Naga Chaitanya: యంగ్ హీరో నాగచైతన్య కెరీర్‌లో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కింది ‘తండేల్’. ఇప్పటివరకు తన ఏ సినిమాకు కూడా ఇంత బడ్జెట్ పెట్టలేదు. అలాంటిది మత్స్యకారుల నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీని అల్లు అరవింద్, బన్నీ వాసు కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇందులో ఒక మత్స్యకారుడిగా కనిపించడం కోసం నాగచైతన్య కూడా చాలా కష్టపడ్డాడు. గత కొన్నాళ్లుగా చైతూకు సరైన హిట్ లేదు. అందుకే ఈ మూవీని ఎలాగైనా హిట్ చేయడం కోసం నాగచైతన్యతో పాటు మేకర్స్ అంతా కష్టపడుతున్నారు. అందులో భాగంగానే అన్నపూర్ణ స్టూడియోస్‌లో తండేల్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. అందులో తన పర్సనల్ లైఫ్‌ను సంబంధించిన ఒక సీక్రెట్‌ను బయటపెట్టాడు చైతూ.
పెళ్లి ఫోటో వైరల్
ప్రస్తుతం నాగచైతన్య (Naga Chaitanya) ప్రొఫెషనల్ లైఫ్‌తో పాటు పర్సనల్ లైఫ్‌పై కూడా ప్రేక్షకుల ఫోకస్ ఉంది. ముఖ్యంగా శోభితా ధూళిపాళను పెళ్లి చేసుకున్న తర్వాత చైతూ పర్సనల్ లైఫ్‌పై మరింత ఫోకస్ పెరిగింది. తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా నాగచైతన్య, శోభితా గురించి ప్రస్తావన వచ్చింది. ఈ ఈవెంట్‌లో అందరికీ సంబంధించిన వైరల్ వీడియోలను, ఫోటోలను ప్లే చేసి వారితో కాసేపు ఓ ఆట ఆడుకున్నారు యాంకర్ సుమ. అందులో భాగంగానే చైతూకు సంబంధించిన వైరల్ ఫోటో ఇదేనంటూ తన పెళ్లి ఫోటోను స్క్రీన్‌పై చూపించారు. ఆ తర్వాత శోభితాకు ఏదైనా పాట లేదా డైలాగ్ డెడికేట్ చేయాలంటే ఏది చేస్తాడని అడిగారు సుమ.
డైలాగ్ కూడా చెప్పేశాడు
శోభితాకు బుజ్జి తల్లి పాటనే డెడికేట్ చేస్తానని చెప్పుకొచ్చాడు నాగచైతన్య. అసలైతే తనను ఇంట్లో బుజ్జితల్లి అనే పిలుస్తానని అసలు విషయం బయటపెట్టేశాడు. ‘తండేల్’ సినిమా డిస్కషన్ సమయంలోనే ఈ విషయాన్ని చందుతో చెప్పేశానని అన్నాడు చైతూ. దానికి దర్శకుడు చందు మోండేటి కూడా ఒప్పుకున్నాడు. ‘‘బుజ్జి తల్లి అనే పేరుపై పాట కూడా రావడంతో శోభితా చాలా ఫీలయ్యింది. ఆ పేరును తను చాలా పర్సనల్‌గా ఫీలవుతుంది’’ అని రివీల్ చేశాడు నాగచైతన్య. ఆ తర్వాత బుజ్జి తల్లి వచ్చేస్తున్నా కదే అనే డైలాగ్‌ను శోభితా కోసం చెప్పాడు. అలా ఈవెంట్‌లో కాసేపు నాగచైతన్య, శోభితా ప్రేమ, పెళ్లి గురించే హైలెట్ అయ్యింది.
Also Read: పెళ్లి పీటలెక్కిన యంగ్ డైరెక్టర్.. స్టార్ హీరోలంతా ఒకే ఫ్రేమ్‌లో..
ప్రీ ప్రొడక్షన్ పక్కా
‘తండేల్’ (Thandel) సినిమా దాదాపుగా గత ఏడాదిన్నరగా ప్రొడక్షన్ జరుపుకుంటోంది. శ్రీకాకుళంలో నివసించే 22 మంది మత్స్యకారుల జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన సినిమా కాబట్టి ఇది సెట్స్‌పైకి వెళ్లకముందే వారందరికీ కలిసి అసలు జరిగిన కథను తెలుసుకున్నారు మూవీ టీమ్. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ కోసమే దాదాపుగా ఆరు నెలలు కష్టపడ్డారు. ‘తండేల్’ మూవీ ప్రీ ప్రొడక్షన్ మొదలయిన దగ్గర నుండి ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ అప్డేట్‌ను ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు అందిస్తూనే ఉన్నారు మేకర్స్. అసలైతే ఈ సినిమా గతేడాది డిసెంబర్‌లోనే విడుదల కావాల్సింది. కానీ పలు కారణాల వల్ల వాయిదా పడి ఫిబ్రవరి 7న రిలీజ్‌కు సిద్ధమయ్యింది ‘తండేల్’.