US China Tariff War India:అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధానికి (Trade War) చైనా (China) నుంచి తీవ్ర ప్రతిస్పందన వచ్చింది. చైనా నుంచి దిగుమతి అయ్యే అన్ని ఉత్పత్తులపై 10% సుంకం విధిస్తూ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. దీనికి ప్రతిస్పందనగా, చైనా కూడా అమెరికా నుంచి దిగుమతి అయ్యే బొగ్గు, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్‌లపై 15% సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. చమురు, వ్యవసాయ పరికరాలపై 10% సుంకం విధిస్తున్నట్లు కూడా స్పష్టం చేసింది. అదేవిధంగా, టంగ్‌స్టన్ సంబంధిత పదార్థాల ఎగుమతులపై నియంత్రణలు విధించింది. పీవీహెచ్ కార్పొరేషన్, ఇల్యుమినా ఇంక్ వంటి అమెరికా సంస్థలను “విశ్వసనీయత లేనివి”గా ప్రకటించింది.
ఇంకా, అనైతిక వ్యాపార పద్ధతులు అనుసరిస్తున్న అమెరికా సెర్చ్ ఇంజిన్ టెక్ దిగ్గజం గూగుల్‌పై కూడా చైనా విచారణ జరపనుందని తెలిపింది. ఈ రెండు పెద్ద దేశాలు ఒకదానిపై ఒకటి సుంకాలు విధించుకోవడంతో, వాణిజ్య యుద్ధం (Trade War) ప్రారంభమైంది. ఇప్పటికే చైనా కరెన్సీ యువాన్ విలువ పతనమైంది. ఈ ప్రభావం ఇతర దేశాల కరెన్సీలపై కూడా పడింది. ఆస్ట్రేలియా డాలర్, న్యూజిలాండ్ డాలర్ విలువలు కూడా పడిపోయాయి.
చైనా ప్రతిస్పందన
ట్రంప్ సుంకాలు విధించడంపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)లో సవాలు చేస్తామని ప్రకటించింది. తమ దేశ ప్రయోజనాలు మరియు హక్కులను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చైనా తెలిపింది. ఇతర దేశాలను సుంకాలతో బెదిరించకుండా, ఫెంటానిల్ లాంటి సమస్యలను సొంతంగా పరిష్కరించుకోవాలని అమెరికాకు చైనా సలహా ఇచ్చింది. తాజాగా సుంకాల రూపంలో ప్రతిచర్య తీసుకుంది.
Also Read: అమెరికాలో విలవిల్లాడుతున్న భారతీయ విద్యార్థులు.. ఫీజులు, ఖర్చులకు డబ్బుల్లేవ్
మెక్సికో, కెనడాపై ట్రంప్ చర్యలు
ముందుగానే హెచ్చరించినట్లుగానే, ట్రంప్ తన పొరుగు దేశాలైన మెక్సికో మరియు కెనడాపై కూడా సుంకాల కొరడా ఝళిపించారు. ఈ రెండు దేశాల నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై 25% సుంకాలు విధించారు. అయితే, తర్వాత ట్రంప్ ఈ రెండు దేశాలకు కొంత ఉపశమనం కల్పించారు. మెక్సికో మరియు కెనడా అధినేతలు అమెరికా సరిహద్దుల వద్ద భద్రతను మెరుగుపరచడంతో, టారిఫ్‌ల (US Tariffs) అమలును నెల రోజుల పాటు నిలిపివేశారు.
భారత్‌కు మంచి అవకాశం
అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం (Trade War) వల్ల, ఆయా దేశాల్లో కొన్ని వస్తువుల ధరలు గణనీయంగా పెరగవచ్చు. ఈ పరిస్థితిలో అమెరికాకు ఎగుమతులు పెంచడం ద్వారా భారత ఎగుమతిదారులు ప్రయోజనం పొందవచ్చని సంబంధిత వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ట్రంప్ తొలి హయాంలో చైనాపై సుంకాలు విధించినప్పుడు ప్రధానంగా లాభపడిన నాలుగు దేశాల్లో భారత్ ఒకటని విశ్లేషకులు గుర్తుకు చేస్తున్నారు.
‘‘ధరల పెరుగుదల వల్ల అమెరికా కొనుగోలుదారులు ప్రత్యామ్నాయాల వైపు తిరుగుతారు. ఈ పరిణామాలు భారత్ ఎగుమతులకు మరిన్ని అవకాశాలు సృష్టించవచ్చు. విద్యుత్ యంత్రాలు, ఆటో పరికరాలు, మొబైల్, ఫార్మా, రసాయనాలు, దుస్తులు, వస్త్ర రంగాలు లాభపడవచ్చు’’ అని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ (FIEO) డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ తెలిపారు. అయితే, ఈ ప్రయోజనాలు భారత ఉత్పత్తి సామర్థ్యం మరియు పోటీతత్వంపై ఆధారపడి ఉంటాయన్నారు.
అమెరికా వినియోగదారులపై ప్రభావం
రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్, తన ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలు పెంచే ఆదేశాలపై సంతకం చేశారు. దీంతో అమెరికా మార్కెట్లో చైనా ఉత్పత్తుల ధరలు పెరగడం, పోటీ తగ్గడం వల్ల చైనా ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందని ఎగుమతిదారులు చెబుతున్నారు. అమెరికా వినియోగదారులపై కూడా ధరల పెరుగుదల ప్రభావం పడవచ్చనే ఆందోళనలు మొదలయ్యాయి. భారత్ నుంచి ఎగుమతి అవకాశాలను మరింత పెంచేందుకు ఈ పరిణామాలు దోహదం చేయవచ్చని భారత వాణిజ్య నిపుణులు అంచనా వేస్తున్నారు.