Srikanth Odela: ఈరోజుల్లో సినిమాలు మాస్‌గా ఉంటేనే ప్రేక్షకులకు నచ్చుతున్నాయి. ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తూ.. మాస్ డైలాగులు ఉంటేనే సినిమా హిట్ అనే ఆలోచనలో ఉంటున్నారు మేకర్స్. అందుకే డెబ్యూ డైరెక్టర్స్ సైతం తమ సినిమాలను ఊర మాస్‌గా తెరకెక్కించడానికి ఇష్టపడుతున్నారు. అలాంటి డెబ్యూ డైరెక్టర్స్‌లో శ్రీకాంత్ ఓదెల కూడా ఒకడు. ఇప్పటికే శ్రీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఒక్క సినిమా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకుంది. ఇప్పుడు లైన్‌లో ఉన్న రెండు సినిమాలు కూడా అదే రేంజ్‌లో ఉండబోతున్నాయని అర్థమవుతోంది. ఇప్పుడు ఈ దర్శకుడు.. నిర్మాతగా మారి సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడు.
సూపర్ లైనప్
‘దసరా’ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ ఒక్క సినిమాతోనే నానికి ఒక రేంజ్‌లో మేక్ ఓవర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు నాని, శ్రీకాంత్ కాంబినేషన్‌లో మరోసారి ‘ది ప్యారడైజ్’ అనే మూవీ వస్తోంది. ఇప్పటికే విడుదలయిన ఈ మూవీ టీజర్ ఆడియన్స్‌కు ఒక రేంజ్‌లో షాకిచ్చింది. ఇది కాకుండా దీని తర్వాత మెగాస్టార్ చిరంజీవితో కూడా ఒక మూవీ ప్లాన్ చేశాడు శ్రీకాంత్ ఓదెల. ఇదే సమయంలో దర్శకుడిగా ఫుల్ బిజీగా ఉన్నా కూడా నిర్మాతగా కొత్త బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమయ్యాడు. తాజాగా శ్రీకాంత్ ఓదెల కొత్త ప్రొడక్షన్ హౌజ్ గురించి, అందులో తెరకెక్కనున్న మొదటి సినిమా గురించి అధికారిక ప్రకటన జరిగింది.
ఇంట్రెస్టింగ్ పోస్టర్
సమ్మక్క సారక్క క్రియేషన్స్ అనే కొత్త ప్రొడక్షన్ హౌజ్‌ను ప్రారంభించాడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela). ఈ ప్రొడక్షన్ హౌజ్‌లో ముందుగా ‘గులాబి’ అనే సినిమా తెరకెక్కుతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. చేతన్ బండి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి శ్రీకాంత్ ఓదెల కథను అందించాడు. శ్రీకాంత్ ఓదెలతో పాటు అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర కూడా దీనిని నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా తాజాగా విడుదలయ్యింది. ‘ఒక పోరీ పోరడిలా ప్రేమిస్తే ఎలా ఉంటది?’ అనే క్యాప్షన్‌తో ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఇందులో ఒక అమ్మాయి బుర్కా వేసుకొని నిలబడి ఉంది. చుట్టూ గులాబీలు ఉన్నాయి. ఇదొక ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ అని ఫస్ట్ లుక్‌తోనే క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్.
Also Read: ‘మ్యాడ్ స్క్వేర్’ రిలీజ్‌కు కొత్త ఇబ్బందులు.. నిర్మాతల డిమాండ్లే కారణమా.?
నిజంగా జరిగిన కథ
2009లో గోదావరిఖనిలోని బొగ్గు గనిలో నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ప్రేమకథ అంటూ ‘గులాబి’ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఇప్పటికే ‘ది ప్యారడైజ్’ టీజర్ విడుదలయ్యి యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇదే సమయంలో శ్రీకాంత్ ఓదెల ప్రొడక్షన్‌లోకి దిగుతున్నాడంటే ఇండస్ట్రీలో ఇది కూడా హాట్ టాపిక్‌గా మారింది. మొత్తానికి కేవలం ఒకేఒక్క సినిమాతో టాలీవుడ్‌లోని మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా మారిపోయాడు శ్రీకాంత్ ఓదెల. ఇప్పటికే దర్శకుడిగా తను తెరకెక్కించిన సినిమాలే ఈ రేంజ్‌లో ఉంటే.. నిర్మాతగా తెరకెక్కిస్తున్న ‘గులాబి’ ఏ రేంజ్‌లో ఉంటుందో అని ప్రేక్షకులు మాత్రమే కాదు.. ఇండస్ట్రీ నిపుణులు కూడా ఎగ్జైట్మెంట్‌తో ఉన్నారు.