Singer Sonu Nigam: స్టార్ సింగర్ సోనూ నిగమ్ (Sonu Nigam) పై కర్ణాటక సినీ పరిశ్రమ నిషేధం విధించే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల ఆయన బెంగళూరులో ఒక కార్యక్రమంలో పాటలు పాడారు. అయితే ఒక అభిమాని ఆయనను కన్నడలోనే పాటలు పాడాలని పట్టుబట్టడంతో సింగర్ సీరియస్ అయ్యారు. ఇలాంటి పనుల వల్లే పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది అంటూ బదులిచ్చారు. ఈ వ్యాఖ్యలు కర్ణాటకలో కలకలం సృష్టిస్తున్నాయి. దీంతో సోనూకి మునుముందు తమ కర్ణాటక పరిశ్రమలోఅవకాశాలు ఇవ్వద్దని శాండిల్ వుడ్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే నిజమైతే ఈయనపై కర్ణాటకలో నిషేధం విధించినట్లే అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
ఇక దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సోనూ నిగమ్ పై కేసు ఫైల్..
అసలు విషయంలోకి వెళ్తే.. సోనూ నిగమ్ బెంగళూరులోని ఒక కాలేజీలో ఏప్రిల్ 25 ,26 తేదీలలో జరిగిన సంగీత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక ప్రేక్షకుడు పదేపదే కన్నడ పాట పాడాలని గట్టిగా అరిచాడు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన సోనూ నిగమ్ ఆ యువకుడి ప్రవర్తనను.. కాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడితో పోలుస్తూ హిందీలో వ్యాఖ్యానించారు అని ఆరోపణలు వచ్చాయి. “అతడు కన్నడ , కన్నడ అని అరిచిన తీరు నాకు నచ్చలేదు. ఇలాంటి ప్రవర్తన వల్లే పహల్గామ్ లాంటి దాడులు జరిగాయి” అని సోనూ నిగమ్ అన్నట్లు వార్తలు కూడా వినిపించాయి. ఈ వ్యాఖ్యలు కన్నడిగుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయని, వారి భాషాభిమానాన్ని, సాంస్కృతిక గర్వాన్ని హింసతో పోల్చడం సరికాదు అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక కన్నడ అనుకూల సంస్థ ‘కర్ణాటక రక్షణ వేదిక’ ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ బెంగళూరులోని అవలహళ్లి పోలీస్ స్టేషన్ లో ఈయనపై ఫిర్యాదు చేశారు. సోనూ నిగమ్ వ్యాఖ్యలు వివిధ భాషా సమూహాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని, హింసను ప్రేరేపించే అవకాశం ఉందని తమ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది.
పలు సెక్షన్లపై కేసు నమోదు..
ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సోనూ నిగమ్ పై ఐపిసి లోని వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, పరువు నష్టం, మత, భాషా పరమైన మనోభావాలను దెబ్బతీయడం వంటి సెక్షన్ల కింద ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసినట్లు సమాచారం.అయితే ఈ పరిణామాలపై సోను నిగం సోషల్ మీడియా ద్వారా కూడా స్పందించారు. తాను కన్నడ పాట పాడమని అడిగినందుకు కాదని, కొందరు వ్యక్తులు బెదిరింపు ధోరణితో ప్రవర్తించారని ఆరోపణలు చేశారు.తన వ్యాఖ్యలను కొంతమంది వక్రీకరించారని, పహల్గామ్ దాడిని ఉదాహరణగా చెప్పి తనను ఇలా ఇరికించారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ:Kollywood: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సీనియర్ నటి ముతాట్టి కన్నుమూత..!