Look Back 2024 : ఇయర్ ఎండ్ వచ్చేసింది. ఇప్పటిదాకా టాలీవుడ్లో ఎన్నో అద్భుతాలు, అలాగే వివాదాలు నెలకొన్నాయి. అలాగే ఈ ఏడాది టాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకున్న కొత్త హీరోయిన్లు కూడా ఉన్నారు. అందులో హిందీ, కన్నడ, మలయాళ భాషలకు చెందిన పలువులు ముద్దుగుమ్మలు ఉన్నారు. అయితే అందులో కొందరికి మాత్రమే అదృష్టం కలిసి వచ్చింది. మరికొందరికి ఇంకా సక్సెస్ చేతికి అందలేదు. మరి 2024 లో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన కొత్త హీరోయిన్లు ఎవరో చూసేద్దాం పదండి.
జాన్వి కపూర్ (Janhvi Kapoor)
ఈ ఏడాది టాలీవుడ్లోకి అడుగు పెట్టిన హీరోయిన్లలో అందరి కంటే ముందుగా చెప్పుకోవాల్సింది జాన్వీ కపూర్ గురించి. ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాలో గ్లామర్ గట్టిగానే వడ్డించి ప్రేక్షకులను తమ వైపు తిప్పుకుంది ఈ బ్యూటీ. అయితే ఈ సినిమాలో పెద్దగా స్క్రీన్ టైమ్ దొరకకపోయినప్పటికీ తెలుగులో ఆమె పేరు మార్మోగిపోయింది. అలాగే సక్సెస్ తన ఖాతాలో పడింది.
దీపికా పదుకొనే (Deepika Padukone)
బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న దీపికా పదుకొనే ఈ ఏడాది తెలుగులో తొలి అడుగు వేసింది. ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమాతో ఈ అమ్మడు తెలుగు చిత్ర పరిశ్రమలోకి కాలు పెట్టింది. అయితే ఫస్ట్ మూవీతోనే దీపికా పదుకొనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ‘కల్కి’ సినిమాలో సుమతి అనే పాత్రలో కనిపించి ఆకట్టుకుంది దీపిక.
మానుషి చిల్లర్ (Manushi Chillar)
ఈ ప్రపంచ సుందరి ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది.
భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)
జాన్వి కపూర్, దీపిక పదుకొనే తర్వాత ఈ ఏడాది టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది భాగ్యశ్రీ గురించి. రవితేజ హీరోగా నటించిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది భాగ్యశ్రీ. ఫస్ట్ సినిమాలోనే అందాల ఆరబోతతో అదరగొట్టింది. దీంతో ‘మిస్టర్ బచ్చన్’ డిజాస్టర్ గా మిగిలినప్పటికీ భాగ్యశ్రీ కి తెలుగులో అవకాశాల వెల్లువ మొదలైంది. ఇప్పటికే ఆమె రామ్ పోతినేని, దుల్కర్ సల్మాన్ లాంటి క్రేజీ హీరోలతో సినిమాలు చేస్తోంది.
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)
ఈ ఏడాది నిఖిల్ హీరోగా నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమాతో రుక్మిణి వసంత్ ప్రేక్షకులను పలకరించింది. అయితే ఈ మూవీ డిజాస్టర్ అయినప్పటికీ రుక్మిణి ప్రస్తుతం పలు తెలుగు బిగ్ ప్రాజెక్టులలో భాగం కాబోతుందని అంటున్నారు.
నయన్ సారిక (Nayan Sarika)
తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన ఏడాదే రెండు సక్సెస్ లను తన ఖాతాలో వేసుకున్న హీరోయిన్ గా నిలిచింది సారిక. ఆమె నటించిన ఆయ్, క… రెండు సినిమాలు కూడా కమర్షియల్ గా హిట్ అయిన సంగతి తెలిసిందే. నిజానికి ఆమె ‘గంగం గణేశా’ అనే మూవీతో ఎంట్రీ ఇచ్చింది. అది కూడా ఇదే ఏడాది రిలీజ్ అయ్యింది. ఇక వీళ్ళతో పాటు ‘కృష్ణమ్మ’ మూవీతో అథిరా రాజ్, ‘క’ మూవీతో తన్వి రామ్, ‘ప్రతినిధి 2’ మూవీతో సిరి లెల్లా వంటి హీరోయిన్లు టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు.