Nigeria Explosion : ఉత్తర నైజీరియాలోని నైజర్ స్టేట్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అక్రమంగా ఇంధనాన్ని ఒక ట్యాంకర్ నుంచి మరో ట్యాంకర్లోకి మార్చుతుండగా.. భారీ పేలుడుతో ట్యాంకర్ పేలిపోయింది. ఈ ఘటనలో ఏకంగా 70 మంది మరణించారు. దాంతో.. ఆ ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని నైజీరియా జాతీయ అత్యవసర ఏజెన్సీ వెల్లడించింది. శనివారం తెల్లవారుజామున సులేజా ప్రాంతానికి సమీపంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపిన అధికారులు.. జనరేటర్‌ను వాడి పెట్రోల్‌ను మార్చేందుకు ప్రయత్నిస్తుండగా పేలుడు సంభవించిందని తెలిపారు.
ఈ ఘటన సమాచారం అందుకున్న తర్వాత అక్కడికి చేరుకున్న ప్రభుత్వం అధికారులు, పోలీసులు.. ప్రమాదంలో మరణించిన 70 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటు మరో 56 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. ట్యాంకర్ పేలిపోయిన దగ్గర్లో చుట్టుపక్కల 15కు పైగా దుకాణాలు ధ్వంసమయ్యాయని నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అథారిటీ తెలిపింది. ఫెడరల్ రోడ్ సేఫ్టీ కార్ప్స్ (ఎఫ్‌ఆర్‌ఎస్‌సి) అధికారులు మాట్లాడుతు.. ఓ ట్యాంకర్ పేలిపోవడంతో రెండో ట్యాంకర్ కింద పడిపోయింది. అందులోని పెట్రోల్ తీసేందుకు సమీపంలోని ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడారని.. దాంతో.. అక్కడికి చేరుకున్న వారంతా మంటల్లో చిక్కుని గుర్తు పట్టలేకుండా కాలిపోయారని అధికారులు వెల్లడించారు.
ఈ ప్రమాదంలో మరణించిన వారిని గుర్తించడం చాలా కష్టంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వారి శరీరాలు, ముఖాలు పూర్తిగా కాలిపోయి ఉన్నాయని.. మృతులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కాగా.. ప్రమాద ఘటన తర్వాత అక్కడికి చేరుకున్న నైజీరియా అగ్నిమాపక సిబ్బంది.. మంటల్ని అదుపులోకి తీసుకువచ్చాయి. ఈ ప్రమాదంపై స్పందించిన నైజర్ గవర్నర్ మహమ్మద్ బాగో.. తీవ్ర దిగ్భృంతి వ్యక్తం చేశారు. మృతులకు తీవ్ర సంతాపం ప్రకటించారు. ఈ ఘటన తీవ్ర హృదయ విదారకమైనదని, దురదృష్టకరమైనదని వ్యాఖ్యానించారు.
ట్యాంకర్ ప్రమాదాలు సర్వసాధారణం
ఆఫ్రికాలోని అతిపెద్ద చమురు ఉత్పత్తిదారులో నైజీరియా దేశం ఒకటి. అక్కడ జీవన వ్యయాలు ఎక్కువగా ఉండడం, తీవ్ర పేదరికంతో బాధపడుతున్న ప్రజలు.. అక్రమ మార్గాల్లో ఇంధనాల్ని అమ్ముకుంటూ, కొనుగోలు చేస్తుంటారు. దాంతో.. ప్రమాదకర రీతుల్లో ఇంధనాల్ని తరలించడం, ప్రభుత్వానికి తెలియకుండా అక్రమంగా రవాణా చేయడం సాధారణమైపోగా.. ఆ మేరకు ప్రమాదాలు సైతం పెరిగిపోయినట్లు అధికారులు తెలుపుతున్నారు. ఇంధన ట్యాంకర్ల ప్రమాదాల కారణంగా.. ఏటా వందల మంది మరణిస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
నైజీరియాలో 2023లో అధ్యక్షుడిగా బోలా టినుబు బాధ్యతలు చేపట్టిన తర్వాత.. దశాబ్దాలగా ఆ దేశంలో కొనసాగుతున్న సబ్సిడీని రద్దు చేశారు. దాంతో.. నైజీరియాలో పెట్రోల్ ధర 400 శాతానికి పైగా పెరిగింది. దీంతో.. ట్యాంకర్ ట్రక్ ప్రమాదాల సమయంలో ఇంధనాన్ని తస్కరించేందుకు ప్రయత్నిస్తూ.. వందల మంది చనిపోతున్నారు.
గతేడాది అక్టోబర్ లో ఉత్తర నైజీరియాలోని జిగావా రాష్ట్రంలోనూ దాదాపు ఇలాంటి సంఘటన జరిగింది. ఈ ఘటనలో ఏకంగా 150 మందికి పైగా మరణించగా, మరో 100 మంది తీవ్రంగా గాయపడ్డారు. బోల్తా పడిన ట్యాంకర్ నుంచి ఆయిల్ తీసేందుకు ప్రయత్నించిన సమయంలో ప్రమదం జరిగింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వమే అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. భారీ స్థాయిలో ఒకేసారి వారి మృతదేహాల్ని పూడ్చిపెట్టారు.
అలాగే.. నెల రోజులు తిరగకుండానే.. నైజర్ స్టేట్‌లో ప్రయాణికులు, పశువులను తీసుకు వెళుతున్న ట్రక్కును ఇంధన ట్యాంకర్ ఢీకొనడంతో మరో 59 మంది మరణించారు. అక్టోబర్ సంఘటన తర్వాత, నైజీరియా అధ్యక్షుడు టినుబు ఇంధన రవాణా భద్రతా ప్రోటోకాల్‌లను సమీక్షించి, మెరుగుపరచాలని అధికారుల్ని ఆదేశించారు. ఇంధన ట్యాంకర్ల నుంచి అక్రమంగా ఇంధనాన్ని తీయడం, బ్లాక్ మార్కెట్లో విక్రయించడం వంటి వాటిని నియంత్రించేందుకు అధికారులకు ఆదేశారు జారీ చేశారు.
Also Read : ఇజ్రాయెల్, హమాస్ శాంతి సందేశం.. కాల్పుల విరమణకు కుదిరిన సంధి
దేశంలో అక్రమ ఇంధన విక్రయాలను అడ్డుకునేందుకు పెట్రోలింగ్‌ను పెంచడం, భద్రతా నిబంధనలను పటిష్టంగా అమలు చేయడం, హైవే సేఫ్టీ మెకానిజమ్‌లతో సహా మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమైన జలమార్గాలపై గన్‌బోట్‌లను రంగంలోకి దించడంతో పాటు చమురు దొంగతనానికి వ్యతిరేకంగా పోరాడే ప్రయత్నంలో అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాలని సూచించారు.