Nushrratt Bharuccha: సినీ సెలబ్రిటీలు ఏం చేసినా దానిపై ప్రేక్షకుల ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ సెలబ్రిటీల ప్రవర్తన, వాటి మాటతీరు.. వీటన్నింటిని ప్రేక్షకులు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటారు. అందుకే సెలబ్రిటీలు కూడా ప్రతీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ దేవుడిని నమ్మే విషయంలో కూడా సినిమా వాళ్లపై ఒక రకమైన ప్రెజర్ ఉంటుంది. ముస్లిం అయితే వారు గుడికి ఎందుకు వెళ్తున్నారు? హిందూ యాక్టర్లు రంజాన్ ఎందుకు జరుపుకుంటున్నారు? ఇలా ప్రతీ విషయంపై నెగిటివిటీ చూపించడానికి కొందరు నెటిజన్లు సిద్ధంగా ఉంటారు. తాజాగా బెల్లంకొండ హీరోయిన్‌కు కూడా ఈ నెగిటివిటీ సెగ తగిలింది.
నెగిటివిటీ తప్పడం లేదు
బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్స్‌లో నుష్రత్ భరూచా (Nushrratt Bharuccha) ఒకరు. ఇప్పటికే పలు యూత్‌ఫుల్ లవ్ స్టోరీలతో యూత్‌కు బాగా దగ్గరయ్యింది ఈ ముద్దుగుమ్మ. అంతే కాకుండా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘ఛత్రపతి’లో కూడా నుష్రతే హీరోయిన్‌గా నటించింది. అలాంటి ఈ హీరోయిన్ తన మత నమ్మకాల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే మత నమ్మకాల విషయంలో చాలామంది సినీ సెలబ్రిటీలు ప్రేక్షకుల దగ్గర నుండి నెగిటివిటీ ఎదుర్కుంటున్నారు. ఇప్పుడు నుష్రత్ కూడా అందులో యాడ్ అయ్యింది.
ప్రతీ మార్గం ముఖ్యమే
‘‘మీకు మనశ్శాంతి ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్లిపోవాలి. అది గుడి అయినా సరే, గురుద్వారా అయినా సరే, చర్చ్ అయినా సరే. నేను ఈ విషయాన్ని ఓపెన్‌గానే చెప్తాను. నేను నమాజ్ చేస్తాను. టైమ్ ఉంటే రోజుకు అయిదుసార్లు కూడా చేస్తాను. నేను ఎక్కడికి వెళ్లినా నమాజ్ మ్యాట్‌ను తీసుకొని వెళ్తాను. నేను ఎక్కడ ఉన్నా కూడా నమాజ్ చేసినప్పుడు మనశ్శాంతిగా ఫీలవుతాను. దేవుడు అనేవాడు ఒక్కడే అని, ఆయనను చేరుకోవడానికే చాలా మార్గాలు ఉంటాయని నేను నమ్ముతాను. ఆయనను చేరుకోగలిగే అన్ని మార్గాలు నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చింది నుష్రత్ భరూచా.
Also Read: కీరవాణి ఓ దరిద్రుడు.. హిందువులనే అవమానిస్తావా.? బ్యాన్ చేయాలంటూ డిమాండ్
అవేమీ నన్ను ఆపలేవు
‘‘నేను ఏ బట్టలు వేసుకుంటున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను అనే విషయాల్లో చాలాసార్లు నెగిటివ్ కామెంట్స్ ఎదుర్కున్నాను. నేను ఒక ఫోటో పోస్ట్ చేస్తే చాలు.. అసలు తను ముస్లింయేనా? ఎలాంటి బట్టలు వేసుకుంది చూడండి అని అనుకుంటూనే ఉంటారు. నేను దానిని ఎలా హ్యాండిల్ చేస్తానంటే అవి కేవలం విమర్శలే అనుకొని వదిలేస్తాను. అవేమీ నన్ను మార్చవు. నేను గుడికి వెళ్లకుండా, నమాజ్ చేయకుండా అవి నన్ను ఆపలేవు. మనం మన ఆలోచనల్లో, మనసులో, మైండ్‌లో క్లియర్‌గా ఉంటే ఇంకెవరూ మనల్ని ఆపలేరు’’ అని తెలిపింది నుష్రత్ భరూచా. నుష్రత్ చెప్పింది కరెక్టే అని కొందరు ఫీల్ అయినా మరికొందరు మాత్రం దీనిని కూడా నెగిటివ్‌గా మార్చేస్తున్నారు. మొత్తానికి సినీ సెలబ్రిటీలు ఏం చేసినా నెగిటివిటీ తప్పదు అనడానికి ఇలాంటివే ఉదాహరణ.