Odela 2 Trailer: ఎక్కువగా కమర్షియల్ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించిన తమన్నా.. మొదటిసారి తన కెరీర్‌లో ఎప్పుడూ చేయని ప్రయోగం చేస్తోంది. అఘోరీగా కనిపించి ఆడియన్స్‌ను షాక్‌కు గురిచేయనుంది. ‘ఓదెల 2’ అనే సినిమాలో తమన్నా అఘోరీగా కనిపిస్తుందని చెప్పగానే ప్రేక్షకులు అస్సలు నమ్మలేకపోయారు. అసలు అలాంటి పాత్రకు తమన్నా న్యాయం చేస్తుందా అని సందేహపడ్డారు. కానీ తాజాగా విడుదలయిన ట్రైలర్‌లో తమన్నాను చూసి అందరూ షాకవుతున్నారు. ‘ఓదెల 2’ ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు రాగా అందులో తమన్నాను చూసి ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోక తప్పలేదు. ఇక ఈ ట్రైలర్‌కు కాసేపట్లోనే మంచి వ్యూస్, లైక్స్ వచ్చాయి.
తిరుపతి తిరిగొచ్చాడు
‘‘భరత ఖండాన, దక్షిణ గంగ తీరాన.. ఆ పరమాత్ముడి పుట్టిల్లు అయిన ఓదెలలో ఓ ప్రేతాత్మ పురుడు పోసుకుంటోంది. ఆవిరైన ప్రతీ రక్తపు బొట్టును కూడగట్టుకుంటూ అవకాశం కోసం నిరీక్షిస్తోంది’’ అంటూ ఆత్మ తిరిగొచ్చిందనే క్లారిటీ ఇవ్వడంతో ‘ఓదెల 2’ ట్రైలర్ మొదలవుతోంది. ‘‘తిరుపతిగాడు సచ్చిండు కానీ వాడి ఆత్మ బ్రతికే ఉంది’’ అనే డైలాగ్‌తో ఈ విషయం కన్ఫర్మ్ అవుతుంది. తిరుపతిని హెబ్బా పటేల్ హత్య చేయడంతో ‘ఓదెల’ సినిమా ముగుస్తుంది. ఆ సినిమా ఎక్కడైతే ముగిసిందో.. ఈ సీక్వెల్ అక్కడే ప్రారంభమవుతుందని ట్రైలర్ స్టార్టింగ్‌లోనే స్పష్టం చేశారు మేకర్స్. తిరుపతి తిరిగొచ్చాడని ఆ ఊరిలో కొందరు నమ్మితే.. మరికొందరు నమ్మరు.
గోమాత ప్రాముఖ్యత
‘‘మనం నిలబడాలంటే భూమాత. మనం బ్రతకాలంటే గోమాత. మీరు బ్రతకడం కోసం చంపక్కర్లేదు. వాటి ఉ*చ్చ అమ్ముకున్న బ్రతకొచ్చు’’ అంటూ గోమాత ప్రాముఖ్యతను చెప్పే డైలాగ్‌తో తమన్నా ఎంటర్ అవుతుంది. ఓదెల ఊరిలో ఉండే సమస్యలను తీర్చడానికి పంచాక్షరిగా తమన్నా వచ్చిందని ఆ ఊరి ప్రజలు నమ్ముతారు. ‘‘నువ్వు మంత్రమైతే.. నేను తంత్రమైతా’’ అంటూ భయంకరమైన రూపంలో మళ్లీ తిరిగొస్తాడు తిరుపతి. దీంతో తమన్నాకు, తిరుపతికి మధ్య యుద్ధం మొదలవుతుంది. ‘‘విషపుగాలినై ఓదెలను చుట్టేస్తా. గరళకంఠున్నై విషాన్ని మింగేస్తా’’ అంటూ ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది.
Also Read: నా తండ్రికి క్యాన్సర్.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన పాయల్ రాజ్‌పుత్
సప్త మోక్షపూరీల్లో సాధన
నువ్వు శివశక్తివా అంటూ విలన్ అనే డైలాగ్‌కు తమన్నా (Tamannaah) ఇచ్చిన కౌంటర్ ‘ఓదెల 2’ (Odela 2) ట్రైలర్‌కే హెలెట్‌గా నిలిచింది. ‘‘అయోధ్య, మథుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక వంటి సప్త మోక్షపూరీలలో సాధన చేసిన దాంతో సవాల్ వద్దురా సైతాన్’’ అని సవాలు విసురుతుంది తమన్నా. ఆపై ట్రైలర్ చివర్లో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా అందరినీ ఆకట్టుకునే ఉంది. ఇక ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని చాలామంది నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. తమన్నా లాంటి హీరోయిన్‌ను అఘోరీ పాత్రకు ఎంచుకున్నప్పుడే సినిమా సగం హిట్ అని, ఇక ట్రైలర్ కూడా ప్రామిసింగ్‌గా ఉందని దీనిపై పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఇక సంపత్ నందినే ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడం గమనార్హం.