Jayasudha Comments On Movie Awards: సినీ అవార్డుల మీద చాలా కాలం రకరకాల విమర్శలు ఉన్నాయి. కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని బేస్ చేసుకుని ఇస్తున్నారనే ఆరోపణలూ వస్తున్నాయి. తాజాగా ఇదే విషయాన్ని ప్రస్తావించారు సీనియర్ నటి జయసుధ. కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి ఇవ్వడం సరికాదన్నారు. అవార్డులు అనేవి ఎలక్షన్స్ కాదని గుర్తు పెట్టుకోవాలన్నారు. అవార్డులు ప్రతిభ ఆధారంగా రావాల్సిన అవసరం ఉందన్నారు.
చెప్పుకోలేని భాషలో రూమర్స్!
తాజాగా ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జయసుధ పలు కీలక విషయాలు వెల్లడించారు. సినిమా నటీనటుల గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అత్యంత దారుణంగా ఉన్నాయన్నారు. చెప్పుకోలేని భాషలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంట్లో కుక్కలను కూడా వదలడం లేదన్నారు. వాటి గురించి కూడా వార్తలు రాయడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు.
హీరోలు, డైరెక్టర్లతో ప్రేమలో పడలేదు!
చాలా మంది హీరోయిన్లు, హీరోలతో లేదంటే డైరెక్టర్లతో ప్రేమలో పడతారని, తాను మాత్రం ఎవరితో ప్రేమలో పడలేదన్నారు జయసుధ. సినిమాలు కాకుండా బయటి వ్యక్తితో ప్రేమలో పడినట్లు చెప్పారు. చాలా మంది క్యాస్టింగ్ కౌచ్ గురించి చెప్పినా, తనకు అలాంటి పరిస్థితి ఎదురుకాలేదని వెల్లడించారు.
రామారావుతో ఎక్కువ సినిమాలు
సీనియర్ నటుడు రామారావుతో జయప్రద, శ్రీదేవి ఎక్కువగా యాక్ట్ చేశారని అనుకునేదని, వారి కంటే తానే ఎక్కువగా సినిమాలు చేసినట్లు తెలియడంతో ఆశ్చర్యపోయానన్నారు జయసుధ. రామారావు 100 ఏళ్ల వేడుకలో ప్లే చేసిన వీడియోలో ఈ విషయాన్ని చెప్పడంతో షాకయ్యానన్నారు. ఇక తొలిసారి తాను శ్రీదేవిని చూసి, ఫోటో దిగానని, ఆ తర్వాత ఆమెతో కలిసి సినిమా చేసే అవకాశం దక్కిందన్నారు. జయప్రదతోనూ కలిసి సినిమాలు చేశానన్నారు. ఒకానొక సమయంతో తనకు దర్శకత్వం వహించాలనే ఆశ ఉండేదని, ‘దెయ్యం’ అనే సినిమాకు దర్శకత్వం వహించినట్లు తెలిపారు. ఆ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నట్లు తెలిపారు.
రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు
ఇక తన రాజకీయ జీవితం గురించి జయసుధ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత పొలిటీషియన్స్ పట్ల గౌరవం పెరిగిందన్నారు. రాజకీయ నాయకులను తప్పు బట్టాల్సిన అవసరం లేదన్న ఆమె, తప్పు ఓటర్స్ లోనే ఉందన్నారు. ఒక వేలు రాజకీయ నాయకుల వైపు చూపిస్తే, మిగతా నాలుగు వేళ్లు ఓటర్స్ వైపే చూపిస్తాయనే విషయాన్ని మర్చిపోకూడదన్నారు. ప్రస్తుతం తమ్మారెడ్డి, జయసుధ ఇంటర్వ్యూ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలోనే పూర్తి ఇంటర్వ్యూ భరద్వాజ చానెల్ లో అందుబాటులోకి రానుంది. ఇందులో పలు ఆసక్తికర విషయాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆమె ఏం చెప్పిందనే విషయం తెలియాలంటే.. మరికొన్ని గంటలు ఆగాల్సిందే!
Read Also: గూడెంలో ఫారిన్ గర్ల్స్.. విష్ణు ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడు ?
Read Also: నిజాలు చెప్పిన ఎవరు నమ్మట్లేదు.. ట్రోల్స్ పై ఫైర్ అయిన అభిషేక్!