Shalini Pandey: ఒకేఒక్క సినిమాతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చిన హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు. కానీ వారంతా ఎంత వేగంగా క్రేజ్ సంపాదిస్తారో.. అంతే వేగంగా వెనకబడిపోతారు కూడా. అలా ఒక్క సినిమాతో క్రేజ్ సంపాదించుకొని దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్న హీరోయిన్స్ చాలా తక్కువమంది ఉన్నారు. అలా కాపాడుకోలేక కనుమరుగయిన హీరోయిన్స్‌లో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ షాలిని పాండే కూడా ఒకరు. డెబ్యూ మూవీతోనే ఒక రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ హీరోయిన్.. అసలు ఇప్పుడు ఏమైందో కూడా ప్రేక్షకులకు తెలియదు. తాజాగా అసలు ‘అర్జున్ రెడ్డి’ తర్వాత తను ఎదుర్కున్న ఇబ్బందులు, కష్టాల గురించి మొదటిసారి నోరువిప్పింది షాలిని.
మొదటిసారి స్పందించింది
2017లో సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా నటించిన సినిమానే ‘అర్జున్ రెడ్డి’. ఈ సినిమాలో హీరోగా నటించిన విజయ్ దేవకొండ అప్పటికే ‘పెళ్లిచూపులు’తో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. కానీ దర్శకుడిగా పరిచయమవుతున్న సందీప్ గురించి, హీరోయిన్‌గా పరిచయం కానున్న షాలిని పాండే గురించి ప్రేక్షకులకు అస్సలు తెలియదు. అలాంటి ఈ ఇద్దరు ఈ మూవీతో ఒక హిస్టరీనే క్రియేట్ చేశారు. ప్రీతి పాత్రలో షాలిని నటనకు ఇప్పటికీ చాలామంది ఆడియన్స్ మర్చిపోలేదు. ఆ రేంజ్‌లో హిట్ అందుకున్న తర్వాత షాలిని పాండేకు మరో సరైన సినిమా పడలేదు. దానిపై తను మొదటిసారి స్పందించింది.
సీరియస్‌గా తీసుకోలేదు
‘‘నేను అర్జున్ రెడ్డి (Arjun Reddy) పూర్తి చేసుకొని బయటికి వచ్చిన వెంటనే ఇండస్ట్రీలో ఒక చేదు నిజాన్ని చూశాను. నేను దర్శకుడి దగ్గరకు వెళ్లి నా ఐడియాలు ఏమైనా చెప్పాలని అనుకున్నప్పుడు నన్ను వాళ్లు అస్సలు సీరియస్‌గా తీసుకునేవారు కాదు. నేను చెప్పిందంతా విని నీ బ్రెయిన్ వాడాల్సిన అవసరం లేదు అనేవారు. కానీ నేను మాత్రం చాలా చెప్పాలని అనుకునేదాన్ని. నేను కేవలం బబ్లీగా కనిపిస్తూ, సొట్టబుగ్గలతో అందంగా కనిపిస్తే చాలు అని చాలామంది దర్శకులు అనుకునేవారు. కానీ నేను అంతకంటే ఎక్కువ చేయగలను’’ అంటూ వాపోయింది షాలిని పాండే. అసలు తనను ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదనే విషయం తొలిసారి బయటపెట్టింది.
Also Read: హీరోయిన్‌గా హెయిర్ ఫాల్ టెన్షన్.. తగ్గడానికి ఏం చేసిందో తెలుసా?
అలా ఉండేదాన్ని
‘‘మొదట్లో నేను కూడా ఒంటరిగా అన్నీ మ్యానేజ్ చేసుకోవాలి కాబట్టి నాకేమీ తెలియదు అన్నట్టుగా ఉండేదాన్ని. కానీ మెల్లగా అలా ఉండకూడదు అని గ్రహించాను. నేను ఇలా ఉన్నానంటే అని జనాలు అనుకున్నా, ఓవర్ స్మార్ట్‌గా ఉండాలని ప్రయత్నిస్తున్నానని అనుకున్నా సరే నేను పట్టించుకోకూడదు అనుకోవడం మొదలుపెట్టాను. నేను ప్రశ్నలు అడుగుతాను, నాకోసం నేను నిలబడతాను. అందరికీ వినిపించేలా నా అభిప్రాయం చెప్తాను’’ అంటూ తనలో తాను తెచ్చుకున్న మార్పుల గురించి మాట్లాడింది షాలిని పాండే (Shalini Pandey). ప్రస్తుతం ‘డబ్బా కార్టెల్’ అనే వెబ్ సిరీస్‌లో ఒక చిన్న పాత్ర చేసి ప్రేక్షకులను అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ.