Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్నా కూడా ఏదో ఒక కాంట్రవర్షియల్ స్టేట్‌మెంట్ ఇవ్వకుండా ఆ ఇంటర్వ్యూలో ముగుస్తుంది అంటే నమ్మడం కష్టం. అలాగే ప్రస్తుతం తన అప్‌కమింగ్ మూవీ ‘శారీ’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు ఆర్జీవీ. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను కూడా విడుదల చేశాడు. అందులో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్మ.. బాలీవుడ్ గురించి, పాన్ ఇండియా సినిమాల గురించి మాట్లాడాడు. అంతే కాకుండా రజినీకాంత్ యాక్టింగ్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రజినీ గురించి నెగిటివ్‌గా మాట్లాడాడంటూ ఆయన ఫ్యాన్స్ అంతా ఆర్జీవీపై ఫైర్ అవుతున్నారు.
స్లో మోషన్ మాత్రమే
‘‘యాక్టింగ్ అనేది క్యారెక్టర్‌కు సంబంధించింది. పర్ఫార్మెన్స్ ఎలా చేస్తున్నారు అనేదాన్ని బట్టి స్టార్లు పుడతారు. ఈ రెండిటి మధ్య చాలా తేడా ఉంటుంది. రజినీకాంత్ మంచి యాక్టరా అని అడిగితే నాకు తెలియదు అనే అంటాను. రజినీకాంత్ సత్య లాంటి సినిమాను చేయలేకపోవచ్చు. ఆయనను ఇలాగే చూడాలని అందరూ అనుకుంటారు. అసలు స్లో మోషన్ లేకపోతే రజినీకాంత్ (Rajinikanth) లేడు. ఆయన సినిమాలో అసలు ఏం చేయకుండా కేవలం స్లో మోషన్‌లో నడిచినా అది చూడడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉంటారు. అదే ఒక ఆనందాన్ని ఇస్తుంది’’ అంటూ రజినీకాంత్ యాక్టింగ్ గురించి తక్కువ చేసి మాట్లాడాడు రామ్ గోపాల్ వర్మ.
స్టార్లు నటించలేరు
‘‘ఒక స్టార్ అనేవాడు మామూలు పాత్ర పోషిస్తే ప్రేక్షకులకు అస్సలు నచ్చదు. అమితాబ్ బచ్చన్ ఒక సినిమాలోని సీన్‌లో కడుపునొప్పితో బాధపడుతుంటాడు. వాళ్లను స్టార్లుగా చూస్తాం కాబట్టి అలాంటి పాత్రలు ప్రేక్షకులకు నచ్చవు’’ అని వివరించాడు ఆర్జీవీ. బాలీవుడ్ గురించి మాట్లాడుతూ.. ‘‘బాలీవుడ్‌లోకి కొత్త రకం దర్శకులు వచ్చారు. వాళ్లు బాండ్రా లాంటి కాస్ట్‌లీ ఏరియాల్లో జీవితం కొనసాగిస్తూ హాలీవుడ్ సినిమాలపై ఆసక్తి చూపిస్తూ వాటినే చూస్తుంటారు. అలాగే హాలీవుడ్ స్టైల్‌లోనే సినిమాలు కూడా తెరకెక్కిస్తారు’’ అంటూ బీ టౌన్‌లోని నేటితరం డైరెక్టర్స్‌పై కామెంట్స్ చేశాడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma).
Also Read: సైకోకి శారీకి మధ్య నలిగిపోతున్న ఆరాధ్య.. అరాచకం సృష్టించిన వర్మ..!
సత్తా ఉన్నా చేయరు
‘‘హాలీవుడ్ సినిమాలు చూసి అదే స్టైల్‌లో సినిమాలు తెరకెక్కించడం వల్ల బాలీవుడ్ కూడా హాలీవుడ్‌లాగా మారిపోయింది. అందుకే మాస్ ఎంటర్‌టైనర్ సినిమాలను ప్రేక్షకులకు అందించడం మానేసింది, మర్చిపోయింది. పుష్ప 2 లాంటి చిత్రాలను తెరకెక్కించే సత్తా బాలీవుడ్ మేకర్స్‌కు ఉన్నా కూడా వారు అది చేయడం లేదు. కానీ సౌత్‌లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ఒకవైపు సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించే సినిమాలు తెరకెక్కిస్తూ మరోవైపు మాస్ ఆడియన్స్‌ను అలరించే చిత్రాలు కూడా చేస్తున్నారు. అందుకే సౌత్‌లో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది’’ అంటూ నార్త్, సౌత్‌ను పోలుస్తూ మాట్లాడారు ఆర్జీవీ. దీంతో రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.