KA Paul: ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్‌పై చర్యలు తీసుకోవడానికి ప్రారంభమయిన ఒక కేసు.. రోజురోజుకీ కొత్త మలుపు తిరుగుతోంది. ఐపీఎల్ సీజన్ ప్రారంభమయ్యింది కాబట్టి అంతకంటే ముందే బెట్టింగ్ యాప్స్‌ను పూర్తిగా అరికట్టాలని పోలీసులు, అధికారులు నిర్ణయించుకున్నారు. అందుకే ముందుగా వాటిని ప్రమోట్ చేస్తున్న వారిపై ఫోకస్ పెట్టారు. అలా ఒక్కొక్క ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌పై, యూట్యూబర్‌పై కేసులు నమోదు చేసుకుంటూ వెళ్లారు. అంతలోనే వాటిని ప్రమోట్ చేస్తున్న సినీ సెలబ్రిటీల పేర్లు కూడా బయటికొచ్చాయి. దీనిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మండిపడ్డారు. వీటిని ప్రమోట్ చేస్తున్న వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
బ్యాన్ చేశారు
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ విషయం రోజురోజుకీ సీరియస్ అవుతుండడంతో కేఏ పాల్ రంగంలోకి దిగారు. ఇటీవల వాటిని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై మండిపడ్డారు. అంతే కాకుండా తాజాగా మనీ గేమింగ్, బెట్టింగ్ యాప్స్‌పై సుప్రీం కోర్టులో పిల్ కూడా దాఖలు చేశానని చెప్పుకొచ్చారు కేఏ పాల్. ఆపై దీని గురించి మీడియాతో మాట్లాడారు. బెట్టింగ్ యాప్స్ అనేవి డ్రగ్స్ కంటే ప్రమాదకరమైనవి అని అన్నారు. ప్రతీ ఇంట్లో ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అలా బెట్టింగ్ యాప్స్ అనేవి ఫోన్‌లలోనే లభిస్తున్నాయి కాబట్టి వాటి వల్ల చాలా నష్టం జరుగుతుందని వాపోయారు. తెలంగాణలోని ఇలాంటి యాప్స్‌ను బ్యాన్ చేసి చాలాకాలం అయ్యింది. అయినా చాలామంది ఇంకా వీటిని ఉపయోగిస్తున్నారు.
వాళ్లే రోల్ మోడల్స్
తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ (Betting Apps) బ్యాన్ అయినా కూడా వీటిని ఉపయోగించి అప్పులపాలయ్యి 978 మంది ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్టు సర్వేలో తేలిందని కేఏ పాల్ బయటపెట్టారు. మామూలుగా క్రికెటర్స్‌ను, సినీ సెలబ్రిటీలను యూత్ అంతా రోల్ మోడల్‌లాగా తీసుకుంటారు. అలాంటి రోల్ మోడల్సే వారి జీవితంలో సైతాన్లుగా మారారని స్టేట్‌మెంట్ ఇచ్చారు. వారే పరోక్షంగా అందరి చావులకు కారణమయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మామూలుగా బెట్టింగ్ యాప్స్ వల్ల రూ. 7 నుండి 14 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వాలు తెలిపాయని, కావాలంటే అంతకంటే ఎక్కువ నిధులు తాను తెచ్చిపెడతానని మాటిచ్చారు కేఏ పాల్ (KA Paul).
Also Read: విచారణకు డుమ్మా కొట్టిన రీతూ చౌదరీ.. పోలీసుల నెక్ట్స్ స్టెప్ అదేనా.?
వదిలిపెట్టను ఈడ్చుకెళ్తాను
ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి కాబట్టి మనీ గేమింగ్ యాప్స్‌ను వెంటనే బ్యాన్ చేయాలని కోరారు కేఏ పాల్. అంతే కాకుండా ఈ యాప్స్‌ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలంతా 72 గంటల్లో అందరి ముందుకు వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దాంతో పాటు ఈ యాప్స్ వల్ల నష్టపోయిన వారికి నష్టపరిహారం ఇప్పించాలని అన్నారు. దీనిలో భాగమయిన ఏ ఒక్క సెలబ్రిటీని వదిలిపెట్టనని వార్నింగ్ ఇచ్చారు. ఇది బెదిరింపు కాదని, నిజంగానే అందరినీ ఈడ్చుకెళ్తానని స్టేట్‌మెంట్ ఇచ్చారు కేఏ పాల్. ఇప్పటికీ సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడంపై ఎంతోమంది స్పందించినా కేఏ కామెంట్స్ మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి.