BigTV English

Valtheru Veerayya Review: ‘వాల్తేరు వీరయ్య’ రివ్యూ

Valtheru Veerayya Review: ‘వాల్తేరు వీరయ్య’ రివ్యూ

Valtheru Veerayya Review:


నటీనటులు: చిరంజీవి, రవితేజ, శ్రుతిహాసన్‌, కేథరిన్‌ ట్రెసా, రాజేంద్రప్రసాద్‌, ప్రకాశ్‌రాజ్‌, బాబీ సింహా, నాజర్‌, సత్యరాజ్‌, వెన్నెల కిషోర్‌, శ్రీనివాసరెడ్డి, సప్తగిరి, షకలక శంకర్‌, ప్రదీప్‌ రావత్‌ తదితరులు
నిర్మాణ సంస్థ:మైత్రీ మూవీ మేకర్స్‌
నిర్మాతలు: నవీన్‌ యెర్నేని,రవిశంకర్‌
దర్శకత్వం: కేఎస్‌ రవీంద్ర(బాబీ)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌
సినిమాటోగ్రఫీ: ఆర్థర్ ఎ.విల్సన్‌
స్క్రీన్‌ప్లే: కోన వెంకట్‌, కె.చక్రవర్తి
ఎడిటర్‌:నిరంజన్‌ దేవరమన్నె
విడుదల తేది: జనవరి 13,2023

సంక్రాంతి పండగలో సినిమాలు కూడా ఒక భాగం అయిపోయాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్‌కు వెళ్లి సినిమా చూస్తే ఆ మజానే వేరు. అందులో ఈ సంక్రాంతికి ఇద్దరు అగ్రహీరోల సినిమాలు విడుదలయ్యాయి. నిన్న బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ విడుదల అవగా.. నేడు చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘అన్నయ్య’ తర్వాత మెగాస్టార్‌తో కలిసి రవితేజ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న చిత్రం కావడంతో ‘వాల్తేరు వీరయ్య’పై ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా బాస్‌ సాంగ్‌, పూనకాలు లోడింగ్‌ పాటలు జనాల్లోకి బాగా వెళ్లాయి. సినిమా ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో వాల్తేరు వీరయ్యపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? ‘వాల్తేరు వీరయ్య’గా చిరంజీవి వింటేజ్‌ మాస్‌ లుక్‌లో ఏ మేరకు మెప్పించారు? అనేది తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే…


కథ:
వైజాగ్‌లోని జాలరిపేటకు చెందిన వీరయ్య(చిరంజీవి) పోర్ట్‌లో ఓ ఐస్‌ ఫ్యాక్టరీ నడుపుతుంటాడు. సముద్రం గురించి పూర్తిగా తెలిసిన అతను.. అవసరం అయినప్పుడు నేవీ అధికారులకు కూడా సహాయం చేస్తుంటాడు. వీరయ్య వీరత్వం గురించి తెలుసుకున్న పోలీసు అధికారి సీతాపతి(రాజేంద్ర ప్రసాద్‌).. తన సహోద్యోగులను కిరాతకంగా చంపి, తన సస్పెండ్‌కు కారణమైన డ్రగ్‌ డీలర్‌ సాల్మన్‌ సీజర్‌(బాబీ సింహా)ను మలేషియా నుంచి ఇండియాకు తీసుకురావాల్సిందిగా కోరతాడు. దీని కోసం రూ.25 లక్షలతో డీల్‌ కుదుర్చుకుంటాడు. అలా మలేషియా వెళ్లిన వీరయ్య.. సాల్మన్‌ని ఎరగా వేసి అతని అన్నయ్య మైఖేల్‌ సీజర్‌ అలియాస్‌ కాలా(ప్రకాశ్‌ రాజ్‌)ను ఇండియాకు రప్పించాలనుకుంటాడు. అసలు మైఖేల్‌ సీజర్‌కు, వీరయ్యకు మధ్య ఉన్న వైరం ఏంటి? మలేషియాలో వీరయ్యకు పరిచయమైన అదితి(శ్రుతిహాసన్‌) ఎవరు? వీరయ్య సవతి సోదరుడైన ఏసీపీ విక్రమ్‌ సాగర్‌(రవితేజ) గతమేంటి? డ్రగ్స్‌ కేసుకు, వీరయ్యకు ఉన్న సంబంధం ఏంటి? మైఖేల్‌పై వీర‌య్య పోరాటం ఎలా సాగింది? తనను ఇండియాకు తీసుకెళ్లమని మైఖేలే స్వయంగా వీరయ్యను వేడుకోవడం వెనుక ఏం జరిగింది అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ:

చిరంజీవి కమ్ బ్యాక్ తర్వాత చేసిన ‘ఖైదీ నంబర్ 150’, ‘సైరా నరసింహారెడ్డి’, ‘ఆచార్య’, ‘గాఢ్ ఫాదర్’ చిత్రాలు దేనికవే డిఫరెంట్‌ స్టోరీలు. అయితే ఈ సారి మాత్రం చిరంజీవి ఒక రోటీన్ స్టోరీతో సంక్రాంతి బరిలో నిలిచారు. ‘వాల్తేరు వీరయ్య’ ఒక రోటీన్ స్టోరీ అని ప్రెస్‌మీట్‌లో చిరంజీవే స్వయంగా చెప్పడంతో స్టోరీ గురించి ప్రేక్షకులు ఎక్కువగా ఆశలు పెట్టుకోలేదు. అయితే ఇందులో వింటేజ్ చిరంజీవి కనిపించడమే అభిమానులకు ఊపునిచ్చే విషయం. చిరంజీవి సినిమా అనగానే ఫైట్‌ సీన్స్‌, డ్యాన్స్‌, కామెడీ ఉండాలని అభిమానులు కోరుకుంటారు. అందుకే కథ ఎలా ఉన్నా.. ఈ హంగులన్నీ పక్కాగా ఉండేలా దర్శకుడు బాబీ సినిమాను తెరకెక్కించారు. చిరంజీవి ఇమేజ్‌‌ను దృష్టిలో పెట్టుకుని దానికి త‌గ్గట్టుగా స‌న్నివేశాలు డిజైన్ చేసుకొవడంతో ఎక్కడా బోర్‌ కొట్టిన ఫీలింగ్‌ రాదు. అలాగే మాస్‌ మహారాజ రవితేజ ఉండడం సినిమాకు మరింత ప్లస్‌ అయింది. పోలీస్ స్టేషన్‌లోనే పోలీసులను సాల్మన్‌ అతికిరాతంగా చంపడంతో సినిమా ప్రారంభం అవుతుంది. ఫస్ట్‌ సీన్‌లోనే విలన్‌ పాత్ర ఎంత కిరాతకంగా ఉండబోతుందో చూపించాడు దర్శకుడు. ఆ తర్వాత నేవీ దళాన్ని కాపాడడానికి సముద్రంలో వీరయ్య చేసే ఓ భారీ యాక్షన్ సీన్‌తో హీరో ఇంట్రడక్షన్‌ ఉంటుంది. మంచి ఎలివేష‌న్స్‌తో ఒక‌ప్ప‌టి చిరంజీవిని గుర్తు చేశాడు ద‌ర్శ‌కుడు. వీరయ్య మలేషియాకు షిఫ్ట్‌ అయ్యాక వచ్చే కామెడీ సీన్స్‌ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా సాల్మన్‌ని కిడ్నాప్‌ చేయడానికి వీరయ్య టీమ్‌ వేసే ప్లాన్‌ నవ్వులు పూయిస్తుంది. వెన్నెల కిషోర్‌, చిరంజీవి, ఆయ‌న గ్యాంగ్ మ‌ధ్య స‌న్నివేశాలు న‌వ్విస్తాయి. అలాగే శ్రుతిహాసన్‌తో చిరు చేసే రొమాన్స్‌ పర్వాలేదనిపిస్తుంది. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయి.

ఇక అసలు కథ మొదలయ్యేది సెకెండాఫ్‌లోనే. ఏసీపీ విక్రమ్‌ సాగర్‌గా రవితేజ ఎంట్రీ, అన్నదమ్ముల మధ్య వచ్చే టిట్‌ ఫర్‌ టాట్‌ ఎపిసోడ్లు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా పోలీస్టేషన్‌లో చిరంజీవి సినిమా డైగాల్‌ రవితేజ చెప్పడం.. రవితేజ సినిమా డైలాగ్‌ చిరంజీవి చెప్పడం హైలైట్‌గా నిలుస్తుంది. అన్నదమ్ముల మధ్య ఎందుకు గ్యాప్‌ వచ్చిందనేది బలంగా చూపించలేదనిపిస్తుంది. వీర‌య్య‌, విక్ర‌మ్ బంధం గురించి చెప్పే సన్నివేశాల్లో భావోద్వేగాలను మరింత బలంగా రాసుకుని ఉంటే సెకెండాఫ్ ఇంకా బాగుండేది. అయితే కారులో చిరంజీవి, రవితేజ మాట్లాడుకోవడం.. చిరు కన్నీళ్లు పెట్టుకునే మాత్రం ప్రేక్షకులను ఎమోషనల్‌కు గురిచేస్తుంది. ఈ మధ్య పాపులర్ అయిన జంబలకిడి జారు మిఠాయి, చేసే మూడు ఉత్సాహం దొబ్బింది…. అనే మాట‌ల్ని ఇందులో చిరంజీవితో చెప్పించడం బాగుంది. ఇక డ్రగ్స్‌ ముఠాను పట్టుకునే సీన్స్‌ కూడా పేలవంగా ఉంటాయి. క్లైమాక్స్‌ కూడా రొటీన్‌గా అనిపిస్తుంది. అయితే చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టుగా స‌న్నివేశాలు డిజైన్ చేసుకోవడంలో మాత్రం డైరెక్టర్ బాబీ సఫలం అయ్యాడు. కొంచెం రిస్క్ తీసుకుని క్లైమాక్స్‌ను ఇంకోలా రాసుకుని ఉంటే సినిమా ఇంకా బాగుండేదేమో.

