Kanguva : సూర్య హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘కంగువా’ (Kanguva) రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చింది. అయితే మొదటి షో నుంచి ఈ మూవీ సౌండ్ పై విపరీతమైన నెగటివ్ టాక్ వచ్చింది. పైగా సినిమా తలనొప్పిని తీసుకొచ్చే విధంగా ఉంది అని విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర బృందం డ్యామేజ్ కంట్రోల్ చర్యలను చేపట్టింది.
శివ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా, దిశా పటాని హీరోయిన్ గా, ‘యానిమల్’ ఫేమ్ బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ గా నటించిన పాన్ ఇండియా మూవీ ‘కంగువా’ (Kanguva). నవంబర్ 14న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా స్క్రీన్ ప్లే విసుగు పుట్టించేలా ఉందని, చెవులు చిల్లులు పడేంత సౌండ్స్ ఉన్నాయని తీవ్ర విమర్శలను ఎదురుకోవాల్సి వచ్చింది. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాని చూశాక ప్రేక్షకులు తలనొప్పితో బయటకు రావాల్సి వచ్చింది. విమర్శకులు, ప్రేక్షకుల నుంచి వస్తున్న ఈ నెగెటివిటీని దృష్టిలో పెట్టుకొని సినిమాలోని సమస్యలకు పరిష్కారం వెతికి, మళ్లీ రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు నిర్మాతలు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మించిన నిర్మాత జ్ఞానవేల్ రాజా మీడియా ఇంట్రడక్షన్ టైంలో మాట్లాడుతూ ఇందులోని ఆడియో సమస్యలను, వాల్యూమ్ ను రెండు పాయింట్లు తగ్గిస్తానని హామీ ఇచ్చారు.
అన్నట్టుగానే తాజాగా ఈ సినిమా నుంచి కొన్ని సన్నివేశాలను డిలీట్ చేయడంతో పాటు సౌండ్ సమస్యలను క్లియర్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ‘కంగువా’ (Kanguva) సినిమాలోని ఏకంగా 12 నిమిషాల ఫుటేజ్ ని తొలగించారట మేకర్స్. ఇంతకుముందు “కంగువా” రన్ టైం 2 గంటల 34 నిమిషాలు ఉండేది. అయితే ఇప్పుడు 12 నిమిషాల సీన్స్ ట్రిమ్ చేయడంతో మూవీ 2 గంటల 22 నిమిషాల రన్ టైంతో థియేటర్లలో ఆడబోతోంది. ఇక ఈ కొత్త వెర్షన్ ‘కంగువా’ మూవీని ఈరోజు అంటే నవంబర్ 19న లేదా నవంబర్ 20 నుంచి థియేటర్లలో ప్లే చేయబోతున్నారు.
కాగా ‘కంగువా’ (Kanguva) మూవీపై వస్తున్న విమర్శలకు సూర్య భార్య, నటీమణి జ్యోతిక స్పందించిన సంగతి తెలిసిందే. అయితే సినిమాలోని మొదటి అరగంట అసలు బాలేదన్న విషయాన్ని ఒప్పుకున్న జ్యోతిక.. సినిమా మొత్తం మూడు గంటలు ఉందని, అందులో కేవలం అరగంట మాత్రమే వర్కౌట్ కాలేదని వివరించింది. చాలా సినిమాలలో ఇలాంటి మిస్టేక్స్ జరుగుతాయని, కావాలని కొంతమంది పనిగట్టుకుని ఈ సినిమాపై నెగటివ్ టాక్ ని ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించింది. ఏదేమైనా మూవీ రిలీజ్ కి ముందు నిర్మాతలు ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఈ మూవీ 1000 కోట్లు కొల్లగొడుతుంది అంటూ చేసిన వ్యాఖ్యలపై ఇంకా నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు మూవీలోని కొన్ని సన్నివేశాలను డిలీట్ చేసి, డామేజ్ కంట్రోల్ చేశాక అయినా ఈ మూవీ 1000 కోట్లు కొల్లగొడుతుందా అని ప్రశ్నిస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా ఉంది మేకర్స్ పని జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోయింది. ఇప్పుడు ఈ కొత్త వెర్షన్ నిర్మాతలను నష్టాల నుంచి కాపాడుతుందా? అనే అనుమానమే.