The GOAT: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సినిమా విడుదల అయ్యిందంటే చాలు.. హడావిడి మామూలుగా ఉండదు. అలాంటి హీరో సినిమాలో మరింత యాక్షన్ తో పాటు టెక్నాలజీని కూడా యాడ్ చేస్తే ఎలా ఉంటుందో ‘ది గోట్’ చూస్తే అర్థమవుతుంది. సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ తో ముందుకెళ్తోంది. అయితే ఈ మూవీలో ప్రేక్షకులను ఎగ్జైట్ చేసే పలు గెస్ట్ రోల్స్ ఉన్నాయని సోషల్ మీడియాలో స్పాయిలర్స్ వైరల్ అవుతున్నాయి. ఈ గెస్ట్ రోల్స్ వల్ల మూవీ వేరే లెవెల్ కు వెళ్లిందని కొందరు ఆడియన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఈ విషయం బయటపడిందంటే కాసేపటిలో ఇది వైరల్ అవ్వక తప్పదు.
టెక్నాలజీ సాయంతో హీరోకు ప్రాణం
కోలీవుడ్ లో సీనియర్ హీరో విజయ్ కాంత్ మరణం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అందుకే ఆ హీరో అభిమానుల కోసం మరోసారి ఆయనకు ప్రాణం పోయాలని ‘ది గోట్’ డైరెక్టర్ వెంకట్ ప్రభు అనుకున్నారు. దానికి టెక్నాలజీ సాయాన్ని తీసుకున్నారు. ఏఐ సాయంతో ‘ది గోట్’లో విజయ్ కాంత్ నటించేలా చేశారు వెంకట్ ప్రభు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుండి విజయ్ కాంత్ ను ఏఐతో రీక్రియేట్ చేస్తారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఫైనల్ గా అవన్నీ రూమర్స్ కాదని, నిజంగానే సినిమాలో విజయ్ కాంత్ ను చూశామని ప్రేక్షకులు.. తమ రివ్యూలలో చెప్తున్నారు.
మరో యంగ్ హీరో శివకార్తికేయన్
‘ది గోట్’లో ఒక యంగ్ హీరోతో గెస్ట్ రోల్ చేయించారు దర్శకుడు వెంకట్ ప్రభు. సినిమాలో ఒక కీలక ట్విస్ట్ ను రివీల్ చేయడం కోసం శివకార్తికేయన్ ను రంగంలోకి దించారు. ఆ సీన్ సినిమాకు హైలెట్ గా నిలిచిందని ప్రేక్షకులు రివ్యూ ఇస్తున్నారు. కోలీవుడ్ లోని పలు స్టార్లతో కలిసి శివకార్తికేయన్ మల్టీ స్టారర్ చేస్తే బాగుంటుందని కోరుకునే కోలీవుడ్ ప్రేక్షకులు విజయ్ సినిమాలో తన గెస్ట్ రోల్ చూసి హైప్ ఫీల్ అయ్యామని అంటున్నారు. ‘ది గోట్’లో ఒక క్రికెటర్ గా శివకార్తికేయన్ క్యామియో ఆడియన్స్ ను ఉర్రూతలూగేలా చేసింది.
మొదటిసారి స్క్రీన్ పై ధోనీ
లెజెండరీ క్రికెటర్ ఎమ్ ఎస్ ధోనీ ఇటీవల సినీ పరిశ్రమపై మనసుపడ్డారు. అందుకే మూవీ ప్రొడక్షన్ లో కూడా అడుగుపెట్టారు. కానీ ఆన్ స్క్రీన్ పై మాత్రం ఎప్పుడూ కనిపించలేదు. ఆయన సొంత నిర్మాణ సంస్థ ద్వారా తెరకెక్కిన మూవీలో కూడా ఆయన గెస్ట్ రోల్ చేయడానికి నిరాకరించారు. అలాంటి ధోనీని ‘ది గోట్’లో చిన్న క్యామియో చేయడానికి ఒప్పించారు దర్శకుడు వెంకట్ ప్రభు. ‘పడయప్ప’ బీజీఎమ్ తో సినిమాలో ఎమ్ ఎస్ ధోనీ కనిపించగానే థియేటర్లు అన్నీ స్టేడియమ్స్ గా మారిపోయాయి. దీంతో విజయ్, ధోనీ మ్యూచువల్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయ్యారు.
సీనియర్ హీరోయిన్ కూడా
ఈమధ్యకాలంలో విజయ్, త్రిష ప్రేమలో ఉన్నారనే వార్త కోలీవుడ్ లో తెగ వైరల్ అవుతోంది. పైగా వీరిద్దరూ 20 ఏళ్ల క్రితం కలిసి నటించిన ‘గిల్లి’ మూవీ కూడా రీ రిలీజ్ అయ్యి రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సాధించింది. అలాంటి విజయ్, త్రిష మరోసారి కలిసి ఒక స్క్రీన్ పై అలరిస్తే థియేటర్లలో ఆడియన్స్ ఏ రేంజ్ లో ఎంజాయ్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే ఐడియా ‘ది గోట్’ డైరెక్టర్ వెంకట్ ప్రభుకు కూడా వచ్చినట్టుంది. అందుకే త్రిషను తీసుకొచ్చి విజయ్ తో ‘మట్టా’ అనే పాటలో స్టెప్పులు వేయించారు. ఈ పాటను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశామని రివ్యూలలో తెలిపారు.