Double Ismart OTT Release: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఒక మంచి హిట్ కోసం చాలా ప్రయత్నిస్తున్నాడు. వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. కానీ ఏ ఒక్క చిత్రం అతడికి కంబ్యాక్ ఇవ్వడం లేదు. గతేడాది బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘స్కంధ’ మూవీ చేశాడు. ఫుల్ మాస్ లుక్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యాక్షన్ షురూ చేశాడు. కానీ ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయింది. పోస్టర్లు, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇలా ప్రతి అప్డేట్‌తో సినిమాపై అంచనాలు పెరిగిపోయినా.. రిలీజ్ అనంతరం ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. దీంతో ఈ సినిమాతో కంబ్యాక్ అవుతాడనుకున్న రామ్‌కు నిరాశే మిగిలింది.
మరోవైపు ఈ సినిమాకి దర్శకత్వం వహించిన డ్యాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు గట్టి దెబ్బే తగిలింది. ‘లైగర్’తో కోలుకోలేని స్థితికి చేరుకున్నాడు దర్శకుడు పూరి. ఎన్నో అంచనాలతో పాన్ ఇండియా రేంజ్‌లో లైగర్‌ను రూపొందించాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా అందరి అంచనాలను తలకిందులు చేసింది. బాక్సాఫీసు వద్ద ఘోరంగా విఫలమైంది. ఇక ఆ తర్వాత లైగర్ నుంచి మరింత గుణపాఠం నేర్చుకున్న పూరి ‘డబుల్ ఇస్మార్’తో వచ్చాడు.
Also Read: డబుల్ ఇస్మార్ట్ Vs మిస్టర్ బచ్చన్.. కలెక్షన్లలో ఎవరిది పైచేయంటే..?
ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. తన కెరీర్‌కు కూడా ఈ సినిమా మంచి కంబ్యాక్ ఇస్తుందని అనుకున్నాడు. ఇందులో భాగంగానే ఎలాగైనా ఈ సారి హిట్ కొట్టాలని బాలీవుడ్ నుంచి స్టార్ యాక్టర్‌ను దించాడు. సంజయ్ దత్‌ను విలన్‌గా తీసుకొచ్చి సినిమాపై అంచనాలు పెంచేశాడు. అలా మొదటి నుంచి పోస్టర్లు, టీజర్, ట్రైలర్, సాంగ్‌లతో డబుల్ ఇస్మార్ట్ రేంజ్ వేరే లెవెల్‌కి చేరిపోయింది. అనంతరం ప్రమోషన్స్‌తో మరింత బజ్ క్రియేట్ అయింది. అలా ఎన్నో అంచనాలతో ఆగస్టు 15న గ్రాండ్ లెవెల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కానీ బొమ్మ పడ్డాక అంచనాలు చెల్లా చెదిరిపోయాయి. రొటీన్ స్టోరీతో ఆడియన్స్ విసిగిపోయారు. కొత్తగా కథనం లేకపోవడంతో ప్రేక్షకులు చిర్రెత్తిపోయారు. దీంతో ఈ సినిమా ఫస్ట్ డే నుంచే నెగెటివ్ టాక్ మూటగట్టుకుంది. దీంతో బాక్సాఫీసు వద్ద కూడా పెద్దగా కలెక్షన్లు రాలేదు. ఈ నేపథ్యంలో డబుల్ ఇస్మార్ట్ ఓటీటీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందా అని ఉత్కంఠగా ఎదురుచూశారు. అయితే అనూహ్యంగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ లేకుండానే ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఇవాళ్టి నుంచి అంటే సెప్టెంబర్ 5 నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వంటి భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. అందువల్ల ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు ఓటీటీలో చూసేయొచ్చు.