Daaku Maharaaj : నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) మూవీతో సంక్రాంతి బరిలో దిగబోతున్నారు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో బాలయ్య సరసన శ్రద్ధ శ్రీనాథ్ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే చాందిని చౌదరి, బాబి డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జనవరి 12న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మేకర్స్ ‘డాకు మహారాజ్’కు సంబంధించిన ప్రెస్ మీట్ నిర్వహించి, సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు.
“చిరంజీవి అభిమానులు తిట్టుకున్నా పర్లేదు. వాల్తేరు వీరయ్య కంటే డాకు మహారాజ్ మూవీ బాగా వచ్చింది” అంటూ తనదైన స్టైల్ లో మూవీ గురించి ప్రమోషన్లు షురూ చేశారు నాగ వంశీ (Naga Vamsi). ఒక ప్రజా ప్రతినిధి గా బాలయ్య ఎలా ఉంటున్నారో సినిమాలో బాలయ్య పాత్ర కూడా అలాగే ఉంటుందని వెల్లడించారు. అయితే ‘యానిమల్’ మూవీ కంటే ముందే బాబీ డియోల్ ని ఈ సినిమాలో విలన్ గా అనుకున్నామని ఎవరికీ తెలియని సీక్రెట్ ని బయట పెట్టారు. ఇక ఈ సినిమా ప్రమోషన్ల విషయానికొస్తే మూడు గ్రాండ్ ఈవెంట్లను ప్లాన్ చేసామని ఈ సందర్భంగా నాగ వంశీ చెప్పుకొచ్చారు.
ప్రమోషనల్ ఈవెంట్ల గురించి నాగ వంశీ (Naga Vamsi) మాట్లాడుతూ “జనవరి 2న హైదరాబాదులో ట్రైలర్ ను రిలీజ్ చేయాలని అనుకుంటున్నాము. ఆ తర్వాత జనవరి 4న అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు అక్కడ ఓ పాటను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. జనవరి 8న ఆంధ్రప్రదేశ్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నాము. విజయవాడ లేదా మంగళగిరిలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే ఛాన్స్ ఉంటుంది” అంటూ ప్రెస్ మీట్ లో ప్రమోషనల్ ఈవెంట్ల అప్డేట్ ను ఇచ్చారు.
ఇక ఇప్పటికే ఈ సినిమాలో నుంచి ఓ పాట రిలీజ్ కాగా, డిసెంబర్ 24న మరో పాటను రిలీజ్ చేయబోతున్నారు. మీడియా మీట్ లో తాజాగా నాగ వంశీ ‘డాకు మహారాజ్’ లోని మరో పాట గురించి కూడా మాట్లాడారు. అందులో ఊర్వశి రౌతెల చేసిన మాస్ సాంగ్ అద్భుతంగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు.
ఈ ప్రెస్ మీట్ లో నాగ వంశీ మాట్లాడుతూ సినిమాలో విజువల్స్ అద్భుతంగా ఉంటాయని, ‘డాకు మహారాజ్’ మూవీ కోసం ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసామని వెల్లడించారు. అలాగే ప్రస్తుతం నడుస్తున్న ఆ అల్లు అర్జున్ కాంట్రవర్సీ గురించి స్పందిస్తూ “ఆ నిమిషంలో ఏం జరిగిందనేదాన్ని ఎవ్వరమూ ఆపలేము. కానీ ఈసారి ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటాం. మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తాము” అని చెప్పారు నాగ వంశీ. మొత్తానికి ఒకే ఒక్క ప్రెస్ మీట్ తో ‘డాకు మహారాజ్’పై మరింత బజ్ పెంచేశారు నాగ వంశీ.