డొనాల్డ్ ట్రంప్ ని దగ్గరగా చూసిన వారెవరికైనా ఏంటి ఇంత తేడాగా ఉన్నాడని అనిపించక మానదు. ఆయన హావభావాలు, వింతన చేష్టలు.. ఇవన్నీ చూస్తే అగ్రరాజ్యం అధినేత ఈయనేనా అనిపిస్తుంది. 79ఏళ్ల వయసులో డొనాల్డ్ ట్రంప్ ఆ మాత్రం యాక్టివ్ గా ఉండటమే గొప్ప అనుకోవచ్చు. కానీ ఆయన ఆరోగ్యం అంత స్థిరంగా లేదు అనేది మాత్రం పచ్చి వాస్తవం. డొనాల్డ్ ట్రంప్ పైకి గట్టిగానే కనపడుతున్నా, ఆయన్ను “క్రానిక్ వీనస్ ఇన్ సఫిషియెన్సీ” (CVI) అనే వ్యాధి చాన్నాళ్లుగా కుంగదీస్తోంది. దీనివల్ల ఆయన తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడని తెలుస్తోంది.
కాళ్ల వాపు..
ఇటీవల డొనాల్డ్ ట్రంప్ పర్యటనల్లో ఆయన కాళ్లు వాచిపోయి ఉండటాన్ని చాలామంది ఫొటోగ్రాఫర్లు హైలైట్ చేశారు. విదేశీ పర్యటనల్లో కూడా ఇది గమనించవచ్చు. చేతి వేళ్లపై ఉన్న నరాలు కూడా వాచిపోయినట్టు కనపడుతున్నాయి. ఇది CVI వ్యాధి ప్రాథమిక లక్షణం. ఈ వ్యాధితో ట్రంప్ బాధపడుతున్నట్టు వైట్ హౌస్ వర్గాలు అధికారికంగా ప్రకటించడం విశేషం. ఈ వ్యాధి వల్ల కాళ్లు, చేతులు వాచిపోయి కనపడతాయి. మనిషి ఉన్నచోట కుదురుగా ఉండలేడు, ఒకే చోట ఎక్కువ సమయం కూర్చోవడానికి వీలు కాదు. అలాగని ఎక్కువసేపు నిలబడి ఉండటం కూడా సాధ్యం కాదు. ఓవైపు బాధ ఉన్నా కూడా ట్రంప్ యాక్టివ్ గా ఉండటం, తన పనులకోసం ఇతరులపై ఆధారపడకపోవడం మాత్రం విశేషం.
CVI వ్యాధి ఎవరికి వస్తుంది..?
సహజంగా వృద్ధాప్యంలో ఉన్న వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ. ట్రంప్ వయసు 79 ఏళ్లు కాబట్టి ఆయనకు ఇది సహజంగా సంక్రమించిందేనని చెప్పుకోవాలి. రెండోసారి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఆయనకు ఈ సమస్య ఎక్కువైంది. గుండెనుంచి మంచి రక్తం ధమనుల ద్వారా శరీర అవయవాలకు చేరుతుంది. అక్కడ్నుంచి చెడు రక్తం సిరల ద్వారా తిరిగి గుండెకు చేరుకుంటుంది. అయితే రక్తం సిరల ద్వారా గుండెకు తిరిగి వెళ్లకపోవడమే ఈ వ్యాధి లక్షణం. ఇలా రక్తం పైకి ప్రసరించకపోవడంతో కాళ్లలో పేరుకుపోయి వాపుకి దారి తీస్తుంది. దీంతో కాళ్లు బరువు, తిమ్మిర్లు, దురద, కాళ్లపూత, చీలమండలంలో నొప్పి వంటి లక్షణాలు కనపడతాయి.
పరిష్కారమేంటి..?
CVI అనే వ్యాధి ప్రమాదకరమైనది కాదు. ఇది ప్రాణాంతకం కాదు కానీ, మనిషిని మాత్రం మానసికంగా, శారీరకంగా కుంగదీస్తుంది. మందులతో దీన్ని పరిష్కరించడం కంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బందులు తగ్గించుకోవచ్చని చెబుతుంటారు వైద్యులు. రక్తం సాఫీగా కాళ్ల నుంచి గుండెకు చేరే విధంగా పడుకునే సమయంలో కాళ్లకింద తలగడ పెట్టుకోవాలి. ఒకేచోట ఎక్కువసేపు కూర్చుని ఉండకూడదు. ఊబకాయం ఉన్నవారైతే బరువు తగ్గడం మంచిది. కంప్రెషన్ థెరపీ ద్వారా ఈ వ్యాధి కొంతమేర నయం అవుతుంది. జీవనశైలి మార్పులు, సిరలలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి, వాపును తగ్గించడానికి మందులు వాడాల్సి ఉంటుంది. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ కి వైద్య సహాయం అందుతోంది. అయితే కొన్ని వారాలుగా ఈ సమస్య ఉన్నా ఆయనకు నయం కాలేదని వైట్ హౌస్ వర్గాలంటున్నాయి.