నటీనటుల విశ్లేషణ:
మెగాస్టార్ చిరంజీవి తను ఇది వరకే చేసిన ఎన్నో పాత్రల అనుభవంతో ఈ సినిమాలో మరింత మెరుగ్గా నటించారు. ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసే చిరంజీవి.. చేపలు పట్టే జాలరి వీరయ్య పాత్రలో జీవించేశాడు. చాలా కాలం తర్వాత మెగాస్టార్‌ని మాస్‌ లుక్‌లో చూస్తారు. ఒకప్పుడు చిరు చేసే కామెడీ, ఫైట్‌ సీన్స్‌ అన్ని ఇందులో ఉంటాయి. తెరపై చాలా యంగ్‌గా కనిపిస్తాడు. జాలరిపేట యాసలో అదరగొట్టేశాడు. ఇక ఏసీపీ విక్రమ్‌గా రవితేజ తనకు అలవాటైన పోలీస్ పాత్రలో అదరగొట్టేశాడు. తెలంగాణ యాసకు తగ్గట్లు డైలాగ్‌ డెలివరీ కూడా బాగుంది. ఇక అదితిగా శ్రుతిహాసన్‌ ఉన్నంతలో చక్కగా నటించింది. కేథ‌రిన్ కొన్ని స‌న్నివేశాల‌కే ప‌రిమిత‌మైంది. అయితే ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు. కానీ ఫైట్‌ సీన్‌లో మాత్రం అదరగొట్టేసింది. ‘క్రాక్’ తర్వాత ఆ స్థాయిలో ఆమె యాక్షన్ సీన్స్ చేసింది. డ్రగ్స్‌ మాఫీయా లీడర్‌ సాల్మన్‌ సీజర్‌గా బాబీ సింహా, అతని అన్న మైఖేల్‌గా ప్రకాశ్‌ రాజ్‌ తమ పాత్రలకు న్యాయం చేశారు. కానీ వాళ్లది రొటీన్‌ విలనిజమే. వెన్నెల కిషోర్‌, స‌త్య‌రాజ్ కామెడీ పంచ్‌లు బాగున్నాయి. పోలీసు అధికారి సీతాపతిగా రాజేంద్రప్రసాద్‌తో పాటు షకలక శంకర్‌, శ్రీనివాస్‌ రెడ్డి, ప్రవీణ్‌ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

సాంకేతిక విశ్లేషణ:

ఇక సాంకేతిక విషయానికొస్తే.. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు ప్రధాన బలం. చిరంజీవి వీరాభిమాని అయిన దేవిశ్రీ ‘బాస్ పార్టీ’ నుంచి ‘పూనకాలు లోడింగ్’ పాట వరకు తన బాణీలతో ఆకట్టుకున్నాడు. నేపథ్యం సంగీతంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. ఆర్థర్ ఎ.విల్సన్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. స‌ముద్రం నేప‌థ్యంలో స‌న్నివేశాలు మొద‌లుకొని పాట‌లు, పోరాట ఘ‌ట్టాల్లో హంగులు మెప్పిస్తాయి. డైరెక్టర్ బాబీ ఒక మెగాభిమానిగా చిరంజీవి అభిమానులకు ఏం కావాలో వాటిని సినిమాలో పొందుపరడంలో సక్సెస్ అయ్యాడు.ఇక రెండు పెద్ద సినిమాలను ఒక రోజు గ్యాప్‌లో సంక్రాంతి బరిలో నిలిపిన మైత్రీమూవీ మేకర్స్ సంస్థ దర్శకులు అడిగిన దానికంటే ఎక్కువే ఖర్చు పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ సినిమాలో ఓ పాట కోసమే భారీగా ఖర్చు చేశారు. అదంతా సినిమాలో కనిపిస్తుంది.

చివరిగా.. మెగాభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా మెప్పించే ‘వీరయ్య’
రేటింగ్: 3/5

—-బిల్లా గంగాధర్

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×