Telangana Bjp President: అధ్యక్ష పీఠం నాదే.. ఇది తెలంగాణ బీజేపీలో కొద్దిరోజులుగా వినిపిస్తున్న మాట. కాషాయ పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడిని మార్చబోతున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రోజుకో పేరు తెరపైకి వస్తోంది. తాజాగా ధర్మపురి అరవింద్ సైతం అధ్యక్ష రేసులో తానూ ఉన్నానని చెప్పారు. దీంతో మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. గతంలో కాషాయ పార్టీలో అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో బండి సంజయ్ ని అధ్యక్ష పీఠం నుండి దింపి కిషన్ రెడ్డికి కట్టబెట్టారు. కాగా మరోసారి ఆ పార్టీ అధ్యక్షుడిని మార్చాలని భావిస్తోందట. ఈ క్రమంలో నలుగురు నేతలు పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది.
Also read: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు
పార్టీలో సినియర్లతో పాటూ కొత్తగా వచ్చినవారు సైతం అధ్యక్షపీఠం తనకే కావాలని లాబీయింగ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడిగా చేనిప్పుడు పార్టీకి హైప్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే మరోసారి ఆయననే అధ్యక్షుడిని చేయాలని కొంతమంది భావిస్తున్నారు. మాస్ లీడర్ గా పేరుండటం.. రెండుసార్లు ఎంపీగా గెలవడంతో ఆయనే పార్టీని సమర్దవతంగా నడుపుతాడని పార్టీలోని ఆయన సన్నిహితులు మాట్లాడుకుంటున్నారట. మరోవైపు బండి సంజయ్ కూడా పార్టీ పగ్గాలు తనకే రావాలని కోరుకుంటున్నారట. మరోవైపు బీఆర్ఎస్ నుండి బీజేపీలోకి వచ్చిన ఈటల సైతం అధ్యక్షపీఠం కోసం లాబీయింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
గతంలోనే పార్టీ పగ్గాలు ఈటల చేతికి వస్తాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. గత అధ్యక్షుడిపై ఆయన అసంతృప్తితో ఉన్నారని.. ఆయన వల్లనే అధ్యక్ష మార్పు జరిగిందని అప్పట్లో టాక్ వినిపించింది. కానీ చివరికి ఈటలకు ఇవ్వకుండా కిషన్ రెడ్డిని అధ్యక్షుడిని చేశారు. కానీ ఈసారి ఈటల ఎంపీగా గెలిచి ఉండటం, పార్టీలో చురుకుగా వ్యవహరిస్తుండటంతో ఆయనను అధ్యక్షుడిని చేసే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. బీజేపీ అధ్యక్ష పీఠాన్ని ఆశిస్తున్న మరోనేత రఘునందన్ రావు. చాలా ఇంటర్వ్యూలలో రఘునందన్ రావు పార్టీ అధ్యక్షుడిని అయ్యేందుకు తనకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పుకున్నారు. బీఆర్ఎస్ నుండి వచ్చినా ఆర్ఎస్ఎస్ సిద్దాంతాలను ఆయన అడాప్ట్ చేసుకున్నారు.
దీంతో ఆయన పార్టీ అధ్యక్షుడు అవ్వాలని పార్టీలో కొంతమంది కోరుకుంటున్నారు. అంతే కాకుండా దుబ్బాకలో ఓడినా మెదక్ ఎంపీగా గెలిచి సత్తా చాటడంతో పార్టీ కూడా అధ్యక్ష పదవికి ఆయన సమర్దుడేనని భావిస్తోందట. మరోనేత ధర్మపురి అరవింద్ తాను రేసులో ఉన్నానని స్వయంగా చెప్పుకున్నారు. దీంతో ఆయన కూడా కాషాయ దళపతి అయ్యేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అరవింద్ కు అటు మాస్ ఫాలోయింగ్ ఉండటం ఇటు క్లాస్ ఫాలోయింగ్ ఉండటంతో ఆయన పేరును కూడా అధిష్టాణం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మరి చివరికి ఈ నలుగురిలో ఎవరికి అధ్యక్షుడు అయ్యే ఛాన్స్ దక్కుతుంది..వీరు కాకుండా కొత్త వ్యక్తి ఎవరైనా తెరమీదరకు వస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.