Keerthy Suresh: హీరోలు మాత్రమే కాదు.. హీరోయిన్లు కూడా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ వైవిధ్యభరితమైన పాత్రలు ఎంచుకుంటూ ముందుకెళ్తున్నారు. ఒకే విధమైన పాత్రలు ఎంచుకోవడం వల్ల వారికి పెద్దగా గుర్తింపు రాదని అర్థం చేసుకుంటున్న హీరోయిన్లు రూటు మారుస్తున్నారు. అందులో కీర్తి సురేశ్ కూడా ఒకరు. సౌత్‌లో ఉన్నంతవరకు తనను మహానటిగా గుర్తించారు ప్రేక్షకులు. కానీ బాలీవుడ్‌లో అడుగుపెట్టిన తర్వాత తను పూర్తిగా మారిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కీర్తి మాత్రం ఆ కామెంట్స్ ఏవీ పట్టించుకోకుండా కొత్త ప్రయోగాలు చేసుకుంటూ ముందుకెళ్తోంది. తాజాగా ఆ కొత్త ప్రయోగంలో భాగంగా ఒక తమిళ యంగ్ హీరోతో జోడీకట్టడానికి సిద్ధమయ్యిందని తెలుస్తోంది.
నెగిటివ్ కామెంట్స్
కీర్తి సురేశ్ చివరిగా నటించిన సినిమా ‘బేబి జాన్’. ఇదే మూవీతో తను బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ‘బేబి జాన్’ విడుదలయ్యే కొన్నిరోజుల ముందే తను ప్రేమించిన ఆంటోనీ తట్టిల్‌ను పెళ్లి చేసుకుంది కీర్తి. పెళ్లయిన వెంటనే ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొనడానికి రెడీ అయ్యింది. కానీ అప్పుడే ఒక్కసారిగా కీర్తి డ్రెస్సింగ్ స్టైల్ అంతా మారిపోయిందని, బాలీవుడ్ వెళ్లిన తర్వాత గ్లామర్ షో పెంచేసిందని తనపై నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఇప్పటికీ ప్రేక్షకులు ‘బేబి జాన్’ ప్రమోషన్స్‌లో కీర్తి డ్రెస్సింగ్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అయినా అవన్నీ పక్కన పెట్టేసి తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ పెట్టింది కీర్తి సురేశ్.
కొత్త దర్శకుడితో
ప్రస్తుతం కీర్తి సురేశ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నా ఆ రెండు తమిళ సినిమాలే. అంతే కాకుండా ఇప్పటికీ ఈ సినిమాల నుండి ఎలాంటి అప్డేట్స్ బయటికి రావడం లేదు. ఇంతలోనే తమిళ యంగ్ హీరో అశోక్ సెల్వన్‌తో జోడీకట్టడానికి కీర్తి సిద్ధమయ్యిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ‘వన్స్ మోర్’, ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ లాంటి సినిమాలను నిర్మించిన మిలియన్ డాలర్ కంపెనీ.. కీర్తి సురేశ్, అశోక్ సెల్వన్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మూవీని నిర్మించడానికి ముందుకొచ్చారని తెలుస్తోంది. ఒక కొత్త దర్శకుడు ఈ సినిమా ద్వారా కోలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వనున్నాడట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ గురించి మరే ఇతర వివరాలు బయటికి రాలేదు.
Also Read: 2014ని నా జీవితంలో మరిచిపోలేను.. దీపికా పదుకొనె హాట్ కామెంట్స్..
ఈ ఏడాదిలోనే రిలీజ్
కీర్తి సురేశ్ (Keerthy Suresh), అశోక్ సెల్వన్ (Ashok Selvan) కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా ఏప్రిల్ నుండి రెగ్యులర్‌గా షూటింగ్ ప్రారంభించుకోనుందని సమాచారం. త్వరత్వరగా షూటింగ్ పూర్తిచేసుకొని డిసెంబర్‌లోపు ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ప్రస్తుతం కీర్తి సురేశ్ నటిస్తున్న రెండు తమిళ చిత్రాల షూటింగ్ కూడా దాదాపు చివరి దశకు చేరుకుంది. ‘రివాల్వర్ రీతా’, ‘కన్నివెడి’ అనే చిత్రాల్లో కీర్తి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ రెండు సినిమాలకు సంబంధించిన అనౌన్స్‌మెంట్స్ బయటికి వచ్చాయి కానీ ఇప్పటివరకు ఈ మూవీ నుండి ఎలాంటి అప్డేట్స్ రిలీజ్ కాకపోవడంతో కీర్తి తరువాతి సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.