Manoj VS Mohan Babu: గతంలో మంచు ఫ్యామిలీ మొదలయిన చిచ్చు ఇప్పటికీ రగులుతూనే ఉంది. మామూలుగా ఎవరి కుటుంబంలో అయినా గొడవలు సహజం. కానీ అదే సినీ సెలబ్రిటీల కుటుంబాల్లో ఏమైనా గొడవలు జరిగితే వారిపైనే ప్రేక్షకుల ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. మంచు ఫ్యామిలీ వివాదంలో కూడా అదే జరిగింది. ఇంట్లో మాట్లాడుకుంటే సర్దుకునే గొడవను అందరి ముందుకు తీసుకొచ్చారు. అంతే కాకుండా ఒకరిపై మరొకరు దాడి చేసుకుంటూ.. పోలీసులకు ఫిర్యాదులు చేస్తూ దీనిని మరింత ముందుకు లాగారు. ఆ గొడవ ముగిసిన ఇన్నాళ్ల తర్వాత మోహన్ బాబు, మంచు మనోజ్ మళ్లీ ఒకే కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధమవ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
అందరూ ఒకేచోట
గత నెలలో మొదటిసారిగా మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవ గురించి బయటపడింది. ఆస్తి విషయంలో తన తండ్రి మోహన్ బాబు అనుచరుడు తనపై దాడి చేశాడంటూ పోలీసులను ఆశ్రయించాడు మంచు మనోజ్. దీంతో ఈ విషయం బయటికొచ్చింది. మోహన్ బాబు, మనోజ్‌కు మధ్య గొడవ జరుగుతున్నప్పుడు మంచు విష్ణు అక్కడ లేదు. తను వచ్చిన తర్వాత అయినా అంతా సర్దుకుంటుంది, అందరికీ నచ్చచెప్తాడని అనుకుంటే అలా జరగకుండా గొడవ మరింత పెద్దగా మారింది. మనోజ్, విష్ణుల మధ్య కూడా రచ్చ మొదలయ్యింది. అలా దాదాపు వారం రోజుల రచ్చ తర్వాత అందరూ సైలెంట్ అయ్యారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడే ఒకచోట కలుసుకుంటున్నారు.
ర్యాలీగా వస్తున్నాడు
తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో ప్రతీ పండగను దగ్గరుండి అంగరంగ వైభవంగా జరిపిస్తారు మోహన్ బాబు (Mohan Babu). అందుకే ఈసారి కూడా సంక్రాంతి కోసం అక్కడ ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఆ ఏర్పాట్లను తానే స్వయంగా దగ్గరుండి చూసుకుంటున్నారు. మోహన్ బాబు మాత్రమే కాదు.. మంచు విష్ణు (Manchu Vishnu) కూడా ప్రస్తుతం ఆ యూనివర్సిటీలోనే ఉన్నట్టు సమాచారం. ఇంతలోనే మంచు మనోజ్ కూడా అక్కడికి బయల్దేరాడు. ప్రతీ సంవత్సరంలాగానే ఇప్పుడు కూడా మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగే సంక్రాంతి సంబరాల్లో పాల్గొనాలని మనోజ్ నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే రేణిగుంట ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టిన మనోజ్.. ర్యాలీగా రంగంపేటకు బయల్దేరనున్నాడు.
Also Read: ‘గేమ్ ఛేంజర్’ లీక్ వెనుక ఆ ఇద్దరు.. సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించిన నిర్మాతలు
అంతటా బందోబస్తు
తిరుపతిలోని తాజ్‌లో మంచు మనోజ్ (Manchu Manoj) బస చేయనున్నాడు. ఆ తర్వాత రెడీ అయ్యి అక్కడి నుండి మోహన్ బాబు యూనివర్సిటీకి ర్యాలీగా చేరుకోనున్నాడు. ఇప్పటికే మోహన్ బాబు అక్కడే ఉండడంతో వీరి మధ్య ఏ గొడవ జరుగుతుందో అని పోలీసులు అలర్ట్ అయ్యారు. దాదాపు 100 మంది పోలీసులు రంగంలోకి దిగారు. మనోజ్ ఉంటున్న హోటల్, యూనివర్సిటీ గేట్.. ఇలా ప్రతీ చోట బందోబస్తుగా ఉన్నారు. మోహన్ బాబు, మనోజ్‌ల మధ్య జరిగిన గొడవ తర్వాత ఎవరి ఇంటికి వారు వచ్చేశారు. ఆ తర్వాత దీని గురించి ఎవరూ పెద్దగా స్పందించలేదు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత కుటుంబమంతా ఒకే చోట కలుస్తుండడంతో తిరుపతిలో హై టెన్షన్ మొదలయ్యింది.