టెల్అవీవ్, స్వేచ్ఛ: హమాస్ ఉగ్రవాదులు 2023 అక్టోబర్ 7న సృష్టించిన నరమేధానికి ప్రతీకారంగా పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ సేనలు కొనసాగిస్తున్న మారణహోమానికి తెరపడింది. ఇజ్రాయెల్, హమాస్‌ల కాల్పుల విరమణకు సంధి కుదిరింది. వివాదానికి శాశ్వత పరిష్కారాన్ని కనుగొనే క్రమంలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ, బందీల విడుదలకు ఒప్పందం కుదిరిందని మధ్యవర్తులుగా వ్యవహరించిన అమెరికా, ఖతార్ ప్రభుత్వాలు గురువారం అధికారికంగా ప్రకటించాయి.
బందీలను క్రమంగా విడిచిపెట్టేందుకు హమాస్ నాయకులు అంగీకరించినట్టు తెలిపాయి. ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ సేవలు తొలి ఆరు వారాల్లో సెంట్రల్ గాజాను క్రమంగా వీడనున్నాయి. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిన పాలస్తీనా వాసులను ఉత్తర గాజా ప్రాంతంలోకి అనుమతిస్తారు. ఇక, తమ చెరలో ఉన్న 33 మంది ఇజ్రాయిలీ బందీలను హమాస్ నాయకులు క్రమంగా విడిచిపెట్టనున్నారు. వారానికి కొంతమంది చొప్పున రిలీజ్ చేయనున్నారు. ముందుగా 19 ఏళ్ల వయసున్నవారిని విడుదల చేస్తారు. ఆ తర్వాత మహిళలకు విముక్తి కల్పిస్తారు. హమాస్ విడిచిపెట్టే ఒక్కో బందీకి బదులుగా తమ జైళ్లలో ఉన్న 30 మంది పాలస్టీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయనుంది.
మరోవైపు, మొత్తం 600 ట్రక్కుల మానవతా సాయం పాలస్తీనాకు అందించాల్సి ఉంటుంది. అందులో చమురు కూడా తప్పనిసరిగా ఉండాలి. సంధిని పకడ్బందీగా అమలు చేసే బాధ్యతలను అమెరికా, ఖతర్, ఈజిప్ట్ తీసుకున్నారు. ఈ మూడు దేశాలు మధ్యవర్తులుగా వ్యవహరించనున్నాయి. అగ్రిమెంట్ తదుపరి దశలో గాజా పునర్నిర్మాణంపై నిర్ణయాలు, ప్రణాళికలు ఉంటాయి. కాగా, హమాస్‌పై ఇజ్రాయెల్ జరిపిన ప్రతీకార దాడుల్లో వేల సంఖ్యల్లో జనాలు ప్రాణాలు కోల్పోయారు. గురువారం కూడా ఇజ్రాయెల్ సేనలు జరిపిన దాడుల్లో 80 మందికిపైగా చనిపోయిన విషయం తెలిసిందే.
సంధిపై హర్షాతిరేకాలు
ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో గాజా వాసులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఇకపై శాంతియుతంగా బతకవచ్చని వారు భావిస్తున్నారు. వివిధ దేశాల్లో ఉంటున్న పాలస్తీనా వాసులు బాణాసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన చివరి ప్రసంగంలో ఈ ఒప్పందాన్ని ప్రస్తావించారు. గతంలో తాను పేర్కొన్న విషయాలు అగ్రిమెంట్‌లో ఉన్నాయని, దాదాపు 8 నెలల చర్చల అనంతరం అగ్రిమెంట్ ఫలించిందని ఆయన పేర్కొన్నారు. మరో మూడు రోజుల్లో అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు.
నవంబర్ జరిగిన ఎన్నికల్లో తన విజయం ఫలితంగా ఏర్పాటు కాబోయే ప్రభుత్వం శాంతిని ఆకాంక్షిస్తోందనే ఈ సంధి ద్వారా చాటి చెప్పిందని అన్నారు. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో స్పందిస్తూ ఈ సంధి రాజకీయ పరిష్కారానికి బాటలు వేస్తుందని వ్యాఖ్యానించారు. గాజాలో సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కీలకమైన ముందడుగు అని జపాన్ వ్యాఖ్యానించింది. ఈ ఒప్పందంపై ఆస్ట్రేలియా కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వానికి ఉపయోగపడుతుందని పేర్కొంది. మరోవైపు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ కూడా ఈ సంధిపై సంతోషం వ్యక్తం చేశారు. పాలస్తీనా ప్రజలు ఈ చక్కటి అవకాశాన్ని మెరుగైన భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కీలక సంధిని కుదర్చడంలో మధ్యవర్తులుగా వ్యవహరించిన ఈజిప్ట్, ఖతర్, అమెరికాలను ఐరాస చీఫ్ మెచ్చుకున్నారు.
Also Read: టిక్ టాక్ ఇక మస్క్ చేతికి?.. విక్రయించే యోచనలో చైనా