Ram Gopal Varma: టాలీవుడ్‌లోని మోస్ట్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇప్పటినుండి తన ప్రవర్తన మార్చుకుంటానని, ప్రేక్షకులకు నచ్చే సినిమాలు చేస్తానని ప్రకటించి కొన్నిరోజులే అయ్యింది. ఇంతలోనే ఆయనకు ఏదో ఒక విధంగా చిక్కులు ఎదురవుతూనే ఉన్నాయి. ఇప్పటికీ రామ్ గోపాల్ వర్మపై పలు పెండింగ్ కేసులు ఉండగా అవన్నీ ఒకేసారి ఆయనను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తాజాగా ఒక కేసు విషయంలో ఆర్జీవీకి మరోసారి నోటీసులు జారీ చేశారు ఒంగోలు పోలీసులు. విచారణకు హాజరు కావాలని పలుమార్లు నోటీసులు పంపినా పలు కారణాలు చెప్తూ విచారణకు వెళ్లకుండా ఉన్నారు వర్మ. ఆ విషయంలో ఒంగోలు పోలీసులు సీరియస్‌గా ఉన్నారు.
కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం సమయంలో పవన్ కళ్యాణ్, నారా లోకేశ్, ఆఖరికి చంద్రబాబు నాయుడుపై కూడా అసభ్యకరమైన పోస్టులు షేర్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. వరుసగా కొన్నాళ్ల పాటు వారినే టార్గెట్ చేస్తూ ట్విటర్‌లో ట్వీట్లు చేస్తూ ఉన్నాడు. గత ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ మళ్లీ ఏపీలో ఎన్నికలు వచ్చాయి. ఆ తర్వాత చంద్రబాబు సీఎం అయ్యారు. నారా లోకేశ్ మంత్రి పదవి అందుకున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. అలా ఈ ముగ్గురిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు చేసిన ఆర్జీవీకి చిక్కులు మొదలయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు.
హాజరు కావాల్సిందే
చాలాకాలాంగా ఈ కేసులో విచారణ కొనసాగుతోంది. ఇంతకు ముందు కూడా ఈ కేసు విషయంపై ఒంగోలు పోలీసులు ఆర్జీవీకి నోటీసులు అందించారు. కానీ అప్పుడు ఆయన విచారణకు హాజరు కాలేదు. హాజరు కాలేననే విషయాన్ని లాయర్ ద్వారా చెప్పించారు. ఇప్పుడు మరోసారి ఇదే విషయంపై పోలీసులు వర్మకు నోటీసులు పంపించారు. ఫిబ్రవరీ 4న తప్పకుండా విచారణకు హాజరు కావాల్సిందే అని తెలిపారు. ఇప్పటివరు ఈ కేసు విషయంలో ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు వర్మ. అందుకే ఆయనపై పోలీసులు సీరియస్‌గా ఉన్నారు. మరి ఈసారి నోటీసులకు అయినా ఆయన సీరియస్‌గా స్పందించి విచారణకు హాజరు అవుతారేమో చూడాలి.
Also Read: అసలు సంతోషం అదే.. రౌడీ హీరోతో డేటింగ్ పై రష్మిక కామెంట్స్..!
కమ్ బ్యాక్ మూవీ
ఇక సినిమాల విషయానికొస్తే.. రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) మళ్లీ ఫామ్‌లోకి రావాలని బలంగా ఫిక్స్ అయ్యారు. అందుకే టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ హీరోలను కలిపి ‘సిండికేట్’ అనే మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించారు. అసలు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వివరాలను కూడా ఆర్జీవీ బయటపెట్టలేదు. కానీ ఆర్జీవీ కమ్ బ్యాక్ మూవీ అనగానే ప్రేక్షకుల్లో అప్పుడే అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం మూవీ లవర్స్ మధ్య ఇదే హాట్ టాపిక్ నడుస్తోంది. అసలు రామ్ గోపాల్ వర్మ కమ్ బ్యాక్ మూవీ అంటే ‘శివ’, ‘సత్య’, ‘సర్కార్’ రేంజ్‌లో ఊహించేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఇప్పటికైనా తన ఫ్యాన్స్‌ను వర్మ హ్యాపీ చేయగలరేమో చూడాలి.