Manchu Mohan Babu: ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో మొదలయిన వివాదం అంతటా హాట్ టాపిక్‌గా మారింది. వారి ఇంటి గుట్టు ఇప్పుడు బయటికొచ్చింది. అన్నదమ్ములు, తండ్రీకొడుకులు మధ్య జరిగిన ఆస్తి వివాదం పెద్ద సంచలనంగా మారింది. జల్పల్లిలోని ఇంట్లో మోహన్ బాబు, మనోజ్‌కు మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ పోలీసుల వరకు వెళ్లింది. సోమవారం నుండే మోహన్ బాబుపై మనోజ్, మనోజ్‌పై మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసుకున్నారు. తాజాగా జల్పల్లి ఇంటి నుండి మనోజ్‌ను బయటికి వెళ్లిపోమని తన బౌన్సర్లతో పాటు తనను కూడా బయటికి పంపించేశారు మోహన్ బాబు. దీంతో ఆ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది.
ఇంట్లోకి మీడియా
అసలు మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి అక్కడికి వెళ్లిన మీడియాపై కూడా దాడి జరిగింది. కొన్ని గంటల క్రితం తమకు న్యాయం కావాలంటే మంచు మనోజ్.. తన భార్య భూమా మౌనికతో కలిసి పలువురు పైఅధికారులను కలవడానికి వెళ్లారు. వారు తిరిగొచ్చేసరికి మంచు విష్ణు.. తన బౌన్సర్లతో కలిసి గేటు మూయించాడు. లోపలికి రానివ్వకపోతే ఊరుకునేది లేదంటూ గేట్లు తెరవమని చెప్పడానికి మంచు మనోజ్ ప్రయత్నించాడు. కానీ విష్ణు తరపున బౌన్సర్లు మనోజ్ మాట వినలేదు. దీంతో మనోజ్.. తన బౌన్సర్లతో కలిసి గేట్లను బద్దలుకొట్టాడు. అదే సమయంలో కొందరు మీడియా వ్యక్తులు కూడా ఇంట్లోకి వెళ్లారు.
Also Read: మంచు ఫ్యామిలీలో జరుగుతుంది ఆస్తుల వివాదం కాదు.. ప్రొడ్యూసర్ నట్టి కుమార్ కామెంట్స్
మోహన్ బాబు స్వయంగా
మంచు మనోజ్ ఒకేసారి గేట్లు తెరిచేసరికి కొందరు మీడియాకు సంబంధించిన సిబ్బంది కూడా ఇంట్లోకి వెళ్లారు. వెంటనే మోహన్ బాబు బయటికొచ్చి మీడియాపై స్వయంగా దాడిచేశారు. ఒకరి చేతిలో ఉన్న మైక్‌లో లాక్కొని బుర్రలు పగిలేలా కొట్టారు. మోహన్ బాబు మాత్రమే కాదు.. అక్కడ ఉన్న సెక్యూరిటీ, బౌన్సర్లు అందరూ కలిసి మీడియాపై దాడిచేశారు. దీంతో పలువురికి గాయాలు అయినట్టు సమాచారం. మనోజ్‌తో పాటు లోపలికి వెళ్లిన మీడియా సిబ్బందిని బయటికి పంపించే క్రమంలో కొందరు కిందపడిపోయినా కూడా సెక్యూరిటీ సిబ్బంది పట్టించుకోకుండా దౌర్జన్యంగా వారిని బయటికి తోసేశారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా బయటికొచ్చాయి.
ఇంట్లో ఏం జరుగుతుందో?
ప్రస్తుతం మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మంచు మనోజ్, మోహన్ బాబు మధ్య మొదలయిన గొడవను ఆపడానికి మంచు లక్ష్మి.. సోమవారమే జల్పల్లిలోని ఇంటి వద్దకు చేరుకున్నారు. కానీ ఆమె మీడియా ముందు మాత్రం ఈ విషయంపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు. మంచు విష్ణు సైతం అమెరికా నుండి వెంటనే ఇండియాకు వచ్చారు. ఇది తమ కుటుంబ సమస్య అని, త్వరలోనే పరిష్కారమవుతుందని మోహన్ బాబు, మంచు విష్ణు హామీ ఇచ్చారు. కానీ ప్రస్తుతం మోహన్ బాబు ఇంటి వద్ద నెలకొన్న పరిస్థితి చూస్తుంటే ఈ గొడవ ఇప్పట్లో తీరేలా లేదని అనిపిస్తోంది. ప్రస్తుతం మంచు మనోజ్ ఇంటి లోపలికి వెళ్లాడు కాబట్టి ఇకపై ఏం జరుగుతుందో చూడాలి.