Kanguva Director Siva: తెలుగు సినిమా చరిత్రనే మార్చేసే విధంగా ‘బాహుబలి’ అనే సినిమా తెరకెక్కింది. అప్పటినుండి కోలీవుడ్ కూడా ఇలా తమకంటూ ఒక రికార్డ్ బ్రేకింగ్ మూవీ ఉండాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు తమిళం నుండి వచ్చిన ప్యాన్ ఇండియా సినిమాలు ఏవీ ఆ రేంజ్‌లో హిట్ అందుకోలేకపోయాయి. ఇప్పుడు ఆ టార్గెట్‌ను పూర్తి చేయాలనుకుంటోంది ‘కంగువ’ (Kanguva). భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ త్వరలోనే విడుదల కానుండగా దీని గురించి మరెన్నో విశేషాలు పంచుకున్నారు దర్శకుడు శివ (Siva). ‘కంగువ’లో గెస్ట్ రోల్ గురించి అంతటా హాట్ టాపిక్‌గా మారగా దానిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
తెలుగులో సినిమాలు
‘‘కంగువలో ఒక సర్‌ప్రైజింగ్ గెస్ట్ రోల్ ఉంటుంది. అదే సీక్వెల్‌కు దారితీస్తుంది. ఆ పాత్రను ఎవరు పోషించారో తెలియాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే. తెలుగు సినీ పరిశ్రమలో ప్రతీ ఒక్క స్టార్‌తో పనిచేయాలనే ప్లాన్స్ ఉన్నాయి. నా దగ్గర కొన్ని ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. సమయం వస్తే తెలుగు స్టార్లతో కూడా పనిచేస్తాను’’ అంటూ తన మనసులోని మాటలను బయటపెట్టారు శివ. తమిళంలో శివకు యాక్షన్ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు లభించినా ఆయన తెలుగులో కూడా పలు చిత్రాలను డైరెక్ట్ చేశారు. గోపీచంద్‌తో ‘శౌర్యం’, ‘శంఖం’ అనే సినిమాలు చేశారు. రవితేజతో ‘దరువు’ను డైరెక్ట్ చేసింది కూడా ఆయనే. అప్పటినుండి ఇప్పటివరకు మళ్లీ తెలుగు తెరవైపుకు రాని శివ.. ఇప్పుడిలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read: దీపావళి ధమాకా ముగిసింది.. ఈ పండగకు అసలైన విన్నర్ ఎవరంటే?
హగ్ చేసుకున్నారు
తెలుగులో కూడా ‘కంగువ’ను భారీ రేంజ్‌లోనే విడుదలకు ప్లాన్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా పలుమార్లు విడుదలను వాయిదా వేసుకోగా ఫైనల్‌గా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకు శివ.. 9 సినిమాలను మాత్రమే డైరెక్ట్ చేయగా ‘కంగువ’ తన పదో సినిమా. ఈ సినిమా కథ సూర్యకు వినిపించినప్పుడు ఆయన చాలా బాగుందంటూ హగ్ చేసుకున్నారని గుర్తుచేసుకున్నారు శివ. ‘కంగువ’ ప్రయాణం రెండేళ్ల క్రితం ప్రారంభం కాగా దీనిని ఎలాగైనా 3డీలోనే తెరకెక్కించాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ఇక ఈ సినిమా 3డీలో ఒక స్పెషల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని శివ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
చాలా కష్టపడ్డారు
‘కంగువ’లో ఫ్లాష్‌బ్యాక్‌లో సూర్య మేకప్ కోసం చాలా కష్టపడ్డారని బయటపెట్టారు శివ. అయితే ఇలాంటి మూవీలో బాబీ డియోల్ లాంటి బాలీవుడ్ నటుడిని విలన్‌గా తీసుకోవడానికి కారణం ఏంటని ప్రశ్నించగా ఆయన స్వాగ్ నచ్చిందని తెలిపారు. దిశా పటానీ క్యారెక్టర్ కూడా సినిమాలో చాలా స్పెషల్‌గా ఉంటుందన్నారు. ఇక ఇప్పటివరకు విడుదలయిన టీజర్, ట్రైలర్‌ను బట్టి చూస్తే ఇదొక సైన్స్ ఫిక్షన్ కథ అని అర్థమవుతోంది. ఇందులో సూర్య.. రెండు డిఫరెంట్ పాత్రల్లో కనిపించనున్నాడు. ఇప్పటివరకు మూవీ టీమ్ చేసిన ప్రమోషన్స్ వల్ల, సినిమాకు వచ్చిన ఔట్‌పుట్ వల్ల ‘కంగువ’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే క్రియేట్ అయ్యాయి.