MahaKumbh 2025: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా ప్రారంభమైంది. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. ఈసారి మహాకుంభమేళాలో 40 కోట్ల మందికి పైగా భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. మహాకుంభమేళా తొలిరోజు నుంచే ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు భారీగా తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో పెద్ద ఎత్తున భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటి వరకు 3.5 కోట్లకు పైగా భక్తులు సంగం తీర్ధాల్లో పుణ్య స్నానాలు ఆచరించారు.
144 సంవత్సరాల తర్వాత మొదటి స్నానముతో మహా కుంభమేళా జనవరి 13 న ప్రారంభమైంది. గంగా, యమునా, అదృశ్య సరస్వతి త్రివేణి ఒడ్డున 45 రోజుల పాటు కుంభమేళా కొనసాగుతుంది.
యుగాల క్రితం సముద్ర మథనం సందర్భంలో భూమిపై పడిన కొన్ని అమృతపు చుక్కలతో ప్రారంభమైన కుంభస్నానం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈసారి మహాకుంభ మేళాకు 183 దేశాల నుంచి ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ విదేశీ అతిథులను స్వాగతించడానికి, ఆతిథ్యం ఇవ్వడానికి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం భారీ సన్నాహాలు చేసింది.
యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చిన మహాకుంభమేళాను ప్రపంచం ముందు అద్భుతంగా ప్రదర్శించాలని కేంద్ర, యూపీ ప్రభుత్వాలు భావిస్తున్నాయి. కుంభమేళా ప్రాంతంలో ప్రతిరోజు 800కు పైగా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేందుకు ఏర్పాట్లు చేశారు. తొలిసారిగా 10 లక్షల చదరపు అడుగుల్లో గోడలకు సాంప్రదాయ కళలకు సంబంధించిన పేయింటింగ్ కూడా వేశారు. ఈ సమయంలోనే అక్కడక్కడా 72 దేశాలకు సంబంధించిన జెండాలు కూడా ఏర్పాటు చేశారు. ఆయా దేశ ప్రతినిధులు కూడా ఫెయిర్‌లో పాల్గొనడానికి వస్తున్నారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా వారికి స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేశారు.
Also Read: మహిళా నాగసాధువులు ఎక్కడ ఉంటారు ? వీరి గురించి ఒళ్లు గగుర్పొడిచే నిజాలు !
ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ , అరబ్ దేశాల వారు కూడా మహాకుంభమేళాకు హాజరు అవుతున్నారు. మహాకుంభమేళా కేవలం భారతీయ కార్యక్రమం మాత్రమే కాదు, ప్రస్తుతం ఇది ప్రపంచ పండుగగా మారింది. మహాకుంభమేళా 2025 కు బ్రెజిల్, జర్మనీ, జపాన్, ఇంగ్లండ్, అమెరికా, స్పెయిన్ వంటి దేశాల నుండి కూడా భక్తులు ప్రయాగరాజ్ చేరుకోవడం ప్రారంభించారు. ఈ సంఘటన ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సనాతన సంస్కృతి పెరుగుతున్న ఆదరణకు ఉదాహరణగా నిలిచింది. విశేషమేమిటంటే పాకిస్థాన్, అరబ్ సహా ఇస్లామిక్ దేశాలు కూడా మహాకుంభ మేళాపై ఆసక్తి చూపడం. గూగుల్ ట్రెండ్స్ ప్రకారం భారతదేశంలో నిర్వహిస్తున్న మహాకుంభమేళా గురించి ఇస్లామిక్ దేశాల ప్రజలు కూడా సెర్చ్ చేస్తున్నారట.
పాకిస్తాన్‌లో మహా కుంభమేళా గురించి చర్చ:
మహా కుంభమేళా కోసం గూగుల్‌లో వెతుకుతున్న దేశాల జాబితాను పరిశీలిస్తే, మనల్ని ఎక్కువగా ఆశ్చర్యపరిచే మొదటి పేరు పాకిస్థాన్. అక్కడి ప్రజలు భారత్‌లో మహా కుంభ నిర్వహణ , ఇక్కడ ఏర్పాట్లతో పాటు సాంస్కృతి, సాంప్రదాయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారట. పాకిస్థాన్ తర్వాత ఖతార్, యూఏఈ, బహ్రెయిన్ వంటి దేశాలు మహాకుంభమేళాపై ఆసక్తి కనబరుస్తున్నాయి. దీంతో పాటు నేపాల్, సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్, బ్రిటన్, థాయ్‌లాండ్, అమెరికా వంటి దేశాలకు చెందిన వారు కూడా మహాకుంభమేళా గురించి సెర్చ్ చేస్తూ.. చదువుతున్నారట.