూపర్ హీరో ఎలెమెంట్స్‌ని బ్లెండ్ చేసినట్టు తెలుస్తుంది. యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్ ఆకర్షిస్తున్నాయి. వీటి అన్నింటి వల్ల మంచి ఓపెనింగ్ అయితే వస్తుంది. కానీ సినిమా హిట్ అవ్వాలి అంటే కంటెంట్ కచ్చితంగా క్లిక్ అవ్వాలి.
ఇక ఘాటీ సినిమా మరో రెండు రోజుల్లో విడుదల అవుతుంది. ట్రైలర్ కొంచం బజ్ క్రియేట్ చేసినా… ప్రొమోషన్స్ తక్కువ ఉండటం, పాటలు గాని కథలో కొత్తదనం గానీ కనిపించకపోయేసరికి ఈ సినిమా విజయంపై కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. అయితే, థియేటర్‌లో బొమ్మ పడిన తర్వాత ఆడియన్స్ రిస్పాన్స్ ఎలా ఉందో చూడాలి మరి.
లిటిల్ హార్ట్స్ సినిమా యంగ్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తుంది. ట్రైలర్‌లో ఫన్నీ డైలాగ్స్ ఉండటం కొంత వరకు ప్లస్. దీని వల్ల ప్రేక్షకులు థియేటర్‌కి వెళ్లే ఛాన్స్ అయితే ఉంది. కానీ, ఈ సినిమాను ఓ సమస్య ఉంది. ఇలాంటి సినిమాను అంత డబ్బులు ఖర్చుపెట్టి థియేటర్‌లో ఎందుకు చూడాలి… కొన్ని రోజులు పోతే ఓటీటీలోనే చూడచ్చు అనే మైండ్‌సెట్ ట్రాప్‌లో కొట్టుకుపోయేలా కనిపిస్తుంది.
కిష్కింధపురి సినిమా మేకర్స్ కంటెంట్ కన్నా మంచి గడియని నమ్మినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఒకసారేమో సినిమాను సెప్టెంబర్ 12న రిలీజ్ అవుతున్నట్టు పోస్టర్స్ వదిలారు. తర్వాత… మిరాయి అదే డేట్ వస్తుందని అనుకున్నారేమో… 13కి వాయిదా వేశారు. అయితే 13 డేట్ అంటే శనివారం. అస్సలు కలిసి వచ్చే వారం కాదు అది. మళ్లీ అది రియలైజ్ అయి ఉన్నట్టు ఉన్నారు. వెంటనే తమ సినిమా 12నే రిలీజ్ చేస్తున్నామని పోస్టర్ రిలీజ్ చేసి చెప్పుకున్నారు. ఈ డేట్స్ మార్చడం వల్ల ఇంతకీ సినిమా ఈ నెలలో వస్తుందో లేదో ట్రోల్స్ కూడా వచ్చాయి.
మదరాసి సక్సెస్ కూడా పాజిటివ్ మౌత్ టాక్ మీదనే డిపెండ్ అయి ఉంది. అయితే ఈ సినిమాకు ఉన్న మైనస్ ఏంటంటే… ఆ డైరెక్టర్. మురగదాస్ డైరెక్ట్ చేసిన దర్బార్, సికిందర్ సినిమాలు డిజాస్టర్ కావడంతో ఆయన టైం అయిపొయింది అనే ట్రోల్స్ వచ్చాయి. అలాంటి డైరెక్టర్ మూవీ ఇప్పుడు రిలీజ్ అవ్వకముందే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ రిజెక్ట్ చేస్తున్నారు.
సెప్టెంబర్ మొత్తం OG సినిమా మీదనే ఆశలు పెట్టుకున్నారు డిస్ట్రిబ్యూటర్స్. ఈ ఒక్క సినిమా తప్ప మిగితా అన్ని సినిమాల ఫలితాలు ఇక ఆ భగవంతుడే చూసుకోవాలి అని చేతులు ఎత్తేసినట్టు తెలుస్తుంది. మిరాయికి కూడా కొంత వరకు అలాంటి పరిస్థితే ఉంది. కానీ, రిలీజ్ అయ్యే వరకు ఏం చెప్పలేని పరిస్థితి.
OG , మిరాయి తప్ప మిగితా అన్ని సినిమాలు ఆడియన్స్‌ని థియేటర్‌కి రప్పించే ప్రయత్నం చేసినట్లయితే కనిపించట్లేదు. చూడాలి మరి వీటిలో ఎన్ని సినిమాలు హిట్ అవుతాయో.. ఎన్ని బాక్సాఫీస్ ముందు బొక్కబోర్లా పడి చేతులు కాల్చుకుంటాయో..