Priya Prakash Varrier: ఒక్క పాట, ఒక్క సినిమా, ఒక్క క్యారెక్టర్.. సినీ సెలబ్రిటీల జీవితం మారడానికి ఇవి చాలు. అలాగే ఒక్క వింక్ ఒక అమ్మాయిని స్టార్‌గా మార్చేసింది. తనను వింక్ గర్ల్ చేసేసింది. తను మరెవరో కాదు.. ప్రియా ప్రకాశ్ వారియర్. ‘ఒరు అదార్ లవ్’ అనే సినిమాలో ఒక్క పాటలో కన్ను కొట్టి కుర్రకారు మనసు దోచేసింది ఈ ముద్దుగుమ్మ. అప్పటినుండి స్టార్ హీరోయిన్ రేంజ్‌లో తనకు అవకాశాలు మొదలయ్యాయి. ముఖ్యంగా మాలీవుడ్‌లో తను ఇప్పటికీ వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. అలాంటి ప్రియా ప్రకాశ్ వారియర్.. తాజాగా అజిత్ హీరోగా నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాలో మెరిసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
సర్‌ప్రైజ్ బయటపడింది
అజిత్ (Ajith) హీరోగా తెరకెక్కిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly)లో ప్రియా ప్రకాశ్ వారియర్ (Priya Prakash Varrier) ఉంటుందనే విషయం ప్రేక్షకులకు రివీల్ చేయలేదు మేకర్స్. ఇందులో ఒక ఐటెమ్ సాంగ్ ఉంటుందని కూడా చాలామంది తెలియదు. అలాంటి సినిమా రిలీజ్ అయ్యి పాట ఓ రేంజ్‌లో హిట్ అయిన తర్వాత ప్రియా ప్రకాశ్‌ను చూసి చాలామంది సర్‌ప్రైజ్ ఫీల్ అయ్యారు. అయితే మూవీతో పాటు తన పాట కూడా హిట్ అవ్వడంతో ఈ విషయం తానే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అజిత్ లాంటి స్టార్‌తో కలిసి నటించడంలో సంతోషాన్ని వ్యక్తం చేసింది. అసలు తన సంతోషాన్ని మాటల్లో చెప్పడం రావడం లేదు అంటూ అజిత్‌తో దిగిన ఫోటోను కూడా షేర్ చేసింది ప్రియా ప్రకాశ్ వారియర్.
కళ్లు వెలిగిపోతాయి
‘అసలు ఎక్కడ మొదలుపెట్టాలి.? ఈ విషయాన్ని నేను చాలారోజులు దాచిపెట్టాను. అజిత్‌పై నాకు ఉన్న అభిమానాన్ని మాటల్లో చెప్పలేను. మొదటిసారి మాట్లాడినప్పటి నుండి షూటింగ్ చివరి రోజు వరకు నేను చాలా సౌకర్యంగా ఫీలయ్యేలా చేశారు. ఎవరూ బయటవారిలాగా ఫీల్ అయ్యేలా మీరు చేయరు. మీరు సెట్‌లో ఉన్నప్పుడు అందరి గురించి ఆలోచించేవారు. క్రూజ్‌లో మనమంతా కలిసి చేసిన డిన్నర్, చెప్పుకున్న కబుర్లు, వేసుకున్న జోకులు నా లైఫ్‌లోనే బెస్ట్ టైమ్‌గా మిగిలిపోతాయి. ఒక విషయంపై ఇంత ప్రేమ, ప్యాషన్ ఉన్న మనిషిని నేను మొదటిసారి చూస్తున్నాను. ఫ్యామిలీ, కార్స్, ట్రావెలింగ్, రేసింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీ కళ్లు వెలగడం చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది’ అని చెప్పుకొచ్చింది ప్రియా.
Also Read: రూమర్స్‌కి చెక్.. హృతిక్‌తో రొమాన్స్‌కి సిద్ధమయిన హీరోయిన్..
ఎప్పటికీ మర్చిపోను
‘మీరు మీ చుట్టూ ఉన్న ప్రతీ విషయాన్ని గమనిస్తారు. సెట్స్‌లో మీ ఓపిక, డెడికేషన్ అనేది నాలాంటి ఎంతోమంది యంగ్ యాక్టర్లను ఇన్‌స్పైర్ చేస్తుంది. ఇది నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. మీరు నిజంగా జెమ్. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగుండాలి అని మీ దగ్గరే నేర్చుకున్నాను. మీతో కలిసి డ్యాన్స్ చేయడం నా కెరీర్‌లో మర్చిపోలేని అనుభవం. తొట్టు తొట్టు పాట చాలా స్పెషల్‌గా మిగిలిపోబోతుంది. మీతో గుడ్ బ్యాడ్ అగ్లీలో నటించిన అనుభవాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. మీ అవకాశానికి రుణపడి ఉంటాను. కాస్త స్వార్థంగా అనిపించినా మీతో మళ్లీ మళ్లీ కలిసి పనిచేయాలని ఉంది’ అని తెలిపింది ప్రియా ప్రకాశ్ వారియర్.