Movie Ticket Price : సినిమా టికెట్ ధరలు కొన్నిసార్లు ఆకాశాన్ని తాకుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న సినిమాల విషయంలో ఇలా భారీ టికెట్ ధరలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి. కానీ తాజాగా కర్ణాటక అసెంబ్లీలో ముఖ్యమంత్రి సిద్ధా రామయ్య (CM Siddharamaiah) బడ్జెట్ సమావేశంలో సినిమా టికెట్ ధరలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై అక్కడ టికెట్ ధరలు రూ.200 మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
ఇకపై టికెట్ ధర రూ.200లే
2025- 26కు సంబంధించిన కర్ణాటక బడ్జెట్ ను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తాజాగా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అందులో 4,08,647 కోట్ల బడ్జెట్ ను ఆయన సభ ముందుకు తీసుకువచ్చారు. అందులో మతపరమైన కేటాయింపులు, సినిమా ప్రమోషన్స్, మహిళా సాధికారతతో పాటు మౌలిక సదుపాయాలు వంటి అంశాలను కీలకంగా ప్రస్తావించారు. ముఖ్యంగా సినీ రంగానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను సిద్ధరామయ్య ప్రభుత్వం సభ ముందుకు తీసుకురావడం హాట్ టాపిక్ గా మారింది.
సినిమా రంగాన్ని ప్రోత్సహించడం కోసమే మూవీ టికెట్ ధరలను రూ. 200 నిర్ణయించాలని డిసైడ్ అయ్యామని సిద్ధా రామయ్య చెప్పారు. ఇకపై మల్టీప్లెక్స్ లతో సహా రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో కూడా, అన్ని షోలకు ఇదే రేటు వర్తిస్తుందని ఆయన తెలిపారు. సామాన్యులకు కూడా సినిమాను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి సిద్ధా రామయ్య వెల్లడించారు. అంతేకాకుండా కన్నడ సినిమాలను ప్రమోట్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఓ కొత్త ఓటీటీ ప్లాట్ఫామ్ ను సైతం అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్టు ఆయన ఈ సందర్భంగా అనౌన్స్ చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో మైసూర్ లో ఫిలిం సిటీని నిర్మించడానికి 150 ఎకరాల భూమిని కూడా ఇస్తున్నట్టు ప్రకటించి, ఇండస్ట్రీకి గుడ్ న్యూస్ చెప్పారు ముఖ్యమంత్రి. దీని నిర్మాణానికి ఏకంగా 500 కోట్ల బడ్జెట్ ను ఆయన కేటాయించడం మరో విశేషం.
తక్కువ ధరకే ప్రభుత్వ ఓటీటీ
కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం మల్టీప్లెక్స్ లలో సాధారణ సీట్లకు టికెట్ ధర 200 దాటకూడదని తెలుస్తోంది. కానీ గోల్డ్ క్లాస్ స్క్రీన్లు, గోల్డ్ క్లాస్ సీట్లకు ఈ రూల్ వర్తించదని రూమర్లు వినిపిస్తున్నాయి. అలాగే కన్నడ సినిమాలను ప్రోత్సహించడానికి మల్టీప్లెక్స్ లలో కన్నడ, తులు వంటి ప్రాంతీయ సినిమాలను ప్రైమ్ టైంలో ఖచ్చితంగా ప్రదర్శించాలని కొత్త రూల్ ని ప్రభుత్వం తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వం తీసుకురాబోతున్న ఓటిటి ప్లాట్ఫామ్ ని సబ్స్క్రైబ్ర్ల లకి తక్కువ ధరలోనే ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురాబోతుందని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఇతర ఓటీటీలు సబ్స్క్రిప్షన్ కింద జనాల నుంచి భారీగా వసూలు చేస్తున్నాయి. అయితే కన్నడ సినిమాల ప్రమోషన్ల కోసమే ప్రత్యేకంగా ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ తీసుకొస్తున్న ప్రభుత్వం, జనాల దృష్టిని ఆకర్షించడానికి, ప్రేక్షకులపై భారం పడకుండా ఉండడానికి తక్కువ ధరకే సబ్స్క్రిప్షన్ ను తీసుకొస్తుందని టాక్ నడుస్తోంది. కానీ ఈ వార్తలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.