Pawan Kalyan: ఎంతోమంది సినీ సెలబ్రిటీలు సినిమాల్లో తమకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న తర్వాత ఆ గ్లామర్ ప్రపంచాన్ని వదిలేసి రాజకీయాల వైపు మొగ్గుచూపుతారు. అలా ఎంతోమంది సీనియర్ నటీనటులు రాజకీయాల్లో ఎంటర్ అయ్యి మంచి సక్సెస్ సాధించారు కూడా. చాలావరకు అవన్నీ సినీ జీవితాన్ని పూర్తిగా చూసేసిన తర్వాతే జరుగుతాయి. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో అలా జరగలేదు. పవర్ స్టార్‌గా సినిమాల్లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్.. అవన్నీ పక్కన పెట్టేసి మరీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తాజాగా ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం కావడంతో తన చేతిలోని సినిమాలను పక్కన పెట్టేశారు. మొత్తానికి ఇంతకాలం తర్వాత తన అప్‌కమింగ్ మూవీ ‘ఓజీ’పై పవన్ జాలి చూపించినట్టు సమాచారం.
ఆగిపోయిన సినిమాలు
సినిమాల్లో యాక్టివ్‌గా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ పలు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్‌ను సైన్ చేశారు. అంతే కాకుండా వాటి షూటింగ్స్‌ను కూడా ఒకేసారి మొదలుపెట్టారు. అలా పవన్ హీరోగా నటిస్తున్న మూడు సినిమాలు ప్రస్తుతం సెట్స్‌పై ఉన్నాయి. కానీ అదే సమయంలో ఆయన రాజకీయాల్లోకి కూడా ఎంటర్ అవ్వడంతో సినిమాలను కాస్త పక్కన పెట్టేశారు. ప్రజల సపోర్ట్‌తో ఎన్నికల్లో గెలిచి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించడంతో తను నటించాల్సిన సినిమాలను పూర్తిగా పక్కన పెట్టేశారు. దీంతో ఆ మేకర్స్ అంతా అయోమయంలో పడ్డారు. మధ్యమధ్యలో పవన్ కాల్ షీట్స్ ఇచ్చినా చాలు షూటింగ్ పూర్తిచేస్తామని ఎదురుచూస్తున్నారు. ఫైనల్‌గా ఈ మెగా హీరో ‘ఓజీ’ సెట్‌లో అడుగుపెట్టే సమయం వచ్చేసిందని తెలుస్తోంది.
భారీ సెట్
ఇప్పటికే ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడం వల్ల వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. మేలో ఈ మూవీ విడుదల కాకపోతే ఈ సినిమాను ప్రేక్షకులు సైతం పూర్తిగా పక్కన పెట్టేసేలా ఉన్నారు. అందుకే ఈ మూవీ షూటింగ్‌ను ఎలా అయినా పూర్తి చేయాలని పవన్ డిసైడ్ అయ్యారట. ఇది మాత్రమే కాదు.. దీంతో పాటు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఓజీ’ని కూడా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారట పవన్. తాజాగా ‘ఓజీ’ షూటింగ్ కోసం పవన్ 20 రోజుల కాల్ షీట్స్ ఇచ్చారని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. దానికోసం మంగళగిరిలోనే ప్రత్యేకమైన సెట్ ఏర్పాటు కోసం సన్నాహాలు కూడా మొదలయ్యాయట.
Also Read: మహేశ్ బాబు, పృథ్విరాజ్ సుకుమారన్ మధ్య కీలక సీన్స్, షూటింగ్ ఎక్కడంటే.?
విదేశాల్లో కష్టం
అసలైతే ‘ఓజీ’ కథ ప్రకారం ఈ మూవీ షూటింగ్ ఫారిన్‌లో జరగాలి. కానీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా తన బాధ్యతలు పక్కన పెట్టేసి విదేశాలకు వెళ్లి షూటింగ్ చేయడం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కు ఇష్టం లేదట. అందుకే ప్రజలకు సైతం అందుబాటులో ఉండేలా మంగళగిరిలోనే ఈ ‘ఓజీ’ షూటింగ్ కోసం భారీ ఫారిన్ సెట్ ఏర్పాటు కానుందని తెలుస్తోంది. ఒకవేళ ఈ 20 రోజుల్లో అంతా అనుకున్నట్టుగానే ‘ఓజీ’ షూటింగ్ పూర్తయితే వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమవుతాయి. అలా 2025 ఏడాది చిలరి లోపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.