Urvashi Rautela: తెలుగు రాని హీరోయిన్స్, అస్సలు అర్థం కాని హీరోయిన్స్ టాలీవుడ్‌లో చాలామంది ఉన్నారు. భాష రాకపోయినా యాక్టింగ్ వస్తే చాలు అనుకుంటూ వారిని సినిమాల్లో క్యాస్ట్ చేసుకుంటారు దర్శకులు. కానీ దాని వల్ల ఎన్ని కష్టాలు తలెత్తుతాయి అనేది ఎవ్వరికీ అర్థం కాదు. తాజాగా బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ (Daaku Maharaj)లో ఐటెమ్ సాంగ్ చేయడం కోసం బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలాను రంగంలోకి దించాడు నిర్మాత నాగవంశీ. ఆ పాటకు సంబంధించిన లిరికల్ వీడియో విడుదలయిన తర్వాత దానిపై వచ్చిన ట్రోల్స్‌ను ఊర్వశి షేర్ చేసింది. అదేంటి ట్రోల్స్‌ను షేర్ చేస్తుందని నెటిజన్లు షాకయ్యారు. దానిపై నిర్మాత నాగవంశీ (Naga Vamsi) క్లారిటీ ఇచ్చారు.
ఐటెమ్ సాంగ్ కోసమే
మామూలుగా బాలకృష్ణ (Balakrishna) హీరోగా నటిస్తున్నాడంటే ఆ సినిమాలో ఎమోషన్స్, సెంటిమెంట్ అన్నీ ఉన్నా కూడా మధ్యలో ఒక ఐటెమ్ సాంగ్ కూడా ఉండడం పక్కా. ఆయన ఎక్కువగా మాస్ కమర్షియల్ చిత్రాల్లోనే నటిస్తుంటారు కాబట్టి మాస్ ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేయడం కోసం ఐటెమ్ సాంగ్ అనేది ఆయన సినిమాల్లో పక్కా ఉంటుంది. అలా ఇప్పటికీ ఎంతోమంది ఐటెమ్ గర్ల్స్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేశాయి బాలయ్య సినిమాలు. ఇక 2025 సంక్రాంతికి విడుదల కానున్న ‘డాకు మహారాజ్’లో కూడా ‘దబిడి దిబిడి’ అంటూ ఒక ఐటెమ్ సాంగ్ యాడ్ చేశాడు తమన్. అందులో బాలయ్యతో కలిసి స్టెప్పులు వేయడం కోసం ఊర్వశి రౌతెలా (Urvashi Rautela)ను సెలక్ట్ చేశారు.
Also Read: కావాలనే తప్పుడు వార్తలు రాస్తున్నారు.. విశాల్ ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన కుష్భూ
వింత ప్రవర్తన
బాలయ్య, ఊర్వశి రౌతెలా కలిసి స్టెప్పులేసిన ‘దబిడి దిబిడి’ పాటకు సంబంధించిన లిరికల్ వీడియో ఇటీవల విడుదలయ్యింది. అది విడదలయిన వెంటనే దానిపై ట్రోల్స్ మొదలయ్యాయి. అసలు ఆ స్టెప్స్ ఏంటి అంటూ పాటను కంపోజ్ చేసిన శేఖర్ మాస్టర్‌ను కూడా విపరీతంగా ట్రోల్ చేశారు. అలా ఊర్వశి రౌతెలాను ట్యాగ్ చేస్తూ ట్రోల్ చేస్తూ మీమ్స్ క్రియేట్ చేశారు. తెలుగు అస్సలే అర్థం కానీ ఊర్వశి తనను ట్యాగ్ చేసి పాటలో స్టెప్పులు బాగా చేసిందని పొగిడారని అనుకుంది. అందుకే తనపై వచ్చిన ట్రోల్స్ అన్నింటిని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఊర్వశి వింత ప్రవర్తనపై తాజాగా క్లారిటీ ఇచ్చారు నిర్మాత నాగవంశీ.
పాపం.. ఊర్వశి
‘‘ఊర్వశి రౌతెలాకు తెలుగు అర్థం కాక మీరందరూ పొగిడారని అనుకుంది. అందుకే నేను, బాబీ చెప్పి వెంటనే ఆ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ అన్నింటిని తీయించేశాం. తెలుగు అర్థం కాక పొగిడారని అనుకొని పొరపాటున పెట్టేసింది’’ అంటూ క్లారిటీ ఇచ్చాడు నాగవంశీ. మొత్తానికి ఊర్వశి రౌతెలా చేసిన పనికి నెటిజన్లంతా నవ్వుకున్నారు. అసలు తెలుగు రాని అమ్మాయిలను తీసుకొస్తే ఇలాగే ఉంటుందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ‘డాకు మహారాజ్’కు ఇప్పటివరకు ఉన్న హైప్‌ను పక్కన పెడితే.. ‘దబిడి దిబిడి’ పాట విడుదలయ్యి దీనిపై వస్తున్న ట్రోల్స్ వల్లే సినిమా గురించి ఎక్కువగా ప్రేక్షకులు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.