Samantha: నటీనటులు ఎప్పుడూ ఒకే జోనర్‌లో సినిమాలు చేయాలన్నా, ఒకే రకమైన పాత్రలు చేయాలన్నా పెద్దగా ఇష్టపడరు. ఎప్పటికప్పుడు కథల విషయంలో, పాత్రల విషయంలో ప్రయోగాలు చేయాలని అనుకుంటారు. తాము చేసే సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా కొత్తగా ప్రయోగం చేశామనే తృప్తి ఉండిపోతుందని ఇప్పటికే ఎంతోమంది నటీనటులు బయటపెట్టారు. అదే విధంగా సమంత (Samantha) కూడా తన కంఫర్ట్ జోన్ నుండి బయటికొచ్చింది. ఒకప్పుడు ప్రేమకథల్లో హీరోయిన్‌గా నటించి యూత్‌కు బాగా దగ్గరయ్యింది సామ్. కానీ ఇకపై రొమాంటిక్ సినిమాలు చేసేది లేదు అని చాలా క్రియేటివ్‌గా తన ఫ్యాన్స్‌కు క్లారిటీ ఇచ్చేసింది ఈ ముద్దుగుమ్మ.
మరో రూటు మార్చింది
‘ఏం మాయ చేశావే’ లాంటి క్లాసిక్ ప్రేమకథతో హీరోయిన్‌గా తెలుగులో తన ప్రయాణాన్ని ప్రారంభించింది సమంత. ఆ తర్వాత కూడా ఎన్నో ప్రేమకథల్లో నటించింది. ఒకవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రేమకథలతో యూత్‌ను ఆకట్టుకుంది. అలా ప్రేమకథలు చేస్తూనే నాగచైతన్యతో ప్రేమలో పడింది. చైతూను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కమర్షియల్, లవ్ స్టోరీలకు దూరంగా ఉంది సామ్. పెళ్లి తర్వాత ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనే నటించింది. ఇక విడాకుల తర్వాత మరోసారి తన రూటు మార్చింది. యాక్షన్‌పై తన మనసు పారేసుకుంది. అంతే కాకుండా సినిమాలతో సమానంగా వెబ్ సిరీస్‌లు చేస్తోంది.
Also Read: పుష్ప 2 పై ట్రోల్స్.. అనసూయ సంచలన వ్యాఖ్యలు
గట్టి కమ్‌బ్యాక్
విడాకుల తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ అనే మూవీ చేసింది సమంత. అది యావరేజ్ హిట్‌గా నిలిచింది. కానీ తనకు గట్టి కమ్‌బ్యాక్ నిలిచింది మాత్రం ‘సిటాడెల్ హనీ బన్నీ’ సిరీస్. ఇటీవల ప్రైమ్‌లో విడుదలయిన ఈ సిరీస్.. సూపర్ హిట్ టాక్ అందుకుంది. ముఖ్యంగా ఇందులో సమంత యాక్షన్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. ఇప్పటివరకు సామ్ ఈ రేంజ్‌లో యాక్షన్ సీన్స్ ఎప్పుడూ చేయలేదు. కానీ సిటాడెల్ కోసం తన ఆరోగ్యం బాలేకపోయినా చేసింది. మరొకసారి ‘రక్త బ్రహ్మాండ్’ అనే వెబ్ సిరీస్ కోసం యాక్షన్‌లోకి దిగనుంది సామ్. తాజాగా ఈ సిరీస్ షూటింగ్ ప్రారంభం కావడంతో దానికి సంబంధించిన అప్డేట్ అందించింది.
మీమ్ షేర్ చేసింది
మరోసారి యాక్షన్ అంటూ ‘రక్త్ బ్రహ్మాండ్’ (Rakt Brahmand) షూటింగ్ ప్రారంభయినట్టుగా అప్డేట్ ఇచ్చింది సమంత. అయితే సమంత వరుసగా యాక్షన్ జోనర్‌నే ఎంచుకుంటుందని ఒక మీమ్ క్రియేట్ అయ్యింది. ఎవరైనా డైరెక్టర్ వచ్చి లవ్ సీన్ చేద్దామా అని సమంతను అడిగితే తను వద్దంటుంది. యాక్షన్ అంటే హ్యాపీగా ఫీలవుతుంది అంటూ ఒక మీమ్ వచ్చింది. ఆ మీమ్ సమంత కంటపడింది. దీంతో తను ఆ మీమ్‌ను షేర్ చేసింది. దీన్ని బట్టి చూస్తే నిజంగానే సమంత లవ్, రొమాంటిక్ సినిమాలకు దూరమయినట్టు చెప్పకనే చెప్పిందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ మళ్లీ తను ప్రేమకథలు చేస్తే చూడాలని ఉందని ఫీలవుతున్నారు.