Jr NTR Fan : ‘దేవర’ (Devara) మూవీ రిలీజ్ టైంలో తారక్ (Jr NTR) అనారోగ్యంతో ఉన్న తన అభిమాని (Kaushik)కి సాయం చేసిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా క్యాన్సర్ తో పోరాడుతూ సదరు అభిమాని కన్ను మూసినట్టుగా సమాచారం.
తారక్ అభిమాని మృతి
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్. ఆయనకి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తారక్ కు డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రతి ఆడియో ఫంక్షన్ లోనూ ఆయన తన అభిమానులను జాగ్రత్తగా ఉండాలని కోరుతారు. అభిమానులను ప్రాణంగా చూసుకునే తారక్ కు… కొద్ది రోజుల క్రితమే తిరుపతికి చెందిన కౌశిక్ అనే తన అభిమాని క్యాన్సర్ తో బాధపడుతున్నాడు అన్న విషయం తెలిసింది. దీంతో అతన్ని ఫోన్ కాల్ ద్వారా పరామర్శించారు ఎన్టీఆర్.
కౌశిక్ తన చివరి కోరిక తారక్ తో మాట్లాడడమే అని చెప్పడంతో, విషయం తెలుసుకున్న తారక్ వీడియో కాల్ ద్వారా అతన్ని పలకరించాడు. “నువ్వు క్యాన్సర్ తో ధైర్యంగా పోరాడి బయటపడాలి. నీకోసం నేను ప్రార్థిస్తాను. నువ్వు బాగుండాలని అందరం కోరుకుంటున్నాము. కచ్చితంగా వీలు చూసుకుని నిన్ను కలుస్తాను. నువ్వు కోలుకున్నాక ఇద్దరం కలిసి దేవర మూవీని చూద్దాం” అని తారక్ ఆ అబ్బాయికి ధైర్యం ఇచ్చాడు. కౌశిక్ తల్లితో కూడా మాట్లాడి ధైర్యం చెప్పారు. ఇక ఆ అబ్బాయి ట్రీట్మెంట్ కు అయ్యే ఖర్చులకు సపోర్ట్ కూడా చేశారు తారక్ అభిమానులు. కానీ చివరకు కౌశిక్ క్యాన్సర్ తో పోరాడి ఓడిపోయాడు. తాజా సమాచారం ప్రకారం కౌశిక్ నిన్న 11 గంటలకు అనారోగ్యంతో కన్నుమూశాడు. ఇక విషయం తెలుసుకున్న తారక్ ఫ్యాన్స్ వీరాభిమాని కౌశిక్ ఎన్టీఆర్ ను చూడకుండానే కన్ను మూయడంపై బాధను వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కౌశిక్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.
చివరి కోరిక తీరకుండానే తిరిగిరాని లోకాలకు…
“బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న నా కొడుకును కనీసం ‘దేవర’ సినిమా రిలీజ్ అయ్యేదాకా అయినా బ్రతికించండి” అంటూ కొన్నాళ్ళ క్రితం కౌశిక్ తల్లి తిరుపతి ప్రెస్ మీట్ లో కన్నీటి పర్యంతం అయ్యింది. తిరుపతిలోని వినాయక సాగర్ లో నివాసం ఉంటున్న సరస్వతి కుమారుడు కౌశిక్. అతను జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని. డిగ్రీ రెండవ సంవత్సరం తిరుపతిలోని ఎమెరాల్డ్స్ కాలేజ్ లో చదువుతున్న అతను సడన్ గా ఫీవర్ బారిన పడ్డాడు. ఎన్నో ఆసుపత్రులు తిరిగిన తరువాత అతనికి క్యాన్సర్ ఉందని డాక్టర్లు కన్ఫామ్ చేశారు.
దీంతో చివరిసారిగా తన అభిమాన హీరో ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’ని చూసేదాకా అయినా బ్రతకాలని కోరుకున్నాడు కౌశిక్. ఇక ఆ తరువాత ఎన్టీఆర్ వీడియో కాల్ మాట్లాడి, వైద్యానికి కావాల్సిన సాయం చేస్తానని మాట ఇవ్వడం తెలిసిందే. దీంతో ఎన్టీఆర్ ను చూడడమే తన చివరి కోరిక అని చెప్పాడు కౌశిక్. అతని వైద్యం కోసం టీటీడీ రూ. 40 లక్షలు, ప్రభుత్వం రూ. 11 లక్షలు, ఎన్టీఆర్ అభిమానులు సుమారు రూ. 10 లక్షల వరకు విరాళంగా అందించారు. ఎన్టీఆర్ టీమ్ తరపున సాయం అందాక, డిశ్చార్జ్ కూడా చేశారు. అంతలోనే కౌశిక్ తల్లి తమకు ఎన్టీఆర్ సాయం చేయలేదని కామెంట్స్ చేయడం, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ క్లారిటీ ఇవ్వడం వంటి పరిణామాలు జరిగాయి. ఇన్ని రోజుల తరువాత సడన్ గా కౌశిక్ ఎన్టీఆర్ ను చూడాలన్న కోరిక తీరకుండానే తిరిగిరాని లోకాలను వెళ్ళిపోవడం విచాకరం.