UI The Movie: ఒకప్పుడు సౌత్ సినిమాలకు దేశవ్యాప్తంగా అంత గుర్తింపు ఉండేది కాదు. కానీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాన్ ఇండియా హిట్స్ సాధించిన సినిమాల్లో సౌత్‌కు సంబంధించిన సినిమాలే ముందంజలో ఉంటున్నాయి. సౌత్‌లోని దాదాపు ప్రతీ భాషలో ఒక పాన్ ఇండియా హిట్ ఉంటుంది. అలాగే కన్నడలో కూడా ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్’ కన్నడ సినీ పరిశ్రమ రూపురేఖలనే మార్చేసింది. ఆ తర్వాత మరెన్నో పాన్ ఇండియా చిత్రాలు వచ్చి కన్నడ మార్కెట్‌ను మరింత పెంచేశాయి. ఇప్పుడు అదే కేటగిరిలోకి ఉపేంద్ర హీరోగా తెరకెక్కిన ‘యూఐ ది మూవీ’ కూడా యాడ్ అయ్యింది. ఈ మూవీని చూడడానికి ప్రేక్షకులు భారీ సంఖ్యలు ఎదురుచూస్తున్నారు.
బుకింగ్స్ అదుర్స్
కన్నడలో స్టార్ హీరోగా గుర్తింపు సాధించారు ఉపేంద్ర. ఆయనకు తెలుగులో కూడా విపరీతమైన పాపులారిటీ ఉంది. అసలు ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్‌ను ఉపేంద్ర టచ్ చేసి హిట్ కొడతారని ఆయనపై మంచి అభిప్రాయం ఉంది. ఇప్పుడు మరోసారి ఒక డిఫరెంట్ సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఉపేంద్ర. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలయిన టీజర్, ట్రైలర్ చూస్తుంటే దీనిని ఒక ఊహించని కథతో తెరకెక్కించారనే విషయం అర్థమవుతోంది. అందుకే ప్రేక్షకులకు కూడా ‘యూఐ ది మూవీ’పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అందుకే కన్నడ సినీ చరిత్రలోనే ఏ ఇతర సినిమాకు రానంత బుకింగ్స్‌ను సొంతం చేసుకుంది ‘యూఐ ది మూవీ’.
Also Read: నార్త్ బాక్సాఫీస్‌పై పుష్పరాజ్ దండయాత్ర.. ఒరిజినల్ సినిమాలకు మించి కలెక్షన్స్
ఇదొక రికార్డ్
టికెట్ సేల్స్ విషయంలో ‘యూఐ ది మూవీ’ (UI The Movie) కన్నడ సినీ చరిత్రలోనే కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోందని మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘ఆన్‌లైన్‌లో 75 వేల టికెట్స్ అమ్మడంతో యూఐ ది మూవీ కన్నడ సినిమాలోనే ఒక రికార్డ్ సెట్ చేసింది. కర్ణాటకలోనే ఇది జరిగినందుకు కన్నడ ఆడియన్స్‌కు మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము’ అంటూ లహరి ఫిల్మ్స్ సంస్థ బయటపెట్టింది. కేవలం కన్నడలోనే కాదు.. దేశవ్యాప్తంగా కూడా ఈ సినిమాను చూడడం కోసం చాలామంది ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. అలా ప్రీ బుకింగ్స్ కూడా బాగానే జరిగాయి. దీంతో ఈ సినిమా కచ్చితంగా హిట్ అని చాలామంది ఉపేంద్ర ఫ్యాన్స్ అనుకున్నారు.
హిట్ కొట్టేశారు
ఉపేంద్రకు సౌత్ మొత్తంలో పాపులారిటీ ఉన్నా కూడా ఆయన ఇప్పటివరకు ఒక్క పాన్ ఇండియా సినిమాలో కూడా నటించలేదు. అలా ఉపేంద్ర (Upendra) కెరీర్‌లో అందరికీ గుర్తుండిపోయే మొదటి పాన్ ఇండియా చిత్రంగా ‘యూఐ ది మూవీ’ నిలుస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. కేవలం కన్నడలో మాత్రమే కాకుండా మొత్తం అయిదు భాషల్లో ఈ సినిమా విడుదలయ్యింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2000 స్క్రీన్స్‌లో ‘యూఐ ది మూవీ’ ఒకేసారి రిలీజ్ అయ్యింది. ఇప్పటికే మార్నింగ్ షోల నుండి ‘యూఐ ది మూవీ’కి పాజిటివ్ టాక్ లభిస్తోంది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత దర్శకుడిగా మైక్రోఫోన్ పట్టుకున్న ఉపేంద్ర.. హిట్ కొట్టేశారని ఫ్యాన్స్ అంటున్నారు.