Pushpa 2 Tickets: పాన్ ఇండియా సినిమాలు అనగానే ముందుగా మేకర్స్ ఆలోచించేది బడ్జెట్ గురించే. తమ స్క్రిప్ట్‌పై నమ్మకం ఉంటే ఎంత బడ్జెట్ అయినా పెట్టి సినిమాను తెరకెక్కించడానికి నిర్మాతలు కూడా వెనకాడడం లేదు. అయితే ఆ బడ్జెట్ భారం తిరిగి తిరిగి ప్రేక్షకులపై పడడమే అన్యాయమని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు. త్వరలో విడుదల కానున్న ‘పుష్ప 2’ విషయంలో కూడా అదే జరుగుతోంది. ఎక్కువ బడ్జెట్ పెట్టి సినిమా తెరకెక్కించాం కదా అని, టికెట్ ధర విషయంలో అదనపు భారమంతా ప్రేక్షకులపైనే పడేలా చేస్తున్నారు. దాని వల్ల ప్రీమియర్ షోలు టికెట్లు కొనాలంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా పుష్పలాగా స్మగ్లింగ్ చేయాలా అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
‘కల్కి’తో పోలిస్తే
ప్రతీ పాన్ ఇండియా సినిమాకు ఒకే రేంజ్‌లో టికెట్ ధరలు పెంచినా అది కాస్త న్యాయంగానే ఉంటుంది. కానీ మేకర్స్.. తమకు నచ్చినంత టికెట్ ధరలు పెంచేసి, దానికి ప్రభుత్వం నుండి అనుమతి తీసుకొని ఆడియన్స్‌కు వేరే దారి లేకుండా చేస్తున్నారు. ఉదాహరణగా ‘కల్కి 2898 ఏడీ’, ‘పుష్ప 2’నే పోల్చి చూడొచ్చు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా రూ.600 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఎక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించినందుకే దాని టికెట్ ధరలు కూడా పెంచారు. సింగిల్ స్క్రీన్స్‌లో ఆ సినిమాకు రూ.265 టికెట్ ధరలను ఫిక్స్ చేయగా.. మల్టీ ప్లెక్స్‌లో రూ.413 టికెట్ ధరను ఫిక్స్ చేశారు.
Also Read: ‘పుష్ప 2’ టికెట్ రేట్లపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం.. ధరలు చూస్తే దిమ్మితిరగాల్సిందే..
రూ.100 కోట్ల తేడా
‘కల్కి 2898 ఏడీ’ టికెట్ ధరలతో పోలిస్తే ‘పుష్ప 2’ (Pushpa 2) టికెట్ ధరలు మరీ ఆకాశాన్నంటుతున్నాయని చాలామంది మూవీ లవర్స్ అనుకుంటున్నారు. ‘పుష్ప 2’ సినిమాను రూ.400 కోట్లు నుండి 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. అంటే ‘కల్కి 2898 ఏడీ’ కంటే తక్కువే. కానీ టికెట్ ధరల విషయంలో మాత్రం ‘పుష్ప 2’ రేట్లే ఎక్కువగా ఉన్నాయి. సింగిల్ స్క్రీన్స్‌లో ఈ సినిమా టికెట్ ధర రూ. 354 కాగా.. మల్టీ ప్లెక్స్‌లో ఈ ధర రూ.531గా ఫిక్స్ చేశారు. ‘కల్కి 2898 ఏడీ’, ‘పుష్ప 2’ బడ్జెట్‌కు దాదాపు రూ.100 కోట్లు తేడా ఉంది. కానీ ‘పుష్ప 2’ టికెట్ ధరలే ఎక్కువ.
టికెట్ ధరలే అడ్డు
అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పుష్ప 2’కు దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేయడం కోసం మూవీ టీమ్ అంతా తెగ కష్టపడుతోంది. ఇప్పటికే ఈ సినిమాను ప్రమోట్ చేయడం కోసం దేశమంతా చుట్టేస్తూ హల్‌చల్ చేస్తోంది. దీంతో హైప్ విషయంలో మేకర్స్ అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యారు. చాలామంది అల్లు అర్జున్ ఫ్యాన్స్.. ఈ సినిమాను ప్రీమియర్ షోలే చూసేయాలని ఫిక్స్ అయ్యారు. కానీ వెయ్యికు పైగా టికెట్ ధరలు చూసి చాలామంది వెనక్కి తగ్గేలా ఉన్నారు. మొత్తానికి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం.. ‘పుష్ప 2’ టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వడం, మేకర్స్ తమకు నచ్చినంత ధరలు పెంచడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.