Laxman Meesala: హీరో, హీరోయిన్లు అనే కాదు.. కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఒక్క సినిమాతోనే ఫేమ్ సంపాదించుకున్న వారు ఉన్నారు. అలాంటి వారిలో లక్ష్మణ్ మీసాల ఒకరు. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించిన ఈ లక్ష్మణ్ మీసాల.. ఒక్కసారిగా మంచి నటుడిగా లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. అలా కొన్ని మంచి మంచి పాత్రలు తనను వెతుక్కుంటూ వచ్చాయి. సినిమాల్లో జానపద గేయాలతో, తనదైన యాసతో ప్రేక్షకులను అలరించాడు. తనను నటుడిగా పరిచయం చేసిన అజయ్ భూపతితోనే ‘మంగళవారం’ సినిమా చేసి మరొక సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే యాక్టర్ అవ్వకముందే లక్ష్మణ్ మీసాల లైఫ్ ఎలా ఉండేదని తాజాగా బయటపెట్టాడు.
కూలిపని చేశాను
యాక్టర్ అవ్వకముందు హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత కూలి పని కూడా చేశానని బయటపెట్టాడు లక్ష్మణ్ మీసాల. ఫిల్మ్ నగర్ క్లబ్‌లో కొత్త బిల్డింగ్ కడుతున్న సమయంలో తాను కూడా ఒక కూలీగా పనిచేశానని చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో చేతులకు, వేళ్లకు గాయాలు కూడా అయ్యాయని అన్నాడు. ‘‘చిరంజీవి ఇంటికి కూలి పని చేశాను. అల్లు అరవింద్ రెండు ఇళ్లకు కూలీగా వెళ్లాను. ఎన్‌టీఆర్ హీరోగా నటించిన అశోక్ సినిమా సెట్ వేయడానికి కూడా వెళ్లాను. ఆర్ట్ డైరెక్టర్లు కూడా మాలాంటి కూలివాళ్లను పనిలో పెట్టుకునేవారు. అప్పుడు ఎన్‌టీఆర్‌ను చూసిన ఆనందంలో ఊరికి వెళ్లిన తర్వాత ఆయన సినిమాలోని పాట పాడేశాను’’ అంటూ కూలి పనిలో ఎంత కష్టపడ్డాడో చెప్పుకొచ్చాడు లక్ష్మణ్ మీసాల.
అలా చూస్తూ ఉండిపోయాను
‘‘అప్పటికి సినిమాల గురించి ఏమీ తెలియదు కాదు సినిమాలు చూడడం చాలా ఇష్టం. చిరంజీవి ఇల్లు కట్టేటప్పుడు ఆయనను చూడలేదు. ఎన్నికల సమయంలోని బయట జనాలతో కలిసి నేను వెళ్లాను. అప్పటికీ ఆయన పార్టీ స్థాపించారు. ప్రచారాలు జరుగుతున్నాయి. నేను చూసే సమయానికి ఆయన లిఫ్ట్‌లో వెళ్లిపోయారు. బయటికి వచ్చి చూస్తే బాలకృష్ణ వచ్చారు. ఆయన రాగానే హడావిడి అంతా సైలెంట్ అయిపోయింది. ఆయన కారు దిగి వెళ్తుంటే అలా చూస్తూ ఉన్నాను’’ అని తన చిన్న చిన్న సంతోషాల గురించి గుర్తుచేసుకున్నాడు లక్ష్మణ్ మీసాల (Laxman Meesala). ఆ తర్వాత తను యాక్టింగ్ కోర్స్‌లో జాయిన్ అవ్వడం గురించి చెప్పుకొచ్చాడు.
Also Read: మాజీ ప్రేయసిపై బిగ్ బీకి నెటిజన్ కొంటె సలహా.. రియాక్షన్ ఏంటంటే.?
ఆయన నేర్పిన పాఠాలే
యాక్టింగ్ స్కూల్‌లో జాయిన్ అవ్వాలంటే ఫీజ్ కట్టాలని, సైకిల్ మీద వచ్చిన తను ఫీజ్ కడతాడని అక్కడ ఎవరూ నమ్మలేదని చెప్పుకొచ్చాడు లక్ష్మణ్ మీసాల. కూలి పని చేస్తున్నాను కాబట్టి సైకిల్‌లో వచ్చానని, బ్రతకడం కోసం ఏదో ఒక పని చేయాలి కదా అన్నాడట లక్ష్మణ్. దీక్షిత్ అనే వ్యక్తి తనను ట్రైన్ చేశాడని, ఇప్పటికీ తనను మర్చిపోలేనని, ఆయన చనిపోయినా ఆయన నేర్పించిన పాఠాలు ఎప్పటికీ గుర్తుంటాయని తెలిపాడు. నాటకాలు చేయడం తనకు ఇంట్రెస్ట్ లేకపోయినా దీక్షిత్ వల్లే నాటకాల్లో నటించానని గుర్తుచేసుకున్నాడు. అలా నాటకాల నుండి ఇప్పుడు వెండితెరపై మంచి గుర్తింపు ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎదిగాడు లక్ష్మణ్ మీసాల.